Jasprit Bumrah: నేనిప్పుడే మొదలుపెట్టా.. రిటైర్‌మెంట్‌పై బుమ్రా స్పందన ఇదే..

ఇటీవల టీమ్‌ఇండియాలో కొందరు సీనియర్లు రిటైర్‌మెంట్ ప్రకటించడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్‌కు గురయ్యారు. టీ20 ప్రపంచ కప్‌ను గెలిచామనే ఆనందంతోపాటు కాస్త బాధను ఫ్యాన్స్‌ అనుభవించారు.

Published : 05 Jul 2024 11:33 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ఫార్మాట్‌ (T20 Format) నుంచి స్టార్‌ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వీడ్కోలు పలికేశారు. పొట్టి కప్‌ను (T20 World Cup 2024) సొంతం చేసుకున్నాక వీరంతా తమ నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో బుమ్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. విజయోత్సవం సందర్భంగా విరాట్ కోహ్లీ కూడా బుమ్రా ఎంత కాలం ఆడితే అప్పటి వరకు జట్టులోనే కొనసాగించాలని సూచించాడు. ఈ క్రమంలోనే ముంబయిలోని వాంఖడే వేదికగా జరిగిన కార్యక్రమంలో బుమ్రా తన రిటైర్‌మెంట్ ప్లాన్‌పై స్పందించాడు. అలాంటి ఆలోచనలకు తాను చాలా దూరంగా ఉన్నట్లుగా స్పష్టం చేశాడు.

‘‘నా వరకైతే వీడ్కోలు వంటి వాటికి ప్రస్తుతం చాలా దూరంగా ఉన్నా. నేనిప్పుడు మొదలు పెట్టా. ఇప్పటి వరకు నేను సాధించిన వాటికి ఆనందంగా ఉన్నా. రిటైర్‌మెంట్‌పై ఎలాంటి ఆలోచనలు చేయలేదు. టీ20 ప్రపంచ కప్‌తో ఇక్కడికి వచ్చాక అభిమానుల నుంచి దక్కిన అపూర్వ స్వాగతం ఎప్పటికీ మరిచిపోలేను. మరీ ముఖ్యంగా వాంఖడే మైదానం నాకెంతో స్పెషల్. అండర్-19 కుర్రాడిగా ఇక్కడికి వచ్చా. ముంబయి వీధులన్నీ ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయాయి. ఇంతకుముందు నా కెరీర్‌లో ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా కష్టమైంది. 

ఇప్పటికీ నేను ఓ యువ ప్లేయర్‌గానే భావిస్తా. టీ20 ప్రపంచ కప్‌ కోసం టీమ్‌ఇండియా (Team India) సీనియర్లు, కుర్రాళ్లతో బరిలోకి దిగింది. ప్రతి మ్యాచ్‌లోనూ విజయం సాధించగలమనే నమ్మకంతోనే ఆడాం. రోహిత్, విరాట్ మన లక్ష్యం ఏంటనే దానిపై స్పష్టతతో ఉన్నారు. జట్టును ముందుండి నడిపించారు. ఈ విజయంతో దేశానికి మరింత వన్నె తెచ్చినట్లు అయింది. నా కెరీర్‌లో వరల్డ్‌ కప్‌ను ఎప్పుడూ గెలవలేదు. తప్పకుండా భవిష్యత్తుకు ఇది స్ఫూర్తిగా నిలుస్తుంది’’ అని బుమ్రా స్పష్టం చేశాడు. టీ20 ప్రపంచ కప్‌లో బుమ్రా (Bumrah) ‘ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌’గా నిలిచాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని