Rohit Sharma: సలామ్....శర్మా జీ! హిట్‌ మ్యాన్‌.. నీ ముద్ర చెరిగిపోనిది!

టీ20ల నుంచి రిటైర్‌ అయిన సందర్భంలో హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం...

Updated : 30 Jun 2024 17:13 IST

టీ20 ప్రపంచకప్‌ (T20 World Cup 2024)ను దేశానికి అందించి సగర్వంగా ఆ ఫార్మాట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్న రోహిత్‌ శర్మ (Rohit Sharma)... భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాడు. డ్రెస్సింగ్‌ రూమ్ సంస్కృతిని పూర్తిగా మార్చేశాడు. నాయకుడిగా వ్యక్తిగత రికార్డుల కోసం ఏ దశలోనూ ప్రయత్నించకపోవటం అతనిపై టీమ్ సభ్యుల్లో మరింత గౌరవాన్ని పెంచింది. ఓ రెండు ఓవర్లు నిదానంగా ఆడి ఉంటే సెంచరీ అయిపోతుంది అని అనుకునే రకం కాదు హిట్‌మ్యాన్. 49 దగ్గరున్నా, 98 దగ్గరైనా సరే జట్టు స్కోరు పెంచటం కోసం రిస్కీ షాట్లు ఆడతాడు. ఆ క్రమంలో ఎన్నో సెంచరీలు, హాఫ్‌ సెంచరీలు మిస్ అయ్యాడు. అయినా సరే హిట్‌ మ్యాన్ అనేక రికార్డులను తన పేరుతో సొంతం చేసుకోవడం గమనార్హం. 

కప్ గెలవగానే రిటైర్మెంట్ ప్రకటించిన టీ20 ఫార్మెట్‌ విషయానికే వస్తే... అత్యధిక వ్యక్తిగత పరుగులు (4,231), అత్యధిక సెంచరీలు (5), అత్యధిక సిక్సర్లు (205) వంటి రికార్డులు సొంతం చేసుకున్నాడు. అంతేకాకుండా ఇండియా గెలిచిన రెండు టీ20 ప్రపంచకప్‌ల్లోనూ ఉన్న ఏకైక ఆటగాడు రోహితే. టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం అయిన దగ్గర్నుంచి 9 వరల్డ్‌కప్‌లు ఆడిన ఏకైక ఆటగాడు కూడా హిట్‌మ్యాన్ కావటం విశేషం. టెస్టులైనా, వన్టేలైనా, టీ20 లైనా సరే అత్యధిక సిక్సర్లు (612) కొట్టిన ఏకైక ఆటగాడు రోహితే మాత్రమే. ఈ రికార్డును బద్దలు కొట్టే వారు ఎవరూ కనుచూపు మేరలో కూడా లేకపోవటం విశేషం. రోహిత్ శర్మ తర్వాత వరుస క్రమంలో ఉన్న వారు అందరూ క్రికెట్‌ నుంచి రిటైర్ అయిన వారే కావటం గమనార్హం.

టీ 20 ఫార్మెట్‌లో మోస్ట్ సక్సెస్‌ ఫుల్ కెప్టెన్ రికార్డు రోహిత్ పేరు మీదే ఉంది. టీ 20 ఇంటర్నేషనల్స్‌లో 61 మ్యాచ్‌లకు నాయకత్వం వహించగా వాటిలో 50 విజయాలు ఉండటం విశేషం. టీ 20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ 13 మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించగా అందులో 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఐపీఎల్‌లోనూ అత్యంత విజయవంతమైన ట్రాక్ రికార్డు కెప్టెన్‌గా రోహిత్‌కు ఉంది. ఇక వన్డే వరల్డ్‌ కప్‌లో ఇతని కెప్టెన్సీలో 11 మ్యాచ్‌లు జరగ్గా అందులో 10 ఇండియా గెలిచింది. టెస్టుల్లో 16 మ్యాచ్‌లకు కెప్టెన్సీ చేయగా రెండు డ్రా అయ్యాయి. మిగిలిన 14లో 10 భారత్ నెగ్గింది. వన్డేల్లో 45 మ్యాచ్‌లు రోహిత్ కెప్టెన్సీలో ఇప్పటిదాకా ఆడగా అందులో 34 గెలవటం విశేషం. మొత్తంగా 122 మ్యాచ్‌లకు అతను కెప్టెన్‌గా వ్యవహరించగా అందులో 92 విజయాలు ఉండటం నాయకుడిగా సమర్ధతకు నిదర్శనం. 

మైదానంలోనే కాదు..డ్రెస్సింగ్‌ రూమ్‌లో కూడా తోటి సభ్యులతో సోదర భావంతో ప్రవర్తించే రోహిత్‌ శర్మ పట్ల జట్టు సభ్యులు ఎంతో అభిమానాన్ని ప్రదర్శిస్తారు.  రోహిత్ చాలా కలివిడిగా ఉంటాడు. ఏ ఆటగాడైనా ఫామ్‌ కోల్పోయినప్పుడు అతనికి అండగా నిలుస్తాడు. 

పెవిలియన్‌ నుంచి గ్రౌండ్‌లోకి బ్యాట్‌తో అడుగుపెట్టిన ఓ ఆటగాడు స్టేడియంలో లక్షలాదిమంది చూస్తుండగా డకౌట్ అయి తిరిగి వచ్చే సమయంలో ఎంతో క్షోభను అనుభవిస్తాడు. మానసికంగా చితికిపోతాడు. ఏ పరుగులు చేయకుండా గోడకు కొట్టిన బంతిలా వెనక్కి రావాలని ఏ క్రికెటరూ కోరుకోడు. వెనక్కి తిరిగి వస్తూ టీమ్ సభ్యుల కళ్లలోకి కూడా సూటిగా చూడలేనంత బాధలో ఉంటారు. 

అలాంటి సమయంలో రోహిత్ శర్మ ఆటగాళ్లకు అండగా నిలుస్తాడు. ధైర్యాన్ని చెబుతాడు. జట్టులో నుంచి తీసేస్తారేమో అనే భయాన్ని పోగొడతాడు. వారు ఆత్మవిశ్వాసంతో రాణించే వరకూ అవకాశాలు ఇస్తాడు. అందుకు ఈ టీ20 ప్రపంచకపే ఒక గొప్ప ఉదాహరణ. విరాట్ కోహ్లీ, శివమ్ దూబే అనేక మ్యాచ్‌ల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. చాలామంది అభిమానులు కోహ్లీ బ్యాటింగ్‌ ఆర్డర్ మార్చి మూడో స్థానంలో పంపాలని సూచించారు. శివమ్ దూబేను పక్కన పెట్టి సంజూ శాంసన్‌కు లేదా జైశ్వాల్‌కు ఛాన్స్ ఇవ్వాలని సూచనలు వచ్చాయి. అయినా రోహిత్ వాళ్లిద్దరిపై నమ్మకాన్ని ఉంచి అవకాశం ఇచ్చాడు. వారు ఇద్దరూ ఫైనల్స్‌లో చేసిన పరుగులు జట్టు విజయానికి ఎంతో దోహదపడ్డాయి. రోహిత్ కేవలం టీ 20ల్లోనే కాదు అన్ని ఫార్మెట్లలోనూ అత్యంత ప్రభావవంతమైన ఓపెనర్‌గా పేరు పొందటం మరో విశేషం.

- ఈటీవీ క్రీడా విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని