T20 World Cup: ‘టాప్‌లో భారత్‌.. దక్షిణాఫ్రికా తడబాటు’: వరల్డ్‌ కప్‌ విజయంపై అంతర్జాతీయ మీడియా

T20 World Cup: తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌నకు సంబంధించిన వార్తను అంతర్జాతీయ పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. భారత్‌ను కొనియాడుతూనే.. కీలక మ్యాచ్‌లో తడబడే అలవాటును దక్షిణాఫ్రికా కొనసాగించిందంటూ రాసుకొచ్చాయి.

Updated : 01 Jul 2024 09:44 IST

దిల్లీ: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 (T20 World Cup 2024) టైటిల్ సొంతం చేసుకున్న భారత క్రికెట్‌ జట్టుపై అంతర్జాతీయ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన తరుణంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లను కంగు తినిపించిన టీమ్‌ఇండియా 17 ఏళ్ల తర్వాత కప్పు సొంతం చేసుకుందంటూ కథనాలు రాసుకొచ్చాయి. అనూహ్య మలుపులు తిరిగిన మ్యాచ్‌.. అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేసినట్లు గుర్తుచేశాయి. భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురై విజయం ముందు తలొంచినట్లు పేర్కొన్నాయి. భారత జట్టు సమష్టిగా రాణించి తమ అద్భుతమైన నైపుణ్యాలతో కప్పును ఎగరేసుకుపోయిందని పలు పత్రికలు కొనియాడాయి.

‘గేరు మార్చి భారత్‌కు కప్పు అందించిన కోహ్లీ’ అంటూ లండన్‌లోని సండే టైమ్స్‌ కథనం పేర్కొంది. కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించలేని దక్షిణాఫ్రికా మరోసారి అదే ధోరణిని కొనసాగించిందంటూ రాసుకొచ్చింది. ‘ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరై భారత్‌కు కప్పు అందజేసిన దక్షిణాఫ్రికా’ అంటూ టెలిగ్రాఫ్‌ పత్రిక పేర్కొంది. ‘ఒత్తిడిలోనూ రాణించి కప్పు గెలిచిన భారత్‌’ అంటూ ఆస్ట్రేలియాకు చెందిన ‘క్రికెట్‌.కామ్‌.ఏయూ’ మ్యాచ్‌ రిపోర్టును రాసింది. కీలక మ్యాచ్‌లలో చేతులెత్తేసే పరంపరను సౌతాఫ్రికా కొనసాగించిందని విశ్లేషించింది. కోహ్లీ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించింది. సరైన సమయంలో కోహ్లీ రాణించాడంటూ అతడిపై ఫాక్స్‌ క్రికెట్‌ ప్రశంసలు కురిపించింది. టోర్నమెంట్‌ ఆసాంతం ఇబ్బందిపడినప్పటికీ.. కీలక మ్యాచ్‌లో మాత్రం ఆదుకున్నాడని విశ్లేషించింది.

ఈ ప్రపంచకప్‌ వేరయా..

పాకిస్థాన్‌కు చెందిన డాన్‌ పత్రిక భారత జట్టు విజయోత్సాహాలకు సంబంధించిన ఫొటోను మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. కోహ్లీ ఆటతీరును కొనియాడింది. ఆ దేశానికి చెందిన పలువురు మాజీ క్రికెటర్లు టీమ్‌ఇండియాకు శుభాకాంక్షలు తెలిపారు. రోహిత్‌శర్మ కెప్టెన్సీని షాహిద్‌ అఫ్రిది కొనియాడారు. కప్పు గెలవడానికి అతడు పూర్తి అర్హుడని ప్రశంసించారు.

ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌ కథనంలో మాత్రం కొంత భిన్నమైన స్వరం ధ్వనించింది. భారత విజయాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేసింది. ‘‘టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ను టాప్‌లో నిలబెట్టిన దక్షిణాఫ్రికా తడబాటు’’ అనే శీర్షికతో కథనాన్ని ప్రచురించింది. ‘‘ప్రపంచ క్రికెట్‌ దిగ్గజం భారత జట్టుకు టీ20 వరల్డ్‌ కప్‌లో అన్నీ అనుకూలించాయి. దక్షిణాఫ్రికా కుప్పకూలడం, అంపైర్ల నిర్ణయాలతో ఎట్టకేలకు రోహిత్‌ సేన కప్పు గెలిచింది’’ అంటూ సిడ్నీ మార్నింగ్‌ పత్రిక రాసుకొచ్చింది. ఈ టోర్నీలో ఆస్ట్రేలియా జట్టు మధ్యలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. కీలక సూపర్‌-8 మ్యాచ్‌లో భారత టీమ్‌ ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ అలవోక విజయాన్ని నమోదు చేసింది. దీన్ని జీర్ణించుకోలేకే టీమ్‌ఇండియాపై ఆ పత్రిక అక్కసు వెళ్లగక్కిందని క్రీడానిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని