Indian womens cricket: ఒక్క రోజే 525 పరుగులు

టెస్టు క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా.. ఏమా బ్యాటింగ్‌! దక్షిణాఫ్రికా బౌలర్లను గల్లీ క్రికెటర్లలా మార్చేలా.. ఏమా ఆధిపత్యం! చెపాక్‌ను ఊపేస్తూ.. మహిళల టెస్టులకు మరింత ఆదరణ పెంచుతూ..

Published : 29 Jun 2024 03:10 IST

చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు
షెఫాలి డబుల్‌ సెంచరీ
శతకంతో సత్తాచాటిన స్మృతి దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు 

టెస్టు క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచేలా.. ఏమా బ్యాటింగ్‌! దక్షిణాఫ్రికా బౌలర్లను గల్లీ క్రికెటర్లలా మార్చేలా.. ఏమా ఆధిపత్యం! చెపాక్‌ను ఊపేస్తూ.. మహిళల టెస్టులకు మరింత ఆదరణ పెంచుతూ.. భారత అమ్మాయిల క్రికెట్‌ జట్టు రికార్డుల మోత మోగించింది. సఫారీ జట్టుతో ఏకైక టెస్టులో తొలి రోజే ఏకంగా 525 పరుగులు చేసేసింది. డబుల్‌ సెంచరీతో షెఫాలి, శతకంతో స్మృతి అదరగొట్టారు. 

చెన్నై

వన్డే సిరీస్‌లో 3-0తో దక్షిణాఫ్రికాను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత అమ్మాయిల జట్టు ఏకైక టెస్టునూ ఘనంగా ఆరంభించింది. అద్భుతమైన బ్యాటింగ్‌తో తొలి రోజే మ్యాచ్‌పై పట్టు బిగించింది. శుక్రవారం ప్రారంభమైన మ్యాచ్‌లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 525/4తో నిలిచింది. జట్టు 5.35 రన్‌రేట్‌తో పరుగులు చేయడం విశేషం. షెఫాలి వర్మ (205; 197 బంతుల్లో 23×4, 8×6) టెస్టుల్లో తొలి శతకాన్నే ద్విశతకంగా మార్చగా.. ఫామ్‌ కొనసాగిస్తూ స్మృతి మంధాన (149; 161 బంతుల్లో 27×4, 1×6) సెంచరీతో సత్తాచాటింది. జెమీమా రోడ్రిగ్స్‌ (55; 94 బంతుల్లో 8×4) కూడా రాణించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (42 బ్యాటింగ్‌;  76 బంతుల్లో 2×4), రిచా ఘోష్‌ (43 బ్యాటింగ్‌; 33 బంతుల్లో 9×4) క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డెల్మి టకర్‌ (2/141) రెండు వికెట్లు పడగొట్టింది.

రెచ్చిపోయారు: టెస్టు క్రికెట్‌ ఇలా కూడా ఆడొచ్చంటూ.. ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ను మించిన బ్యాటింగ్‌తో భారత అమ్మాయిలు రెచ్చిపోయారు. ముఖ్యంగా అయిదో టెస్టు మాత్రమే ఆడుతున్న 20 ఏళ్ల షెఫాలి. ఈ మ్యాచ్‌కు ముందు వరకూ టెస్టు శతకమే చేయని ఆమె ఏకంగా రికార్డు డబుల్‌ సెంచరీ బాదేసింది.  మంధాన తన ఏడో మ్యాచ్‌లో రెండో సెంచరీని ఖాతాలో వేసుకుంది. తొలి సెషన్‌లో జాగ్రత్తగా ఆడిన భారత అమ్మాయిలు లంచ్‌ తర్వాత చెలరేగిపోయారు. వీళ్లిద్దరూ వరుస బంతుల్లో శతకాలు అందుకున్నారు. ఆ తర్వాతా పరుగుల వేట కొనసాగించారు. కానీ మంధానను టకర్‌ ఔట్‌ చేసి 292 పరుగుల భాగస్వామ్యాన్ని విడగొట్టింది. శుభ (15) కూడా త్వరగానే పెవిలియన్‌ చేరింది. ఆ దశలో జెమీమా తోడుగా ఇన్నింగ్స్‌ నడిపించిన షెఫాలి వరుసగా రెండు సిక్సర్లు, ఓ సింగిల్‌తో ద్విశతకం సాధించింది. వెంటనే ఆమె రనౌటవగా.. అర్ధశతకం తర్వాత జెమీమా నిష్క్రమించింది. హర్మన్‌ప్రీత్, రిచా కలిసి   అభేద్యమైన అయిదో వికెట్‌కు 75 పరుగులు జోడించింది. 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: షెఫాలి రనౌట్‌ 205; స్మృతి (సి) డెర్క్‌సన్‌ (బి) టకర్‌ 149; శుభ (సి) జఫ్త (బి) డిక్లెర్క్‌ 15; జెమీమా (సి) డిక్లెర్క్‌ (బి) టకర్‌ 55; హర్మన్‌ప్రీత్‌ బ్యాటింగ్‌ 42; రిచా బ్యాటింగ్‌ 43; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం: (98 ఓవర్లలో 4 వికెట్లకు) 525; వికెట్ల పతనం: 1-292, 2-325, 3-411, 4-450; బౌలింగ్‌: మసబత 14-2-63-0; డెర్క్‌సన్‌ 11-0-60-0; డిక్లెర్క్‌ 10-1-62-1; తుమి 10-0-55-0; ఎంలబా   24-1-113-0; టకర్‌ 26-1-141-2; లూస్‌ 3-0-15-0

194

డబుల్‌ సెంచరీకి షెఫాలి ఆడిన బంతులు. మహిళల టెస్టుల్లో అత్యంత వేగంగా ద్విశతకం సాధించిన బ్యాటర్‌గా అనబెల్‌ సదర్లాండ్‌ (248) రికార్డును తిరగరాసింది. 113 బంతుల్లోనే సెంచరీ చేసిన షెఫాలి.. వేగవంతమైన శతకం రికార్డు (1984లో బ్రిటిన్‌ 137 బంతుల్లో)నూ తుడిచేసింది. 

525

దక్షిణాఫ్రికాతో టెస్టులో తొలి రోజు భారత్‌ చేసిన స్కోరు. టెస్టు క్రికెట్‌ (పురుషులు కలిపి) చరిత్రలోనే మొదటి రోజు అత్యధిక పరుగులు చేసిన జట్టుగా టీమ్‌ఇండియా నిలిచింది. 89 ఏళ్ల (1935లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్‌ 431/2) రికార్డును బద్దలుకొట్టింది. 

చిరస్మరణీయ అనుభూతి: షెఫాలీ

‘ ‘ఇది నాకు ప్రత్యేకమైన క్షణం. జీవితాంతం గుర్తుంచుకునే చిరస్మరణీయ అనుభూతి. అండర్‌-19 టీ20 ప్రపంచకప్‌ విజయం ఇన్నింగ్స్‌ తర్వాత ఇదే నాకిష్టమైనది. 96 పరుగుల వద్ద ఔటవడం ఎవరూ మరిచిపోరు. మూడేళ్ల క్రితం ఆ స్కోరు మీద ఔటయ్యా. శుక్రవారం అది గుర్తుచేసుకున్నా. ఆ నాలుగు పరుగులు పూర్తిచేయాలనే ఆలోచిస్తున్నా. 200 సమీపించినప్పుడు కూడా నన్ను నేను నియంత్రించుకున్నా’’ 

షెఫాలీ వర్మ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని