IND Vs SA: అమ్మాయిలూ చుట్టేశారు

భారత మహిళల క్రికెట్‌ జట్టు అదరగొట్టింది. డ్రా కోసం గట్టిగా పోరాడిన దక్షిణాఫ్రికాను చుట్టేసి.. అనంతరం స్వల్ప ఛేదనను కొట్టేసి.. ఏకైక టెస్టులో ఘన విజయం సాధించింది. చివరి రోజు నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఆటలో టీమ్‌ఇండియాదే పైచేయి.

Published : 02 Jul 2024 03:58 IST

హర్మన్‌ సేన భళా
సత్తా చాటిన స్పిన్నర్లు
దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టులో ఘనవిజయం
చెన్నై

భారత మహిళల క్రికెట్‌ జట్టు అదరగొట్టింది. డ్రా కోసం గట్టిగా పోరాడిన దక్షిణాఫ్రికాను చుట్టేసి.. అనంతరం స్వల్ప ఛేదనను కొట్టేసి.. ఏకైక టెస్టులో ఘన విజయం సాధించింది. చివరి రోజు నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఆటలో టీమ్‌ఇండియాదే పైచేయి. స్పిన్నర్లు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 

భారత పురుషుల క్రికెట్‌ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్‌ సాధిస్తే.. హర్మన్‌ప్రీత్‌ సేన ఏకైక టెస్టులో 10 వికెట్ల తేడాతో ఆ దేశ మహిళల జట్టును చిత్తుచేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 232/2తో చివరి రోజైన సోమవారం ఫాలోఆన్‌ కొనసాగించిన సఫారీ జట్టు 373 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ లారా వోల్వార్ట్‌ (122; 314 బంతుల్లో 16×4) శతకాన్ని అందుకుంది. డిక్లెర్క్‌ (61; 185 బంతుల్లో 8×4, 1×6) చివరి వరకూ పోరాడింది. మన స్పిన్నర్లు స్నేహ్‌ రాణా (2/111), దీప్తి శర్మ (2/95), రాజేశ్వరి గైక్వాడ్‌ (2/55) ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. అనంతరం 37 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వికెట్లేమీ కోల్పోకుండా టీమ్‌ఇండియా చేరుకుంది. శుభ సతీష్‌ (13 నాటౌట్‌), షెఫాలి వర్మ (24 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చారు. తొలి ఇన్నింగ్స్‌లో 8 సహా ఈ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన స్నేహ్‌ రాణా ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ను భారత్‌ 603/6 వద్ద డిక్లేర్‌ చేయగా.. దక్షిణాఫ్రికా 266 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే. 

కాస్త కష్టంగా..: తొలి ఇన్నింగ్స్‌లో 84.3 ఓవర్లలోనే 266 పరుగులకు దక్షిణాఫ్రికాను కుప్పకూల్చిన భారత్‌కు ఫాలోఆన్‌లో మాత్రం ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన తప్పలేదు. ఈ సారి 154.4 ఓవర్లు ఓడిన సఫారీ అమ్మాయిలు మ్యాచ్‌ను డ్రా చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అవకాశం దొరికిన ప్రతిసారి వికెట్‌తో సత్తాచాటిన భారత్‌ చివరకు విజేతగా నిలిచింది. 105 పరుగులు వెనుకబడి చివరి రోజు ఫాలోఆన్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా పోరాట పటిమ ప్రదర్శించింది. ఓవర్‌నైట్‌ వ్యక్తిగత స్కోరు 93 పరుగులతో క్రీజులోకి వచ్చిన లారా కెరీర్‌లో తొలి టెస్టు శతకాన్ని అందుకుంది. ఆమెకు మరిజానె (31; ఓవర్‌నైట్‌ స్కోరు 15) కూడా చక్కగా సహకరించింది. ఉదయం పూట సుమారు గంట సేపు వరకు భారత్‌కు వికెట్‌ దక్కలేదు. చివరకు మరిజానెను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని ఈ భాగస్వామ్యాన్ని దీప్తి విడగొట్టింది. ఆ వెంటనే డెల్మి (0), కొద్దిసేపటికే లారానూ పెవిలియన్‌ చేర్చిన భారత్‌ త్వరగానే ప్రత్యర్థిని కూల్చేలా కనిపించింది. కానీ ఓ ఎండ్‌లో పాతుకుపోయిన డిక్లెర్క్‌ ఆ అవకాశం ఇవ్వలేదు. కండరాల నొప్పితో జఫ్తా (15) రిటైర్డ్‌హర్ట్‌ అవడంతో డెర్క్‌సెన్‌ (5)తో కలిసి డిక్లెర్క్‌ రెండో సెషన్‌ కొనసాగించింది. డెర్క్‌సెన్‌ త్వరగానే నిష్క్రమించినా.. తుమి (35 బంతుల్లో 6)తో కలిసి డిక్లెర్క్‌ పోరాటం సాగించింది. కానీ స్వల్ప వ్యవధిలో తుమితో పాటు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చిన జఫ్తాను ఔట్‌ చేసిన భారత్‌ పట్టు బిగించింది. టీ తర్వాత మసబాత (33 బంతుల్లో 2), డిక్లెర్క్‌ జోడీ భారత్‌ను విసిగించింది. ఓవర్లు కరుగుతుండటం, మ్యాచ్‌ ముగిసే సమయం సమీపిస్తుండటంతో కాస్త ఉత్కంఠ రేగింది. కానీ మసబాతను షెఫాలి బౌల్డ్‌ చేసింది. అర్ధశతకం తర్వాత డిక్లెర్క్‌ను రాజేశ్వరి పెవిలియన్‌ చేర్చడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు తెరపడింది. అనంతరం ఛేదనలో ఈ సారి షెఫాలికి తోడుగా మంధాన స్థానంలో శుభ ఓపెనర్‌గా వచ్చింది. ఈ జోడీ పెద్దగా కష్టపడకుండానే లక్ష్యాన్ని అందుకుంది. 

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 603/6 డిక్లేర్డ్‌;

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 266;

దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ (ఫాలోఆన్‌): లారా ఎల్బీ (బి) రాజేశ్వరి 122; అనెక్‌ ఎల్బీ (బి) దీప్తి 9; లుస్‌ (బి) హర్మన్‌ప్రీత్‌ 109; మరిజానె ఎల్బీ (బి) దీప్తి 31; డెల్మి (సి) జెమీమా (బి) స్నేహ్‌ 0; డిక్లెర్క్‌ (బి) రాజేశ్వరి 61; సినాలో (సి) శుభ (బి) స్నేహ్‌ 15; డెర్క్‌సెన్‌ ఎల్బీ (బి) పూజ 5; తుమి రనౌట్‌ 6; మసబాత (బి) షెఫాలి 2; ఎంలబా నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం: (154.4 ఓవర్లలో ఆలౌట్‌) 373; వికెట్ల పతనం: 1-16, 2-206, 3-264, 4-266, 5-281, 6-310, 7-324, 8-334, 9-357; బౌలింగ్‌: రేణుక 10-1-30-0; స్నేహ్‌ రాణా 40-12-111-2; పూజ 16-7-35-1; దీప్తిశర్మ 45-10-95-2; రాజేశ్వరి 30.4-12-55-2; షెఫాలి 3-1-7-1; హర్మన్‌ప్రీత్‌ 10-0-31-1
భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: శుభ సతీష్‌ నాటౌట్‌ 13; షెఫాలి వర్మ నాటౌట్‌ 24; మొత్తం: (9.2 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా) 37; బౌలింగ్‌: ఎంలబా 5-0-18-0; డెల్మి టకర్‌ 4.2-0-19-0

1

తొలి మూడు టెస్టులనూ గెలిచిన మొట్టమొదటి మహిళా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌.


టెస్టుల్లో పది వికెట్ల ఘనత సాధించిన భారత మహిళా క్రికెటర్లలో స్నేహ్‌ రాణా స్థానం. జులన్‌ (2006లో ఇంగ్లాండ్‌పై) ముందుంది. 


373

ఫాలోఆన్‌లో దక్షిణాఫ్రికా స్కోరు. మహిళల టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకిదే అత్యధిక స్కోరు. 2003లో ఇంగ్లాండ్‌పై చేసిన 315 పరుగుల రికార్డును దాటేసింది. 


229

ఈ మ్యాచ్‌లో షెఫాలి పరుగులు. ఓ టెస్టులో అత్యధిక పరుగులు చేసిన భారత మహిళా క్రికెటర్‌గా సంధ్య అగర్వాల్‌ (1984లో ఆస్ట్రేలియాపై 217) రికార్డును తిరగరాసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని