IndW vs SAW: తొలి రోజు ఆట పూర్తి.. భారత మహిళల రికార్డు స్కోరు

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తొలిరోజు ఆటముగిసింది. భారత్‌ మహిళా జట్టు 4 వికెట్లు కోల్పోయి 525 పరుగులు చేసింది.

Updated : 28 Jun 2024 18:21 IST

చెన్నై: దక్షిణాఫ్రికాతో (South Africa) జరుగుతున్న ఏకైక టెస్టులో (Test Match) టీమ్‌ ఇండియా (Team India Women) తొలిరోజు ఆట ముగిసింది. టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత మహిళా జట్టు 4 వికెట్లు కోల్పోయి 525 పరుగులు చేసింది. మహిళా క్రికెట్‌ చరిత్రలోనే తొలి రోజు ఆటలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. ఓపెనర్లు షెఫాలీ వర్మ (205; 197 బంతుల్లో 23×4, 8×6), స్మృతి మంధాన (149; 161 బంతుల్లో 27×4, 1×6) వీరవిహారం చేశారు. వన్డేలను తలపించినట్లుగా ఆడారు. జట్టు స్కోరు 292 పరుగుల వద్ద మందాన రనౌట్‌గా వెనుదిరింది. వీరిద్దరూ కలిసి తొలి వికెట్‌కు 292 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇప్పటివరకు మహిళా టెస్టు క్రికెట్‌ చరిత్రలో తొలి వికెట్‌కు 241 పరుగులు చేసిన కిరణ్‌ బలుచ్, సజ్జిదా షా జోడీ రికార్డును వీరు బద్దలు కొట్టారు.

తొలి డౌన్‌లో వచ్చిన సుభా సతీశ్‌ (15) నిరాశ పరిచింది. జెమీమా రోడ్రిగ్స్‌ (55) అర్ధశతకంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (42*), రిచా ఘోష్‌ (43*) క్రీజులో ఉన్నారు. తాజా మ్యాచ్‌తో భారత్‌ మహిళా జట్టు అనూహ్య రికార్డులను సొంతం చేసుకుంది. అత్యధిక భాగస్వామ్య రికార్డుతోపాటు, తొలిరోజు ఆటలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. 1935లో ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ మ్యాచ్‌లో బ్రిటన్ మహిళలు తొలిరోజు 4 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేశారు. ఇప్పటి వరకు అదే అత్యధిక స్కోరు. 89 ఏళ్ల తర్వాత తాజాగా ఆ రికార్డు బద్దలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని