IND vs SA: భారత్ సుదీర్ఘ నిరీక్షణకు తెర పడనుందా?.. సఫారీలకు తొలి టైటిలా..?

టీ20 ప్రపంచకప్‌ ముగింపు దశకు వచ్చేసింది. సూపర్‌-8, సెమీస్‌లను దాటేసి ఫైనల్‌ కోసం రెండు జట్లు సిద్ధమవుతున్నాయి.

Published : 28 Jun 2024 16:23 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో ఆ రెండు జట్లు అజేయంగా తుది పోరుకు చేరాయి. ఫైనలిస్టులు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా రావడం ఇదే తొలిసారి. పొట్టి కప్‌ చరిత్రలోనే మొదటిసారిగా దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకోగా.. రెండో కప్‌ను నెగ్గాలనే పట్టుదలతో ఉన్న భారత్‌ ముంగిట 17 ఏళ్ల నిరీక్షణకు ముగింపు పలికే అవకాశం నిలిచింది. ఇరు జట్ల మధ్య శనివారం ఫైనల్‌ జరగనుంది. 

ఇరు జట్లు ఇలా..

  • పొట్టి కప్‌లోని గ్రూప్‌, సూపర్‌-8 స్టేజ్‌లో భారత్‌ పెద్దగా ఇబ్బంది పడలేదు. సెమీస్‌లోనూ టఫ్ జట్టుగా భావించిన ఇంగ్లాండ్‌ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. 
  • దక్షిణాఫ్రికా పరిస్థితి అలా కాదు. సెమీస్‌ వరకు హేమాహేమీ టీమ్‌లతో తలపడి నాకౌట్‌కు చేరింది. ఇక్కడ మాత్రం పెద్దగా కష్టపడకుండా అఫ్గాన్‌పై సులువుగానే విజయం సాధించి టైటిల్‌ కోసం తుది పోరుకు వచ్చింది. 
  • భారత్-దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటివరకు 26 టీ20ల్లో తలపడ్డాయి. టీమ్‌ఇండియా 14, సౌతాఫ్రికా 11 మ్యాచుల్లో గెలిచాయి. ఒక మ్యాచ్‌ ఫలితం తేలలేదు. గతేడాది చివర్లలో జరిగిన మ్యాచ్‌లో 201/7 స్కోరు చేసిన భారత్‌.. సఫారీ జట్టును 95 రన్స్‌కే ఆలౌట్‌ చేసింది.
  • టీ20 వరల్డ్‌కప్‌ల్లోనూ ఆరుసార్లు తలపడగా.. భారత్‌ నాలుగింట్లో, దక్షిణాఫ్రికా రెండింట్లో గెలిచాయి. పొట్టి కప్‌ల్లో టీమ్‌ఇండియా అత్యధిక స్కోరు 186. అత్యల్ప స్కోరు 118. దక్షిణాఫ్రికా అత్యధిక స్కోరు 172 పరుగులు, అత్యల్పం 116 రన్స్. 
  • ఈసారి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఒక్కరు కూడా టాప్‌-5లో లేరు. కానీ, ఆ జట్టు సమష్టిగా రాణించి విజయాలు సాధించింది. సూపర్‌-8లోనే బలమైన విండీస్‌, ఇంగ్లాండ్‌ను అలవోకగా చిత్తు చేసింది.
  • క్వింటన్ డికాక్‌ (204) ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేశాడు. మిగతావారూ తలో చేయి వేసి మద్దతుగా నిలిచారు. మార్‌క్రమ్, హెండ్రిక్స్‌, క్లాసెన్, మిల్లర్, స్టబ్స్‌తో భారత బౌలర్లకు సవాల్ తప్పదు. 
  • టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు అదరగొట్టేస్తున్నారు. నోకియా (13), రబాడ (12), షంసీ (11) ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. నోకియా నాలుగు ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి ఏకంగా 4 వికెట్లు తీశాడు. కొత్త బౌలర్‌ బార్ట్‌మన్‌ కూడా జోరుమీదున్నాడు. మార్‌క్రమ్‌ పార్ట్‌టైమ్‌ స్పిన్‌తోనూ ఇబ్బందులే. 
  •  దక్షిణాఫ్రికా స్పిన్నర్ షంసీ కీలక సమయంలో వికెట్లు తీస్తున్నాడు. విండీస్‌ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉన్నాయని తెలుసు. అతడిని ఎదుర్కోవడం కాస్త కష్టంగానే ఉంటుంది. మన జట్టులో కుల్‌దీప్‌ కూడా ఇలాంటి ప్రదర్శనే చేస్తున్నాడు. 
  • రోహిత్‌ మరో 33 పరుగులు చేస్తే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ప్రస్తుతం అతడు 248 పరుగులతో ఉన్నాడు. అఫ్గాన్‌ బ్యాటర్‌ గుర్బాజ్ (281) ముందున్నాడు. 
  • టాప్‌ బౌలర్‌గా మారాలంటే అర్ష్‌దీప్‌ సింగ్‌కు మరో మూడు వికెట్లు కావాలి. ఫరూఖి 17 వికెట్లతో ఉండగా.. అర్ష్‌దీప్ 15 వికెట్లు తీశాడు. బుమ్రా 13 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై మరో అద్భుత ప్రదర్శన చేస్తే పెద్ద కష్టమేం కాదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు