ZIM vs IND: కెప్టెన్‌గా శుభ్‌మన్‌ గిల్.. జింబాబ్వే పర్యటనకు ఐపీఎల్‌ స్టార్లు!

జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌ ఆడేందుకు భారత్ జట్టు అక్కడ పర్యటించనుంది. అయితే, సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి.. యువ జట్టును పంపించాలని బీసీసీఐ చూస్తోంది.

Published : 24 Jun 2024 15:23 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ముగిసిన తర్వాత భారత జట్టు జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. జులై 6 నుంచి ఇరు జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌ జరగనుంది. అయితే, సీనియర్లందరికీ విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో అదరగొట్టి.. టీ20 ప్రపంచకప్‌లో ఆడే అవకాశం రాని యువ క్రికెటర్లను జింబాబ్వేతో (ZIM vs IND) సిరీస్‌కు ఎంపిక చేస్తారని సమాచారం. టీమ్‌ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్‌లకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. 

వారికి ఛాన్స్‌!

జింబాబ్వేతో తలపడబోయే టీ20 సిరీస్‌కు శుభ్‌మన్‌ గిల్‌ను (Shubman Gill) భారత సారథిగా నియమించే అవకాశం ఉంది. సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రింకు సింగ్‌, అవేశ్‌ ఖాన్‌ను జట్టుతోపాటు పర్యటనకు పంపించనుంది. ఐపీఎల్‌లో (IPL) సన్‌రైజర్స్‌ తరఫున ఓపెనర్‌గా అదరగొట్టిన అభిషేక్ శర్మతోపాటు నితీశ్ కుమార్‌ రెడ్డి, తుషార్‌ దేశ్‌పాండే, హర్షిత్ రాణా.. రాజస్థాన్‌కు ఆడిన రియాన్‌ పరాగ్‌కు కూడా అవకాశం దక్కనుందని తెలుస్తోంది.

ఈసారికి లక్ష్మణ్‌ నేతృత్వంలోనేనా? 

జింబాబ్వే సిరీస్‌ నుంచి ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ (Gautam Gambhir) బాధ్యతలు చేపడతాడా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. నెలాఖరుకు కోచ్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. ప్రస్తుత కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ పదవీకాలం జూన్‌ 30తో ముగియనుంది. అయితే, ఈసారికి ఎన్‌సీఏ డైరెక్టర్‌ వీవీఎస్ లక్ష్మణ్‌ను (VVS Laxman) భారత జట్టుతో పంపిస్తారనే ఊహాగానాలూ వచ్చాయి. కానీ, ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. 

స్క్వాడ్‌ (అంచనా): శుభ్‌మన్‌ గిల్ (కెప్టెన్), రుతురాజ్‌ గైక్వాడ్, రింకు సింగ్‌, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, నితీశ్‌ రెడ్డి, హర్షిత్ రాణా, యశ్‌ దయాల్, ఖలీల్ అహ్మద్, అవేశ్‌ ఖాన్, చాహల్, బిష్ణోయ్, రియాన్‌ పరాగ్, రజత్ పటీదార్, ధ్రువ్‌ జురెల్ (వికెట్ కీపర్).

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని