IND vs ENG: దెబ్బకు దెబ్బ

గుర్తుందా 2022 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌! ఇంగ్లాండ్‌కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. ఒక్కటంటే ఒక్క వికెట్‌ కోల్పోకుండా కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి రోహిత్‌సేనకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది ఇంగ్లిష్‌ జట్టు.

Updated : 28 Jun 2024 07:04 IST

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌
ఇంగ్లాండ్‌ చిత్తు
2022 పరాభవానికి ప్రతీకారం

గుర్తుందా 2022 టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ మ్యాచ్‌! ఇంగ్లాండ్‌కు 169 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశిస్తే.. ఒక్కటంటే ఒక్క వికెట్‌ కోల్పోకుండా కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి రోహిత్‌సేనకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది ఇంగ్లిష్‌ జట్టు.

ఇప్పుడు మళ్లీ పొట్టి కప్పులో అదే జట్టుతో సెమీస్‌. లక్ష్యం 172. కానీ ఈసారి రెచ్చిపోయి బౌలింగ్‌ చేసిన భారత బౌలర్ల ముందు ఇంగ్లాండ్‌ పప్పులుడకలేదు. బట్లర్‌ సేనను కేవలం 103 పరుగులకే కుప్పకూల్చిన టీమ్‌ఇండియా రెండేళ్ల కిందటి పరాభవానికి ఘనంగా ప్రతీకారం తీర్చుకుని, ఫైనల్లోకి దూసుకెళ్లింది. టైటిల్‌ కోసం రోహిత్‌ సేన శనివారం దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

ప్రావిడెన్స్‌

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం సెమీఫైనల్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన రోహిత్‌సేన 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. వర్షం వల్ల ఆలస్యంగా మొదలై, మధ్యలోనూ ఆగి.. సాగిన మ్యాచ్‌లో మొదట భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. ఫామ్‌ను కొనసాగిస్తూ రోహిత్‌ శర్మ (57; 39 బంతుల్లో 6×4, 2×6) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడగా.. సూర్యకుమార్‌ యాదవ్‌ (47; 36 బంతుల్లో 4×4, 2×6) కూడా రాణించాడు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో క్రిస్‌ జోర్డాన్‌ (3/37), అడిల్‌ రషీద్‌ (1/25), రీస్‌ టాప్లీ (1/25) రాణించారు. అనంతరం స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌ (3/19), అక్షర్‌ పటేల్‌ (3/23) విజృంభించడంతో ఇంగ్లాండ్‌ 16.4 ఓవర్లలో ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది.

స్పిన్నర్లు తిప్పేశారు..: ఇంగ్లాండ్‌ ఛేదన కొంచెం ధాటిగా మొదలవడంతో ఆరంభంలో భారత్‌కు కంగారు తప్పలేదు. బట్లర్‌ (23; 15 బంతుల్లో 4×4) దూకుడుగా ఆడడంతో ఇంగ్లాండ్‌ 3 ఓవర్లలో 26/0తో నిలిచింది. అయితే తర్వాతి ఓవర్‌ నుంచి ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. చేంజ్‌ బౌలర్‌గా వచ్చిన అక్షర్‌ బౌలింగ్‌లో రివర్స్‌ స్వీప్‌కు ప్రయత్నించిన బట్లర్‌.. వికెట్‌ కీపర్‌ పంత్‌కు దొరికపోవడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. తొలి వికెట్‌ పడగానే భారత బౌలర్లు విజృంభించారు. ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ పేకమేడను తలపించింది. బుమ్రా 5వ ఓవర్లో సాల్ట్‌ (5)ను బౌల్డ్‌ చేయగా.. తర్వాత అంతా స్పిన్నర్ల మాయాజాలమే. అక్షర్‌ తన తర్వాతి రెండు ఓవర్లలోనూ 2 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. అతడి బౌలింగ్‌లో బెయిర్‌స్టో (0) బౌల్డవగా.. మొయిన్‌ అలీ (8) స్టంపౌటై వెనుదిరిగాడు. దీంతో ఇంగ్లాండ్‌ 46/4కు చేరుకుంది. అగ్నికి వాయువు తోడైనట్లు అక్షర్‌కు కుల్‌దీప్‌ తోడవడంతో ఇంగ్లాండ్‌ ఓటమి వైపు వేగంగా అడుగులు వేసింది. బ్యాటర్లకు షాట్లు ఆడే అవకాశమే ఇవ్వకుండా తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిన కుల్‌దీప్‌.. వరుసగా సామ్‌ కరన్‌ (2), బ్రూక్‌ (25), జోర్డాన్‌ (1)లను పెవిలియన్‌ చేర్చాడు. లివింగ్‌స్టన్‌ (11)తో ఇంగ్లాండ్‌ చివరి ఆశ కూడా ఆవిరైంది. 20 బంతులుండగానే ఆ జట్టు ఇన్నింగ్స్‌ ముగిసింది. బ్రూక్, ఆర్చర్‌ (21) పోరాడకుంటే ఆ జట్టు 100 కూడా దాటేది కాదు.

నిలిచిన ఆ ఇద్దరు..: మొదట మ్యాచ్‌కు ముందు వర్షం పడడం, తర్వాత కూడా వరుణుడు పలకరించే సంకేతాలు కనిపించడం, రెండో ఇన్నింగ్స్‌లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతి అమల్లోకి వచ్చే ఉండడంతో టాస్‌ గెలిచిన ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. అతడి నిర్ణయం సరైందేనని చాటేలా భారత ఇన్నింగ్స్‌ ఆరంభమైంది. టోర్నీలో సాధారణ ప్రదర్శన చేస్తున్న కోహ్లి.. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లోనే 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద వెనుదిరిగాడు. రిషబ్‌ పంత్‌ (4) సైతం ఎంతోసేపు నిలవలేదు. అసలే ఇన్నింగ్స్‌ నెమ్మదిగా ఆరంభం కాగా.. కోహ్లి వికెట్‌ కూడా పడిపోవడంతో భారత్‌ ఆత్మరక్షణలో పడింది. అయితే మరో ఎండ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ మాత్రం ఫామ్‌ను కొనసాగిస్తూ చక్కటి షాట్లు ఆడాడు. స్కోరు వేగం పడిపోకుండా చూశాడు. అతడికి తోడైన సూర్యకుమార్‌ తన సహజ శైలిని విడిచిపెట్టి పరిస్థితులకు తగ్గట్లు ఆచితూచి ఆడాడు. 8 ఓవర్లలో 65/2తో ఉన్న దశలో వర్షం వల్ల మ్యాచ్‌ ఆగగా.. విరామం తర్వాత పిచ్, ఔట్‌ ఫీల్డ్‌ బాగా నెమ్మదించడంతో పరుగుల వేగం పడిపోయింది. అయితే కొన్ని ఓవర్ల పాటు ఓపిక పట్టిన రోహిత్, సూర్య.. తర్వాత షాట్లకు దిగారు. లివింగ్‌స్టన్‌ బంతికి సిక్సర్‌ బాది రోహిత్‌ ఇన్నింగ్స్‌కు స్కోరు బోర్డును కదిలించగా.. సామ్‌ కరన్‌ వేసిన 13వ ఓవర్లో సూర్య రెండు సిక్సర్లు, ఓ ఫోర్‌ కొట్టి ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చాడు. అయితే తర్వాతి ఓవర్లో రషీద్‌.. రోహిత్‌ను ఔట్‌ చేసి భారత్‌ను దెబ్బ తీశాడు. కాసేపటికే సూర్య కూడా ఔటైపోయాడు. 14-17 మధ్య భారత్‌ 4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 22 పరుగులే చేసింది. ఈ దశలో స్కోరు 160 అయినా అవుతుందా అన్న సందేహాలు కలిగాయి. అయితే జోర్డాన్‌ బౌలింగ్‌లో హార్దిక్‌ (23), రెండు కళ్లు చెదిరే సిక్సర్లు బాది ఆ వెంటనే ఔటవగా.. జడేజా (17 నాటౌట్‌), అక్షర్‌ (10) కూడా తలో చేయి వేయడంతో స్కోరు 170 దాటింది.

భారత్‌ ఇన్నింగ్స్‌: కోహ్లి (బి) టాప్లీ 9; రోహిత్‌ (బి) రషీద్‌ 57; పంత్‌ (సి) బెయిర్‌స్టో (బి) సామ్‌ కరన్‌ 4; సూర్యకుమార్‌ (సి) జోర్డాన్‌ (బి) ఆర్చర్‌ 47; హార్దిక్‌ (సి) సామ్‌ కరన్‌ (బి) జోర్డాన్‌ 23; జడేజా నాటౌట్‌ 17; దూబె (సి) బట్లర్‌ (బి) జోర్డాన్‌ 0; అక్షర్‌ (సి) సాల్ట్‌ (బి) జోర్డాన్‌ 10; అర్ష్‌దీప్‌ నాటౌట్‌ 1 ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 171; వికెట్ల పతనం: 1-19, 2-40, 3-113, 4-124, 5-146, 6-146, 7-170; బౌలింగ్‌: టాప్లీ 3-0-25-1; ఆర్చర్‌ 4-0-33-1; సామ్‌ కరన్‌ 2-0-25-1; రషీద్‌ 4-0-25-1; జోర్డాన్‌ 3-0-37-3; లివింగ్‌స్టన్‌ 4-0-24-0

ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: సాల్ట్‌ (బి) బుమ్రా 5; బట్లర్‌ (సి) పంత్‌ (బి) అక్షర్‌ 23; మొయిన్‌ అలీ (స్టంప్డ్‌) పంత్‌ (బి) అక్షర్‌ 8; బెయిర్‌స్టో (బి) అక్షర్‌ 0; బ్రూక్‌ (బి) కుల్‌దీప్‌ 25; సామ్‌ కరన్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 2; లివింగ్‌స్టన్‌ రనౌట్‌ 11; జోర్డాన్‌ ఎల్బీ (బి) కుల్‌దీప్‌ 1; ఆర్చర్‌ ఎల్బీ (బి) బుమ్రా 21; రషీద్‌ రనౌట్‌ 2, టాప్లీ 3 నాటౌట్‌; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం: (16.4 ఓవర్లలో ఆలౌట్‌) 103; వికెట్ల పతనం: 1-26, 2-34, 3-35, 4-46, 5-49, 6-68, 7-72, 8-86, 9-88; బౌలింగ్‌: అర్ష్‌దీప్‌ 2-0-17-0; బుమ్రా 2.4-0-12-2; అక్షర్‌ 4-0-23-3; కుల్‌దీప్‌ 4-0-19-3; జడేజా 3-0-16-0; హార్దిక్‌ 1-0-14-0

5

అంతర్జాతీయ క్రికెట్లో కెప్టెన్‌గా 5 వేల పరుగుల మైలురాయి చేరుకున్న భారత క్రికెటర్లలో రోహిత్‌ స్థానం. కోహ్లి (12883), ధోని (11207), అజహరుద్దీన్‌ (8095), గంగూలీ (7643) అతని కంటే ముందున్నారు. 


కోహ్లి.. ఓ సిక్స్‌తో సరి

ముహూర్తాన టీ20 ప్రపంచకప్‌లో అడుగు పెట్టాడో కానీ.. ఓ ఐసీసీ టోర్నీలో ఎన్నడూ లేనంతగా తడబడుతున్నాడు. గ్రూప్‌ దశలో మూడు మ్యాచ్‌ల్లో కలిపి 5 పరుగులే చేసిన విరాట్‌.. సూపర్‌-8లో కాస్త పర్వాలేదనిపించాడు కానీ, తన స్థాయికి ఏమాత్రం తగని ప్రదర్శనే అది. కీలకమైన సెమీస్‌లో అయినా కింగ్‌ ఓ మంచి ఇన్నింగ్స్‌ ఆడతాడనుకుంటే.. 9 బంతుల్లో 9 పరుగులే చేసి ఔటయ్యాడు. టాప్లీ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లో తడబడ్డ విరాట్‌.. అతడి తర్వాతి ఓవర్లో సిక్సర్‌ బాది ఊపందుకున్నట్లు కనిపించాడు. కానీ అదే ఓవర్లో వికెట్‌కు అడ్డంగా షాట్‌ ఆడి వెనుదిరిగాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని