Rahul Dravid: టీ20 ప్రపంచ కప్ ఫైనల్‌.. పిచ్‌ అడ్వాంటేజ్‌ అవుతుందా? ద్రవిడ్‌ ఏమన్నాడంటే?

టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టేందుకు టీమ్‌ఇండియా అన్నివిధాలా సిద్ధమైందని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు. 

Published : 29 Jun 2024 11:30 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఏడాది కాలంలో టీమ్‌ఇండియా మూడుసార్లు ఐసీసీ ఫైనల్స్‌కు చేరిందని ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. ఈసారి కూడా నాణ్యమైన క్రికెట్ ఆడతామని.. అదృష్టం కలిసి వస్తుందని భావిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఢీకొట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పిచ్‌ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయని ద్రవిడ్ చెప్పాడు. ప్రధాన కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కిదే (Rahul Dravid) చివరి మెగా టోర్నీ. జులై నుంచి కొత్త కోచ్ నేతృత్వంలో టీమ్‌ఇండియా ఆడనుంది.

‘‘గత కొన్నేళ్లుగా నిలకడైన ఆటతీరుతో ఉన్నతస్థాయికి తీసుకెళ్లాం. అన్ని ఫార్మాట్లలోనూ ఫైనల్స్‌కు దూసుకెళ్లాం. ఈ క్రెడిట్‌ ఆటగాళ్లదే. ఇప్పుడు కూడా తమదైన శైలిలో ఆడితే తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ఫైనల్‌ అనగానే (IND vs SA Final) ఎవరికైనా ఒత్తిడి ఉండటం సహజం. అయితే, మేం మానసికంగానూ సన్నద్ధమయ్యాం. ఒక్కరోజు మాత్రమే గ్యాప్‌ ఉంది. అందుకే ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయలేదు. వ్యూహాత్మకంగా, మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉన్నాం. గతేడాది వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ కోసం ప్రిపరేషన్‌లో ఏమాత్రం లోపం లేదు. ఆ రోజు ప్రత్యర్థి జట్టు కాస్త మెరుగ్గా ఆడింది. గేమ్‌లో గెలుపోటములు సహజం. 

ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌కు దక్షిణాఫ్రికా (T20 World Cup 2024 Final) వరుస విజయాలతో చేరుకుంది. ప్రత్యర్థిని మేం తక్కువగా అంచనా వేయడం లేదు. తప్పకుండా మెరుగైన క్రికెట్ ఆడి కప్‌ను సాధించేందుకు ప్రయత్నిస్తాం. బార్బడోస్‌లో మేం ఆడిన అనుభవం ఉంది. సూపర్‌-8 పోరులో అఫ్గానిస్థాన్‌తో ఆడాం. అయితే, ఈసారి పిచ్‌ ఏమైనా మార్చే అవకాశం ఉంటుంది. కానీ, ఇక్కడి పరిస్థితులపై ఓ అవగాహన ఉండటం మాకు కలిసొస్తుందని భావిస్తున్నా. జట్టులోని ప్రతిఒక్కరూ కప్‌  నెగ్గాలనే లక్ష్యంతో ఉన్నారు’’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని