T20 World cup: సమరానికి భారత్‌ సై... కాస్కో ఇంగ్లాండ్‌

ఎప్పుడో 2007లో మొట్టమొదటి టీ20 ప్రపంచకప్‌ను గెలిచాం. జట్టు నిండా ఐపీఎల్‌తో పొట్టి క్రికెట్లో ఆరితేరిన ఆటగాళ్లున్నా.. తర్వాత అనేక           ప్రయత్నాల్లో అది అందనే లేదు.

Updated : 27 Jun 2024 06:57 IST

సెమీఫైనల్‌ నేడే
రాత్రి 8 నుంచి 

ఎప్పుడో 2007లో మొట్టమొదటి టీ20 ప్రపంచకప్‌ను గెలిచాం. జట్టు నిండా ఐపీఎల్‌తో పొట్టి క్రికెట్లో ఆరితేరిన ఆటగాళ్లున్నా.. తర్వాత అనేక ప్రయత్నాల్లో అది అందనే లేదు. కానీ ఇప్పుడో సువర్ణావకాశం వచ్చింది. రెండో సారి పొట్టి ప్రపంచకప్‌ను అందుకోవడానికి టీమ్‌ఇండియా ఇక వేయాల్సింది రెండు అడుగులే. అజేయ భారత్‌పై అంచనాలెన్నో! ఈ నేపథ్యంలో కోట్లాది అభిమానుల ఆశలను మోస్తూ కీలక సమరానికి సిద్ధమైంది రోహిత్‌సేన. ఫైనల్లో చోటు కోసం నేడు డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ను ఢీకొట్టనుంది.

భారత్‌ అదిరే ఆటతో అజేయంగా ఇక్కడిదాకా వస్తే.. ఇంగ్లాండ్‌ కష్టపడుతూ సెమీఫైనల్‌ చేరింది. అయితే ఈ పోరులో రెండు జట్లు సమవుజ్జీలే. హిట్టర్లతో నిండిన ఇంగ్లాండ్‌ సత్తా మేరకు ఆడితే ఎలాంటి ప్రత్యర్థికైనా ఇబ్బందులు తప్పవు. అన్ని విభాగాల్లో టీమ్‌ఇండియా మంచి ఫామ్‌తో ఉన్నా.. గత టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఇదే ఇంగ్లాండ్‌ చేతిలో పది వికెట్ల పరాభవం జ్ఞాపకాల్లో ఇప్పటికీ తాజాగానే ఉంది. మరి భారత జట్టు ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంటుందా.. లేదా ఇంగ్లాండ్‌ మరోసారి పైచేయి సాధిస్తుందా? ప్రావిడెన్స్‌లో రసవత్తర సమరం ఖాయం.

జార్జ్‌టౌన్‌ (గయనా)

టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి టీమ్‌ఇండియా సిద్ధమైంది. గురువారం బలమైన ఇంగ్లాండ్‌తో పటిష్ఠమైన భారత్‌ తలపడుతోంది. బలాబలాల్లో రెండు జట్లూ సమవుజ్జీలుగా కనిపిస్తున్నాయి. కానీ ఫామ్, ఆటతీరు పరంగా చూసుకుంటే రోహిత్‌ సేనదే కాస్త పైచేయి. మన జట్టు వరుస విజయాలతో సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇంగ్లాండ్‌ ఏమో తడబడుతూ వచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రెండు జట్లకూ సరిపడా ప్రత్యామ్నాయాలున్నాయి. బ్యాటింగ్‌లోనూ లోతు ఎక్కువే. పైగా నాకౌట్‌ మ్యాచ్‌ కావడంతో హోరాహోరీ పోరు ఖాయమే. 

కోహ్లి ఆడితే: ఆస్ట్రేలియాపై మేటి ఇన్నింగ్స్‌తో కెప్టెన్‌ రోహిత్‌ (191 పరుగులు) తిరిగి దూకుడు అందుకున్నాడు. పంత్‌ (167), సూర్యకుమార్‌ (149), శివమ్‌ దూబె (106), హార్దిక్‌ (116) ఫామ్‌ కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కోహ్లి కూడా ఫామ్‌లోకి వస్తే టీమ్‌ఇండియాకు ఎదురే ఉండదు. 6 ఇన్నింగ్స్‌ల్లో 11 సగటుతో కోహ్లి 66 పరుగులే చేశాడు. అయినా లయ అందుకోవడానికి కోహ్లీకి ఒక్క మ్యాచ్‌ చాలు. పైగా కీలక మ్యాచ్‌ల్లో అతను సత్తాచాటుతాడు. దీంతో ఇంగ్లాండ్‌తో పోరులో తిరిగి పరుగుల వేటలో సాగితే జట్టుకున్న ఆందోళన తొలగిపోతుంది. సెమీస్‌కు ముందు ఆస్ట్రేలియాపై 41 బంతుల్లో 92 పరుగుల అత్యుత్తమ ఇన్నింగ్స్‌తో రోహిత్‌ చెలరేగడం జట్టుకు శుభసూచకం. అతనితో పాటు మిగతా బ్యాటర్లు.. ఇంగ్లిష్‌ బౌలింగ్‌ పరీక్షను తట్టుకుని జోరు కొనసాగించాల్సిన అవసరం ఉంది. 


ఇండియా ఇలా.. ఇంగ్లాండ్‌ అలా

ఎదురొచ్చిన ప్రత్యర్థినల్లా ఓడించి టీమ్‌ఇండియా.. తడబడుతూ ఇంగ్లాండ్‌ సెమీస్‌ చేరాయి. ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ గెలిచిన రోహిత్‌ సేన అజేయంగా కొనసాగుతోంది. గ్రూప్‌ దశలో ఐర్లాండ్, పాకిస్థాన్, అమెరికాపై భారత్‌ నెగ్గింది. కెనడాతో మ్యాచ్‌ వర్షార్పణమైంది. సూపర్‌-8లో అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌తో పాటు బలమైన ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఇక స్కాట్లాండ్‌తో మ్యాచ్‌ రద్దు, ఆ తర్వాత ఆసీస్‌ చేతిలో ఓటమితో ఇబ్బందుల్లో పడ్డ ఇంగ్లాండ్‌.. ఒమన్, నమీబియాపై గెలిచి మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో స్కాట్లాండ్‌ను వెనక్కినెట్టి గ్రూప్‌ దశ దాటింది. సూపర్‌-8లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. కానీ వెస్టిండీస్, అమెరికాపై విజయాలతో ముందంజ వేసింది. 


ఆశలన్నీ బుమ్రాపైనే

రెండు జట్ల పేస్‌ బలం చూసుకుంటే భారత్‌ కాస్త మెరుగ్గా కనిపిస్తోంది. అందుకు ప్రధాన కారణం బుమ్రా. బ్యాటర్‌ను బట్టి, పరిస్థితులను అంచనా వేసి వైవిధ్యమైన బౌలింగ్‌తో జట్టు విజయాల్లో అతను కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ పేసర్‌గా ప్రశంసలు అందుకుంటున్న బుమ్రా.. ఈ టోర్నీలో 6 ఇన్నింగ్స్‌లో 11 వికెట్లు తీశాడు. సగటు 8.54 కాగా.. ఎకానమీ కేవలం 4.08 మాత్రమే. దీన్ని బట్టి అతను బ్యాటర్లను ఎంతలా భయపెడ్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. బట్లర్‌పై బుమ్రాకు మెరుగైన రికార్డుంది. 3 టీ20ల్లో అతణ్ని రెండు సార్లు ఔట్‌ చేశాడు. భారత్‌ తరపున అత్యధిక వికెట్ల వీరుడిగా సాగుతున్న అర్ష్‌దీప్‌ సింగ్‌ (15) నిలకడ జట్టుకు కలిసొచ్చేదే. వీళ్లతో పాటు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ (8) బంతితోనూ సత్తాచాటుతున్నాడు. ఇంగ్లాండ్‌కూ మెరుగైన పేస్‌ దళమే ఉంది. పునరాగమనంలో ప్రధాన పేసర్‌ ఆర్చర్‌ (9) జోరందుకున్నాడు. రోహిత్, విరాట్‌ను కొత్త బంతితో కట్టడి చేసేందుకు ప్రయత్నించనున్నాడు. ఇక అమెరికాపై హ్యాటిక్‌ తీసిన జోర్డాన్‌ (7), కరన్‌తో పాటు టాప్లీ లేదా మార్క్‌వుడ్‌ పేస్‌ బాధ్యతలు పంచుకోనున్నారు.


బౌలింగ్‌కు అనుకూలం

జార్జ్‌టౌన్‌లోని పిచ్‌ బౌలింగ్‌కు సహకరిస్తోంది. ఇక్కడ పేసర్లు 14.7, స్పిన్నర్లు 14.5 సగటు నమోదు చేశారు. మ్యాచ్‌ సాగుతున్నా కొద్దీ పిచ్‌ మరింత మందకొడిగా మారి బ్యాటింగ్‌కు పరిస్థితులు కఠినమవుతాయి. అందుకే టాస్‌ నెగ్గిన జట్టు మొదట బ్యాటింగ్‌కే మొగ్గు చూపొచ్చు. ఈ టోర్నీలో ఇక్కడ 5 మ్యాచ్‌లు జరగగా.. అత్యధికంగా ఉగాండాపై అఫ్గానిస్థాన్‌ 183 పరుగులు చేసింది. మూడు సార్లు మొదట బ్యాటింగ్‌ చేసిన జట్టు గెలిచింది. మొదట బ్యాటింగ్‌లో సగటు స్కోరు 146 కాగా.. ఛేదనలో అది 77గా ఉంది. అఫ్గానిస్థాన్‌పై 160 ఛేదనలో కివీస్‌ 75 పరుగులకే కుప్పకూలింది ఇక్కడే. 


వాళ్లకు రిజర్వ్‌ డే.. మనకు లేదు 

భారత్, ఇంగ్లాండ్‌ మధ్య సెమీస్‌కు వర్షం గండం ఉంది. మ్యాచ్‌ సమయంలో వర్షం పడేందుకు 75 శాతం అవకాశమున్నట్లు అంచనా. వర్షం వల్ల ఆలస్యమైతే మ్యాచ్‌ ముగించేందుకు అదనంగా 250 నిమిషాల సమయం కేటాయించారు. రెండు జట్లూ కనీసం 10 ఓవర్ల చొప్పున ఆడితేనే ఫలితాన్ని ప్రకటిస్తారు. లేని పక్షంలో మ్యాచ్‌ రద్దవుతుంది. అలా జరిగితే భారత్‌ ఫైనల్‌ చేరుతుంది. సూపర్‌-8లో భారత్‌ గ్రూప్‌-1లో అగ్రస్థానంలో నిలవడమే కారణం. గ్రూప్‌-2లో ఇంగ్లాండ్‌ రెండో స్థానం దక్కించుకుంది. మరోవైపు అఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా సెమీస్‌కు రిజర్వ్‌ డే ఉంది. వర్షం అంతరాయం కలిగితే మ్యాచ్‌ ముగించేందుకు అదనంగా 60 నిమిషాలు కేటాయించారు. అప్పుడు సాధ్యం కాకపోతే... మరుసటి రోజు మ్యాచ్‌ను కొనసాగిస్తారు. ఈ సెమీస్‌ మ్యాచ్‌ వెస్టిండీస్‌ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.30కే తరౌబాలో ఆరంభమవుతోంది. వర్షం అంతరాయం కలిగించినా రిజర్వ్‌ డే అయిన గురువారం ఆట కొనసాగించవచ్చు. కానీ భారత్, ఇంగ్లాండ్‌ సెమీస్‌ అక్కడి కాలమానం ప్రకారం గయానాలో గురువారం ఉదయం 10.30కు మొదలవుతుంది. ఫైనల్‌ ఏమో శనివారం ఉదయం 10.30కు ప్రారంభమవుతుంది. మధ్యలో ఒక రోజు విరామం తప్పనిసరి కావడంతో రెండో సెమీస్‌కు రిజర్వ్‌ డే కేటాయించలేదు.


అప్పుడిలా..

త టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లోనూ ఇంగ్లాండ్‌తోనే ఆడిన భారత్‌ 10 వికెట్ల తేడాతో చిత్తయింది. ఆ మ్యాచ్‌లో మొదట భారత్‌ 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్య (63), కోహ్లి (50) రాణించారు. జోర్డాన్‌ (3/43) భారత్‌ను దెబ్బకొట్టాడు. ఛేదనలో టీమ్‌ఇండియా బౌలర్లు తేలిపోవడంతో ఇంగ్లాండ్‌ ఒక్క వికెట్టూ కోల్పోకుండా 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. బట్లర్‌ (80 నాటౌట్‌), హేల్స్‌ (86 నాటౌట్‌) జట్టును గెలిపించారు. అప్పుడు లేని బుమ్రా, జడేజా, కుల్‌దీప్‌తో ఇప్పుడు టీమ్‌ఇండియా బౌలింగ్‌ దుర్భేద్యంగా మారింది. బ్యాటింగ్‌లోనూ లోతు పెరిగింది. అప్పటి హేల్స్, స్టోక్స్, వోక్స్‌ ఇప్పుడు ఇంగ్లాండ్‌ జట్టులో లేరు. అయినా పటిష్ఠంగానే ఉన్న ప్రత్యర్థిని అత్యుత్తమ ఆటతీరుతో అడ్డుకోవాల్సి ఉంది.


వీళ్లను ఆపాలి

ఇంగ్లాండ్‌ను ఓడించాలంటే బలంగా ఉన్న ఆ జట్టు బ్యాటింగ్‌ను దెబ్బకొట్టాలి. ఈ సారి కూడా ఓపెనర్లు బట్లర్‌ (191 పరుగులు), సాల్ట్‌ (183) భారత్‌కు సవాలు విసిరేందుకు సిద్ధమయ్యారు. వీళ్లిద్దరినీ వీలైనంత త్వరగా పెవిలియన్‌ చేర్చాలి. లేకపోతే టీమ్‌ఇండియాకు ఇబ్బందులు తప్పవు. భారీ షాట్లతో వీళ్లు మ్యాచ్‌ ఫలితాన్ని తారుమారు చేస్తారు. మిడిలార్డర్‌లో కీలకంగా మారిన హ్యారీబ్రూక్‌ (3 ఇన్నింగ్స్‌లో 120) కూడా ప్రమాదకరమే. పెద్దగా ఫామ్‌లో లేకున్నా బెయిర్‌స్టోను తక్కువ అంచనా వేయలేం. ఇక లివింగ్‌స్టన్, మొయిన్‌ అలీ, కరన్‌ రూపంలో ఆ జట్టుకు ఆల్‌రౌండర్ల బలమూ ఉంది. 


స్పిన్‌ సవాలు

పిచ్‌ మందకొడిగా ఉండే నేపథ్యంలో స్పిన్నర్లు కీలక పాత్ర పోషించనున్నారు. ఈ స్పిన్‌ పరీక్షలో గట్టెక్కిన జట్టే విజేతగా నిలిచే అవకాశముంది. ఆలస్యంగా జట్టులోకి వచ్చినా అదరగొడుతున్న కుల్‌దీప్‌ యాదవ్‌ (3 ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు)పై మరోసారి జట్టు ఆశలు పెట్టుకుంది. స్పిన్‌ ఆడటంలో ఇంగ్లాండ్‌ బ్యాటర్ల బలహీనతను అతను సొమ్ము చేసుకుంటే జట్టుకు తిరుగుండదు. అతనితో పాటు జడేజా, అక్షర్‌ కూడా రాణించాల్సి ఉంది. ప్రత్యర్థి జట్టులోని ఆదిల్‌ రషీద్‌ (9)తో మనవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. కరీబియన్‌ పిచ్‌లపై అతను గొప్ప ప్రభావం చూపుతున్నాడు. మొయిన్‌ అలీ, లివింగ్‌స్టన్‌ రూపంలో ఇంగ్లాండ్‌కు అవసరపడే స్పిన్నర్లూ ఉన్నారు. 


0-9

భారత్‌ చివరగా 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ రూపంలో ఐసీసీ టోర్నీ గెలిచింది. ఆ తర్వాత జరిగిన 9 ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ఇండియా నాకౌట్‌ (సెమీస్‌/ఫైనల్‌) మ్యాచ్‌ల్లో ఓడింది. 2014 టీ20 ప్రపంచకప్, 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2021, 2023 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్స్, 2023 వన్డే ప్రపంచకప్‌ల్లో తుది మెట్టుపై బోల్తాపడింది. 2015, 2019 వన్డే ప్రపంచకప్‌లు.. 2016, 2022 టీ20 ప్రపంచకప్‌ల్లో సెమీస్‌లో పరాజయం పాలైంది. గ్రూప్‌ దశలో అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శించడం, కీలకమైన నాకౌట్లో చేతులు ఎత్తేయడం జట్టుకు అలవాటుగా మారింది. ఈ సారి మాత్రం నాకౌట్‌ గండం దాటాలని జట్టు లక్ష్యంగా పెట్టుకుంది.


తుదిజట్లు (అంచనా)

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), కోహ్లి, పంత్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్, శివమ్‌ దూబె, హార్దిక్, అక్షర్, జడేజా, కుల్‌దీప్, అర్ష్‌దీప్, బుమ్రా. 

ఇంగ్లాండ్‌: బట్లర్‌ (కెప్టెన్, వికెట్‌కీపర్‌), సాల్ట్, బెయిర్‌స్టో, హ్యారీబ్రూక్, మొయిన్‌ అలీ, లివింగ్‌స్టన్, కరన్, జోర్డాన్, ఆర్చర్, ఆదిల్‌ రషీద్, టాప్లీ/మార్క్‌వుడ్‌.


 12

ఇంగ్లాండ్‌తో ఆడిన 23 టీ20ల్లో టీమ్‌ఇండియా విజయాలు. ఇంగ్లాండ్‌ 11 మ్యాచ్‌ల్లో నెగ్గింది.


2-2

టీ20 ప్రపంచకప్‌ల్లో తలపడ్డ 4 మ్యాచ్‌ల్లో భారత్, ఇంగ్లాండ్‌ చెరో రెండు విజయాలు సాధించాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని