IND Vs ENG Semifinal: అలా ఆడడంపైనే మా దృష్టి.. ఇంగ్లాండ్‌తో సెమీస్‌పై కెప్టెన్‌ రోహిత్‌

IND Vs ENG Semifinal: టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌-2లో భారత్‌, ఇంగ్లాండ్‌ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో అనుసరించే వ్యూహాల సహా పలు అంశాలపై కెప్టెన్‌ రోహిత్‌ మాట్లాడాడు.

Updated : 27 Jun 2024 18:32 IST

జార్జ్‌టౌన్‌: టీ20 ప్రపంచకప్‌ కీలక దశకు చేరుకుంది. నేడు జరగనున్న సెమీస్‌-2లో ఇంగ్లాండ్‌తో తలపడేందుకు భారత్‌ (IND Vs ENG Semifinal) సిద్ధమైంది. 2022 సెమీస్‌లోనూ ఇంగ్లాండ్‌తోనే ఆడిన భారత్‌ 10 వికెట్ల తేడాతో చిత్తయిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌పై ఈసారి తీవ్ర ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు. కూల్‌గా ఉంటూ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడడంపైనే దృష్టి సారించామని మీడియా సమావేశంలో తెలిపాడు.

పరిస్థితులేమీ మారలేదు..

చివరి వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌తో తలపడినప్పటితో పోలిస్తే పరిస్థితుల్లో పెద్దగా మార్పేమీ లేదని రోహిత్‌ (Rohit Sharma) అన్నాడు. 2014 తర్వాత ఆడిన ఐసీసీ టోర్నీల్లో భారత ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడానికి ఒత్తిడితో పాటు అదృష్టం కలిసిరాకపోవడం కూడా కారణమని వివరించాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్‌తో జరగబోయే సెమీస్‌ను ఒక సాధారణ మ్యాచ్‌లాగే భావించనున్నట్లు తెలిపాడు. ఏ సందర్భంలో ఆడుతున్నాం? మున్ముందు పరిస్థితేంటి? అనే అంశాలను అసలు పట్టించుకోబోమని స్పష్టం చేశారు. ప్రతిఒక్కరికీ ఇది సెమీ-ఫైనల్‌ గేమ్‌ అని తెలిసినప్పటికీ.. దాని గురించి పదే పదే ఆలోచించబోమని వివరించాడు. జట్టులో ప్రతిఒక్కరూ ఇదే ధోరణితో ఉన్నారని వెల్లడించాడు. అతిగా ఆలోచించడం వల్ల ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించాడు.

అలా అయితే సరైన నిర్ణయాలు తీసుకోలేం..

‘‘జట్టుగా మేం బాగా ఆడుతున్నాం. సమన్వయంతో ముందుకెళ్తున్నాం. ఒకరి విజయాన్ని మరొకరం ఎంజాయ్‌ చేస్తున్నాం. దాన్ని ముందుకు తీసుకెళ్లడం ఇప్పుడు చాలా ముఖ్యం. ఈ టోర్నీలో ఇప్పటి వరకు మేం చేస్తూ వచ్చిందే ఇప్పుడూ అనుసరిస్తాం. కొన్ని సందర్భాల్లో మేం ఒత్తిడికి గురైన మాట వాస్తవమే. కానీ, దాన్నుంచి వేగంగా బయటకొచ్చాం. బహుశా ఏం జరుగుతుందో అని పెద్దగా ఆలోచించకపోవడమే అందుకు కారణం. అతిగా ఆలోచించడం వల్ల ఫీల్డ్‌లో సరైన నిర్ణయాలు తీసుకోలేం. అందుకే ఫీల్డ్‌లో ఏం చేయాలనే విషయంలో స్పష్టమైన అవగాహనతో ఉండడం చాలా ముఖ్యం. ఇప్పటికే ఈ విషయంపై ప్లేయర్లతో తగినంత చర్చ జరిగింది’’ అని రోహిత్‌ వివరించాడు.

ఫైనల్‌కు దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా.. అఫ్గాన్‌పై అలవోక విజయం

ప్లేయర్ల నిర్ణయమే..

‘‘ఆట ఎలా సాగుతుందనేది చివరగా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇలా చెప్పడం బోరింగ్‌గానే ఉన్నప్పటికీ.. వాస్తవం మాత్రం అదే. ఎలా ఆడాలన్నది ఆయా ప్లేయర్ల అనుభవంపై ఆధారపడి ఉంటుంది. రివర్స్‌ స్వీప్‌ ఆడాలా? యార్కర్లు సంధించాలా? బౌన్సర్లు వేయాలా.. అనేది ఆయా ప్లేయర్లు, వాళ్ల నిర్ణయాలను బట్టి ఉంటుంది’’ అని రోహిత్‌ (Rohit Sharma) తెలిపాడు.

కూల్‌గా ఉంటా..

‘‘గత కెప్టెన్లతో పోలిస్తే ఎలా వ్యవహరించబోతున్నారని అంబటి రాయుడు అడిగిన ప్రశ్నకు రోహిత్‌ (Rohit Sharma) ఈ సందర్భంగా బదులిచ్చాడు. ‘‘ఫీల్డ్‌లో నిర్ణయాలు తీసుకోవాల్సింది నేనే. కూల్‌గా ఉండడం చాలా ముఖ్యం. ఏళ్లుగా అదే చేస్తున్నా. కానీ, కొన్నిసార్లు సహనం కోల్పోవాల్సి వస్తుంటుంది. దాని వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి రావొచ్చు. ఈసారి అలా కాకుండా చూసుకుంటా’’ అని రోహిత్‌ వివరించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ప్లేయర్లంతా చాలా విశ్వాసంతో ఆడారని తెలిపాడు. బ్యాటర్లు, బౌలర్లు తమ ప్రణాళికలను చక్కగా అమలు చేశారన్నాడు. అదే ఆటతీరును ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నామని వెల్లడించాడు.

2022 సెమీస్‌లో ఇలా..

గత టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లోనూ ఇంగ్లాండ్‌తోనే ఆడిన భారత్‌ 10 వికెట్ల తేడాతో చిత్తయింది. ఆ మ్యాచ్‌లో మొదట భారత్‌ 6 వికెట్లకు 168 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్య (63), కోహ్లి (50) రాణించారు. జోర్డాన్‌ (3/43) భారత్‌ను దెబ్బకొట్టాడు. ఛేదనలో టీమ్‌ఇండియా బౌలర్లు తేలిపోవడంతో ఇంగ్లాండ్‌ ఒక్క వికెట్టూ కోల్పోకుండా 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. బట్లర్‌ (80 నాటౌట్‌), హేల్స్‌ (86 నాటౌట్‌) జట్టును గెలిపించారు. అప్పుడు లేని బుమ్రా, జడేజా, కుల్‌దీప్‌తో ఇప్పుడు టీమ్‌ఇండియా బౌలింగ్‌ దుర్భేద్యంగా మారింది. బ్యాటింగ్‌లోనూ లోతు పెరిగింది. అప్పటి హేల్స్, స్టోక్స్, వోక్స్‌ ఇప్పుడు ఇంగ్లాండ్‌ జట్టులో లేరు. అయినా పటిష్ఠంగానే ఉన్న ప్రత్యర్థిని అత్యుత్తమ ఆటతీరుతో అడ్డుకోవాల్సి ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు