ICC T20I Rankings: నంబర్‌ వన్‌గా హార్దిక్ పాండ్య.. 12 స్థానాలు ఎగబాకిన బుమ్రా

ఐసీసీ ర్యాంకింగ్స్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య (Hardik Pandya) అగ్ర స్థానంలో నిలిచాడు. 

Updated : 03 Jul 2024 15:38 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా 2024 టీ20 ప్రపంచ కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) ఐసీసీ ర్యాంకింగ్స్‌ ఆల్‌రౌండర్ల జాబితాలో నంబర్‌ వన్‌గా నిలిచాడు. ప్రపంచ కప్‌లో బంతితో, బ్యాట్‌తో అదరగొట్టిన పాండ్య రెండు స్థానాలు మెరుగుపర్చుకుని శ్రీలంక ఆటగాడు వానిందు హసరంగ (222 పాయింట్లు)తో కలిసి హార్దిక్‌ అగ్రస్థానాన్ని పంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే టీ20ల్లో ఆల్‌రౌండర్ల కేటగిరీలో నంబర్‌ వన్‌గా నిలిచిన తొలి భారత క్రికెటర్‌గా హార్దిక్ రికార్డు సృష్టించాడు. ఇక తాజా ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో మార్కస్‌ స్టాయినిస్‌ (ఆస్ట్రేలియా), సికిందర్ రజా (జింబాబ్వే), షకిబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్‌) ఒక్కో స్థానం మెరుగై వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. అఫ్గానిస్థాన్‌ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ నాలుగు స్థానాలు దిగజారి ఆరో స్థానానికి పడిపోయాడు.  

హార్దిక్ పాండ్య ఈ పొట్టి కప్‌లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో 151.57 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు చేశాడు. ఇందులో ఒక అర్ధ సెంచరీ కూడా ఉంది. 8 మ్యాచ్‌ల్లో 7.64 ఎకానమీ రేటుతో 11 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్‌లో (3/20) అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. కీలక సమయంలో హెన్రిచ్‌ క్లాసెన్, డేవిడ్‌ మిల్లర్‌ను ఔట్ చేసి భారత్ రెండోసారి టీ20 ప్రపంచకప్‌ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ఫైనల్‌లో భారత్ గెలిచిన తర్వాత పాండ్య భావోద్వేగానికి గురయ్యాడు. 

బుమ్రా 12.. అర్ష్‌దీప్‌ 13 

బౌలింగ్ ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. దక్షిణాఫ్రికా పేసర్ అన్రిచ్ నోకియా ఏడు స్థానాలు ఎగబాకి రెండో స్థానం దక్కించుకున్నాడు. భారత స్పిన్నర్లు అక్షర్ పటేల్ ఒక స్థానం మెరుగుపర్చుకుని ఏడో స్థానంలో, కుల్‌దీప్ యాదవ్ మూడు స్థానాలు మెరుగై ఎనిమిదో స్థానంలో నిలిచారు. టీ20 ప్రపంచ కప్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన జస్‌ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 12వ స్థానంలో నిలిచాడు. 2020 చివర నుంచి బుమ్రాకిదే బెస్ట్ ర్యాంకు. పొట్టి కప్‌లో 17 వికెట్లు పడగొట్టిన అర్ష్‌దీప్‌ సింగ్ నాలుగు స్థానాలు మెరుగై 13వ స్థానం దక్కించుకున్నాడు. అర్ష్‌దీప్‌కు టీ20 కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని