Rohit Sharma: రోహిత్‌.. మట్టి రుచి ఎలా ఉంది?

టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు. గురువారం తన నివాసంలో రోహిత్‌శర్మ సేనతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు.

Updated : 05 Jul 2024 16:34 IST

భారత కెప్టెన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ 

దిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఆతిథ్యమిచ్చారు. గురువారం తన నివాసంలో రోహిత్‌శర్మ సేనతో కలిసి అల్పాహార విందులో పాల్గొన్నారు. బార్బడోస్‌ నుంచి గురువారం ఉదయం దిల్లీ చేరుకున్న భారత జట్టు అల్పాహార కార్యక్రమం కోసం ప్రధాని నివాసానికి వెళ్లింది. సుమారు 2 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ఆటగాళ్లతో ముచ్చటించిన ప్రధాని.. క్రికెటర్లు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫొటోలు దిగారు. ఈ సందర్భంగా పొట్టి కప్పులో ఆటగాళ్ల మధురానుభూతుల్ని అడిగి తెలుసుకున్నారు. కప్పు గెలిచిన తర్వాత పిచ్‌ దగ్గర మట్టిని తిన్న రోహిత్‌ను ‘రుచి ఎలా ఉంది?’ అంటూ ప్రధాని వాకబు చేశారు. ఫామ్‌తో ఇబ్బంది పడిన కోహ్లి.. ఫైనల్‌కు తాను ఎలాంటి మనస్తత్వంతో ఉన్నాడో చెబుతుంటే ఆసక్తిగా విన్నారు. ఫైనల్లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు రావడంపై అక్షర్‌ పటేల్‌ అనుభవాన్ని అడిగి తెలుసుకున్నారు. కీలకమైన సమయంలో బౌలింగ్‌ చేస్తున్నప్పుడు తన దృక్పథం ఎలా ఉందని పేసర్‌ బుమ్రాను ప్రధాని అడిగారు. ఆఖర్లో బౌండరీ లైన్‌ దగ్గర అద్భుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పిన సూర్యకుమార్‌ యాదవ్‌ను ఆ ఏడు సెకన్ల సమయం గురించి వివరించాల్సిందిగా కోరారు. అనంతరం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, కార్యదర్శి జై షా ‘నమో’ అని రాసున్న ఒకటో నంబరు జెర్సీని ప్రధానికి బహుకరించారు. ‘‘మన ఛాంపియన్లతో అద్భుతమైన సమావేశం. ప్రపంచకప్‌ గెలిచిన జట్టుకు ఆతిథ్యమిచ్చాను. టోర్నీలో వారి అనుభవాలపై చిరస్మరణీయ సంభాషణ జరిగింది’’ అని మోదీ ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. ‘‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడం గొప్ప గౌరవం. మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సర్‌’’ అని ‘ఎక్స్‌’లో కోహ్లి స్పందించాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు