Hardik Pandya: ఇప్పుడు 140+ కోట్ల మంది ఛాంపియన్లే: హార్దిక్‌ పాండ్య

టీమ్‌ఇండియా రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ను సగర్వంగా అందుకొంది. ఫైనల్‌ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే.

Published : 05 Jul 2024 19:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్‌ను (T20 World Cup 2024) భారత్ అందుకోవడంలో హార్దిక్‌ పాండ్య చివరి ఓవర్‌ అత్యంత కీలకం. దీంతో మొన్నటి వరకు విమర్శలు గుప్పించిన వారే.. ఇప్పుడు పాండ్యను ఆకాశానికెత్తేశారు. ముంబయి వేదికగా జరిగిన పరేడ్‌లో ‘పాండ్య’ నామస్మరణతో హోరెత్తిపోయింది. తిట్టిన నోళ్లే పొగిడాయి. దీంతో హార్దిక్‌ కూడా మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకుంటూ భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. భారత ఆటగాళ్లకు అపూర్వ స్వాగతం దక్కడంపై కూడా హార్దిక్ తన స్పందనను తెలియజేశాడు. ‘‘దేశంలోని 140 కోట్లకుపైగా ఉన్న మనమంతా ఇప్పుడు ఛాంపియన్లం. భారతే నాకు ప్రపంచం. మా మీద ఇంత ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ మధుర క్షణాలను ఎప్పటికీ మరిచిపోలేం. వర్షం వస్తున్నా లెక్కచేయకుండా సంబరాల్లో పాల్గొనందుకు థాంక్స్’’ అని పాండ్య (Hardik Pandya) పోస్టు చేశాడు. 

యువీతో కలిసి సంబరాలు: అభిషేక్

టీ20 ప్రపంచ కప్‌ను భారత్‌ రెండోసారి సొంతం చేసుకోవడంతో యువరాజ్‌ సింగ్‌ చాలా ఉద్వేగానికి గురైనట్లు యువ క్రికెటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) తెలిపాడు. ప్రస్తుతం అభిషేక్ జింబాబ్వేతో టీ20 సిరీస్‌ కోసం అక్కడికి వెళ్లాడు. అంతకుముందు పొట్టి కప్‌ ఫైనల్‌ను యువరాజ్‌తో కలిసి చూసినట్లు అభిషేక్ తెలిపాడు. ‘‘యువీతో కలిసి చూసే అవకాశం దక్కింది. ఫైనల్‌ మ్యాచ్‌ చివరి ఓవర్‌లో కాస్త భావోద్వేగానికి గురయ్యాడు. ఐసీసీ ట్రోఫీని గెలవడం ప్రతి ఒక్కరి కల. ఇప్పటికే అతడు చాలా సాధించాడు. కానీ, ఇప్పుడు టీమ్‌ఇండియా మరొక టైటిల్‌ను ఖాతాలో వేసుకోవడంతో ఆనందపడ్డాడు. ఆ క్షణాలను నేను అస్సలు మరిచిపోలేను. వెంటనే మేం కూడా బయటకొచ్చేసి సంబరాలు చేసుకున్నాం. ఇది చూశాక.. నేను కూడా భారత వరల్డ్‌ కప్‌ జట్టులో ఉండాలని కోరుకున్నా’’ అని అభిషేక్ వ్యాఖ్యానించాడు. 

ముగ్గురు దిగ్గజాలకు అద్భుత ముగింపు: రుతురాజ్‌

‘‘మ్యాచ్‌ చివరి ఓవర్ ఆఖరి బంతి వరకూ వెళ్లి మరీ టీమ్‌ఇండియా విజయం సాధించడం అద్భుతం. ఓటమి అంచుల నుంచి కోలుకుని కప్‌ను సొంతం చేసుకోవడం మాటల్లో వర్ణించలేనిది. టీ20 క్రికెట్‌లో అద్భుతాలు సృష్టించిన ముగ్గురు క్రికెటర్లు రోహిత్, విరాట్, జడేజాకు ఇంతకంటే ఘనమైన ముగింపు ఉండదు’’ అని రుతురాజ్‌ గైక్వాడ్‌ (Ruturaj Gaikwad) వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని