Harbhajan Singh: భారత్‌ విజయంపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ అక్కసు.. పిచ్‌పై ప్రేలాపనలు..!

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్‌ మైకెన్‌ వాన్‌ గయాన పిచ్‌పై చేసిన ప్రేలాపనలకు భారత సీనియర్‌, మాజీ ఆటగాళ్లు బలంగా కౌంటర్‌ ఇచ్చారు. 

Published : 28 Jun 2024 11:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో భారత్‌ విజయాన్ని తక్కువ చేసి చూపించేందుకు ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు మైకెల్‌ వాన్‌ నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తున్నాడు. దీనికి భారత సీనియర్లు, మాజీలు గట్టి కౌంటర్లు ఇచ్చారు. మ్యాచ్‌ ముందునుంచే ఈ ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ భారత్‌పై అక్కసు చూపడం మొదలుపెట్టాడు. ‘అయ్యో.. అఫ్గానిస్థాన్‌ మ్యాచ్‌ గయానా పిచ్‌పై ఆడాల్సింది.. భారత్‌ కోసం దానిని తీసుకొన్నారు’ అంటూ సన్నాయి నొక్కులతో ఇది ప్రారంభమైంది. రెండో సెమీస్‌ జరుగుతున్నంతసేపు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఏదోఒకటి పోస్టు చేస్తూనే ఉన్నాడు. టీమ్ ఇండియా గెలిచాక ‘‘ఇంగ్లాండ్‌ దక్షిణాఫ్రికాను ఓడించి ఉంటే అప్పుడు వారే ట్రినిడాడ్‌కు వెళ్లేవారు. అక్కడ తేలిగ్గా విజయం సాధించేవారని నమ్ముతున్నాను. అందుకే ఇంగ్లిష్‌ జట్టు బాగా ఆడలేదని నేను అనుకోను. కానీ, ఇండియాకు మాత్రం గయానా వేదిక అద్భుతమైన ఎంపిక’’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. 

ఈ పోస్టు చూసిన భారత మాజీ హర్భజన్‌ సింగ్‌కు చిర్రెత్తుకొచ్చి తనదైనశైలిలో కౌంటర్‌ ఇచ్చాడు. ‘‘నువ్వేమనుకుంటున్నావు.. గయానా భారత్‌కు మంచి వేదికనా..? రెండు జట్లు ఒకే వేదికపైన ఆడాయి. ఇంగ్లాండ్‌ టాస్‌ గెలవడం దానికి అడ్వాంటేజ్‌గా మారింది. చిల్లరగా ప్రవర్తించవద్దు. అన్ని విభాగాల్లో ఇంగ్లాండ్‌ మీద భారత్‌ పైచేయి సాధించింది. ఆ విషయాన్ని అంగీకరించి.. నీ చెత్త మొత్తం నీ దగ్గరే ఉంచుకో. లాజిక్‌గా మాట్లాడు. అంతేకానీ నాన్సెన్స్‌ కాదు’’ అని ఘాటుగా పోస్టు చేశాడు. 

సరదాగా లెక్కలు చెప్పిన అశ్విన్‌..

నిన్న గయానాలో మ్యాచ్‌ చివరి సమయంలో వాన్‌ ఎక్స్‌లో చేసిన మరో పోస్ట్‌ వైరల్‌గా మారింది. ‘‘ఫైనల్స్‌కు వెళ్లేందుకు భారత్‌కు పూర్తి అర్హత ఉంది. టోర్నమెంట్‌లో ఇప్పటివరకు అదే బెస్ట్‌ టీమ్‌. ఇలాంటి పిచ్‌లపై ఇంగ్లాండ్‌ ఎప్పుడూ తడబడుతుంది. లోయర్‌, స్లోయర్‌ స్పిన్నింగ్‌ పిచ్‌లపై భారత్‌ ఎప్పుడూ మెరుగ్గా ఆడుతుంది’’ అని పేర్కొన్నాడు. 

వాన్‌ పోస్టుకు వెటరన్‌ స్పిన్నర్‌ ఆర్‌ అశ్విన్‌ స్పందిస్తూ.. గణితంలోని సమగ్ర గణనకు ఉపయోగించే మూడు కీలక సూత్రాలను ప్రస్తావించి.. వాటి ప్రకారం భారత్‌ గెలిచిందన్నాడు. 

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం సెమీఫైనల్లో స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన రోహిత్‌సేన 68 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను మట్టి కరిపించింది. వర్షం వల్ల ఆలస్యంగా మొదలై, మధ్యలోనూ ఆగి.. సాగిన మ్యాచ్‌లో మొదట భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. అనంతరం స్పిన్నర్లు కుల్‌దీప్‌ యాదవ్‌ (3/19), అక్షర్‌ పటేల్‌ (3/23) విజృంభించడంతో ఇంగ్లాండ్‌ 16.4 ఓవర్లలో ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని