Gulbadin Naib: ‘ఫేక్‌ ఇన్‌జూరీ’ ఆరోపణలు.. గుల్బాదిన్‌పై చర్యలు ఉంటాయా? ఐసీసీ రూల్స్‌ ఏంటంటే?

అఫ్గానిస్థాన్ క్రికెటర్ గుల్బాదిన్ నైబ్ ఇప్పుడు నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో అతడు ప్రవర్తించిన తీరు విమర్శలకు దారితీసింది. 

Updated : 26 Jun 2024 11:14 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) అఫ్గానిస్థాన్‌ తొలిసారి సెమీస్‌కు దూసుకొచ్చింది. సూపర్-8 స్టేజ్‌లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌ను ఓడించి నాకౌట్‌ బెర్తును ఖాయం చేసుకుంది. అయితే, బంగ్లాదేశ్‌తో పోరు సందర్భంగా అఫ్గాన్‌ ఆటగాడు గుల్బాదిన్‌ నైబ్ (Gulbadin Naib) తొడ కండరాలు తిమ్మిరి ఎక్కినట్లు ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఆ తర్వాత తమ జట్టు విజయం సాధించిన సంబరాల్లో మాత్రం యాక్టివ్‌గా ఉండటం గమనార్హం. అయితే, మ్యాచ్‌ను ఆలస్యం చేసేందుకు అతడు ‘ఫేక్‌ ఇన్‌జూరీ’ డ్రామా ఆడాడని.. నెట్టింట విపరీతంగా ట్రోలింగ్‌ వచ్చింది. కొందరు మాజీలు కూడా అతడిది ‘ఆస్కార్‌’ యాక్టింగ్‌ అంటూ వ్యాఖ్యలు చేశారు. దానికి గుల్బాదిన్‌ కూడా సమాధానం ఇచ్చాడు. ఒకవేళ గాయం నిజం కాదని తేలితే మాత్రం అతడిపై ఐసీసీ బ్యాన్ విధించే అవకాశం లేకపోలేదు. మరి ఈ రూల్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం..

దురుద్దేశంతో కావాలనే సమయం వృథా చేసేందుకు ప్రయత్నిస్తే ఆర్టికల్ 2.10.7 లెవల్‌ 1 లేదా 2 నేరానికి పాల్పడినట్లు ఐసీసీ భావిస్తుంది. ఉల్లంఘన నిజమని తేలితే మ్యాచ్‌ ఫీజ్‌లో 100 శాతంతోపాటు రెండు డీ మెరిట్‌ పాయింట్లను జరిమానాగా విధిస్తుంది. ఒక ఏడాదిలో ప్లేయర్‌ ఖాతాలో నాలుగు డీమెరిట్‌ పాయింట్లు ఉంటే ఒక టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల నుంచి వేటు పడుతుంది. వీటికి అదనంగా బౌలర్‌ లేదా ఫీల్డర్ ఇలా ఫేక్‌ ఇన్‌జూరీ (Fake Injury) అని సమయాన్ని వృథా చేసినప్పుడు ఆర్టికల్ 41.9 ప్రకారం.. ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు పెనాల్టీ రూపంలో ఇస్తారు. ఫీల్డ్‌ అంపైర్‌దే తుది నిర్ణయం ఉంటుంది. అయితే, బంగ్లా-అఫ్గాన్‌ మ్యాచ్‌లో ఇలా జరగలేదు. సోషల్‌ మీడియాలో అతడిపై విమర్శలు వచ్చినప్పటికీ.. ఇప్పటి వరకు ఐసీసీ (ICC)కి మాత్రం అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు అందలేదు. మ్యాచ్‌ రిఫరీ కూడా దీనిపై ఇప్పటికైతే విచారణ చేపట్టాలని అడగలేదని క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. 

ఇది అంగీకారం కాదు: మాజీలు

మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో మ్యాచ్‌ను కాసేపు ఆపుదామనే ఉద్దేశంతో గుల్బాదిన్‌ ఇలా చేయడం సరైంది కాదని క్రికెట్ వ్యాఖ్యాత, మాజీ క్రికెటర్ సైమన్‌ డౌల్ తెలిపాడు. ‘‘కోచ్‌ నుంచి సందేశం వచ్చింది. కాసేపటికే ఫస్ట్‌స్లిప్‌లో ఉన్న గుల్బాదిన్ అవసరం లేకపోయినా మైదానంలో పడిపోయాడు. ఇదెంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు’’ అని డౌల్‌ వ్యాఖ్యానించాడు. మ్యాచ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మరో మాజీ క్రికెటర్ పోమీ ఎంబంగ్వా ‘‘ఆస్కార్, ఎమ్మీ’’ అవార్డులంటూ కామెంట్ చేశాడు. అశ్విన్‌ (Ashwin) కూడా అద్భుతమైన యాక్టింగ్‌ అంటూ పోస్టు చేసిన సంగతి తెలిసిందే. 

ఇలా పట్టేస్తాయ్..: నైబ్

సోషల్ మీడియాతోపాటు మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేస్తున్న సమయంలో గుల్బాదిన్‌ నైబ్ ఓ పోస్టు పెట్టాడు. వారందరికీ కౌంటర్‌గా షేర్ చేయడం గమనార్హం. ‘‘నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు లేదా బాధతో ఉన్నప్పుడు ఒక్కోసారి కండరాలు పట్టేయడం  జరుగుతుంటుంది’’ అని గుల్బాదిన్‌ పోస్టు చేశాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని