Team India: పండగలా దిగి వచ్చారు

ఉద్వేగం అంబరాన్ని అంటింది.. ప్రపంచాన్ని గెలిసొచ్చిన రోహిత్‌ సేనను చూసి సొంతగడ్డ పులకించింది. ఎటు చూసినా జనాలే.. మిన్నంటిన నినాదాలే.. క్రికెట్‌ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణమే!

Updated : 05 Jul 2024 12:39 IST

రోహిత్‌ సేనకు అభిమానుల బ్రహ్మరథం
జనసంద్రమైన ముంబయి
ముంబయి

ఉద్వేగం అంబరాన్ని అంటింది.. ప్రపంచాన్ని గెలిసొచ్చిన రోహిత్‌ సేనను చూసి సొంతగడ్డ పులకించింది. ఎటు చూసినా జనాలే.. మిన్నంటిన నినాదాలే.. క్రికెట్‌ వీరులు అడుగుపెట్టిన క్షణం నుంచి పండగ వాతావరణమే! సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్‌ సాధించి గురువారం స్వదేశంలో దిగిన భారత క్రికెట్‌ జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ముంబయిలో జరిగిన విజయయాత్రలో వేలాది మంది రోడ్డు పక్కనే నిలిచి తమ హీరోలను చూసి పులకరించిపోయారు. వారి సందడితో ముంబయి తీర ప్రాంతమంతా వెలిగిపోయింది. అరుపులతో దద్ధరిల్లిపోయింది.

సంద్రం.. జనసంద్రం

దిల్లీ నుంచి ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విమానాశ్రయానికి వచ్చిన భారత జట్టుకు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. కెనాన్‌ సెల్యూట్‌ (విమానంపై అటు ఇటు వాటర్‌ ఇంజన్లతో నీళ్లు గుమ్మరించడం)తో విమానాశ్రయ సిబ్బంది భారత జట్టుకు ఆహ్వానం పలికారు. ఎయిర్‌పోర్టు బయట కూడా అభిమానులు భారీగా నిలిచి భారత జట్టును ఆహ్వానించారు. అక్కడ నుంచి నారిమన్‌ పాయింట్‌కు వచ్చిన టీమ్‌ఇండియా.. 7.30కు ఓ ప్రత్యేకమైన ఓపెన్‌ బస్సులో విజయయాత్రను షురూ చేసింది. ఈ యాత్ర సాగిన మెరైన్‌డ్రైవ్‌ రోడ్డు జన సంద్రాన్ని తలపించింది. అభిమానులు తమ క్రికెట్‌ స్టార్లపై పూల వర్షం కురిపిస్తూ భారత్‌ మాతాకీ జై.. జయహో భారత్‌.. వందేమాతరం లాంటి నినాదాలతో హోరెత్తించారు. రోహిత్‌.. రోహిత్‌... కోహ్లి.. కోహ్లి అంటూ ఊగిపోయారు. అభిమానులకు అభివాదం చేస్తూ టీమ్‌ఇండియా ముందుకు కదిలింది. ఒకవైపు వర్షం.. మరోవైపు పూల వర్షంతో భారత జట్టు తడిసిపోయింది. బస్సుపైన కూర్చున్న టీమ్‌ఇండియా ఆటగాళ్లు జాతీయ జెండా చేతబూని ముందుకు సాగారు. కప్‌ను ప్రదర్శిస్తూ అభిమానులకు అభివాదం చేస్తూ ఉత్సాహాన్ని నింపారు. ఒకవైపు వేలాది మంది అభిమానులు వెంటరాగా విజయోత్సవ ర్యాలీ సందడిగా సాగింది. పని దినం కావడంతో కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.

భారత జెర్సీలో మరో తార 

భారత క్రికెట్‌ జట్టు జెర్సీలో మరో తార చేరింది. పొట్టి ఫార్మాట్లో ఆడేటప్పుడు 2007 టీ20 ప్రపంచకప్‌ విజయానికి చిహ్నంగా ఒకే స్టార్‌ ఉండే జెర్సీని టీమ్‌ఇండియా ఆటగాళ్లు ధరించేవాళు.్ల కానీ తాజాగా రోహిత్‌ సేన మరో కప్‌ గెలవడంతో భారత జెర్సీలో రెండు తారలు వచ్చాయి. ఈ విజయం తర్వాత భారత జట్టు సొంతగడ్డపై అడుగుపెట్టిన నేపథ్యంలో ‘ఇండియా ఛాంపియన్స్‌’ పేరుతో ఉన్న కొత్త జెర్సీని బీసీసీఐ విడుదల చేసింది. ఈ ఫొటోను వికెట్‌కీపర్‌ సంజు శాంసన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఈ టీషర్ట్‌లో బీసీసీఐ లోగోపైన ప్రపంచకప్‌ విజయాలకు సూచికగా రెండు స్టార్లు కనిపిస్తున్నాయి. 2007లో మహేంద్రసింగ్‌ ధోని సారథ్యంలోని టీమ్‌ఇండియా తొలి టీ20 ప్రపంచకప్‌ నెగ్గిన సంగతి తెలిసిందే.

రూ.125 కోట్ల బహూకరణ

విజయయాత్ర అనంతరం టీమ్‌ఇండియా ఆటగాళ్లు వాంఖడే స్టేడియానికి వచ్చారు. వారిని చూసేందుకు అభిమానులకు అవకాశం ఇవ్వడంతో స్టేడియం మొత్తం నిండిపోగా వేలాది మంది బయట ఉండిపోయారు. వర్షం కురుస్తున్నా తిండి, నీళ్లూ లేకుండా కూడా ఫ్యాన్స్‌ స్టేడియంలోనే నిరీక్షించారు. టీమ్‌ఇండియా స్టేడియం చేరుకున్నాక.. జాతీయ గీతం ఆలపించారు. ఆ సమయంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. తమకు ఎంతో మద్దతుగా నిలిచిన అభిమానులకు భారత జట్టు స్టేడియం చుట్టూ తిరుగుతూ అభినందనలు తెలిపింది. ముందే ప్రకటించినట్లుగా టీ20 ప్రపంచకప్‌ గెలిచిన టీమ్‌ఇండియాకు బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరానాను అందించింది.

రోహిత్‌ను అలా ఎప్పుడూ చూడలేదు: ప్రపంచకప్‌ సాధించడంతో జట్టులోని అంతా ఉద్వేగానికి గురయ్యారని కోహ్లి వివరించాడు. ‘‘గత పదిహేనేళ్లుగా రోహిత్‌ ఇంత ఉద్వేగానికి గురి కావడాన్ని చూడలేదు. విజేతగా నిలిచి పెవిలియన్‌కు వెళుతున్నప్పుడు రోహిత్‌తో పాటు నాకూ కన్నీళ్లు ఆగలేదు. 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచినప్పుడు సచిన్‌తో పాటు సీనియర్లు ఉద్వేగానికి గురైనప్పుడు నాకు అర్థం కాలేదు. ఈ అనుభవం ఇప్పుడు తెలుస్తోంది’’ అని కోహ్లి అన్నాడు.

హార్దిక్‌కు నీరాజనం

ఐపీఎల్‌లో రోహిత్‌ స్థానంలో ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్‌గా ఎంపికై విఫలం కావడంతో అభిమానుల నుంచి హేళనలు ఎదుర్కొన్న హార్దిక్‌ పాండ్యకు ఈసారి భిన్నమైన అనుభవం ఎదురైంది. ప్రపంచకప్‌ విజయంలో కీలకపాత్ర పోషించిన అతడికి వాంఖడె స్టేడియంలో అభిమానులు నీరాజనం పట్టారు. హార్దిక్‌కు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. అతడితో ఫొటో దిగడానికి ఎగబడ్డారు.

బార్బడోస్‌ నుంచి దిల్లీకి

ప్రపంచకప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన భారత జట్టు.. బార్బడోస్‌లో తుపాను కారణంగా అయిదు రోజులు అక్కడే నిలిచిపోయింది. బుధవారం ప్రత్యేక విమానంలో బయల్దేరి వచ్చింది. ఎయిర్‌ ఇండియా ఛాంపియన్స్‌ 24 ప్రపంచకప్‌ పేరుతో ఉన్న ఈ ప్రత్యేక విమానం.. 16 గంటలు ఏకధాటిగా ప్రయాణించి గురువారం ఉదయం 6 గంటలకు దిల్లీలోని రాజీవ్‌ గాంధీ విమానాశ్రయానికి చేరుకుంది. భారత జట్టు వస్తుందన్న సమాచారం ముందే ఉండడంతో అభిమానులతో విమానాశ్రయ పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. రోహిత్, కోహ్లి, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పోస్టర్స్‌తో ఉన్న ప్లకార్డులు పట్టుకున్న అభిమానులు టీమ్‌ఇండియాను చూడగానే గట్టిగా అరుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. వారితో కరచాలనం చేసేందుకు.. ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. క్రికెటర్లకు భాంగ్రా నృత్యాలతో స్వాగతం పలికారు. వారితో కలిసి రోహిత్, హార్దిక్, సూర్యకుమార్, పంత్‌ కూడా నృత్యం చేశారు. ‘‘ఈ క్షణం కోసం 13 ఏళ్లుగా ఎదురు చూస్తున్నాం. భారత్‌ ప్రపంచకప్‌ గెలవడం ఎంతో గర్వంగా అనిపిస్తోంది’’ అని దిల్లీ ఎయిర్‌పోర్టులో ఉదయం 4.30 నుంచి ఎదురు చూసిన అభిమాని తెలిపాడు.

రెండు గంటలు ఆలస్యంగా: విమానాశ్రయం నుంచి పటిష్ట భద్రత మధ్య హోటల్‌కు చేరిన తర్వాత భారత జట్టు.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్ని, కార్యదర్శి జైషాతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసింది. ఆటగాళ్లను అభినందించిన ప్రధాని వారితో చాలాసేపు మాట్లాడారు. ప్రధానితో అల్పాహారం ముగించిన తర్వాత భారత జట్టు మధ్యాహ్నం 3.45 తర్వాత దిల్లీ నుంచి ముంబయికి బయల్దేరింది. షెడ్యూల్‌ ప్రకారం సాయంత్రం 5 గంటలకు విజయోత్సవ ర్యాలీ ఆరంభం కావాల్సి ఉండగా.. రా.7.30కు ముంబయిలోని మెరైన్‌డ్రైవ్‌లో ఈ యాత్ర షురూ అయింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు