Shubman Gill: మాతో పెట్టుకోవద్దు.. ప్రత్యర్థులకు శుభ్‌మన్‌ గిల్ హెచ్చరిక

ఎలాంటి లక్ష్యమైనా చివరి వరకూ పోరాడటం తమ జట్టు లక్షణమని.. ప్రత్యర్థులెవరూ తమను తేలిగ్గా తీసుకోవద్దని గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ వ్యాఖ్యానించాడు.

Updated : 11 Apr 2024 11:24 IST

ఇంటర్నెట్ డెస్క్: అసాధ్యమనుకున్న విజయాన్ని గుజరాత్‌ తన ఖాతాలో వేసుకుంది. చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌పై గెలిచింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్‌ తొలి ఓటమిని రుచిచూసింది. ఒకదశలో ఆ జట్టు విజయం ఖాయమని అంతా భావించారు. కానీ, కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ (72)తోపాటు సాయి సుదర్శన్ (35), రషీద్ ఖాన్ (24*), రాహుల్ తెవాతియా (22) రాణించడంతో గుజరాత్‌ విజయం సాధించింది. ఈ సందర్భంగా ప్రముఖ కామెంటేటర్‌ హర్షా భోగ్లే వ్యాఖ్యలకు గిల్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 

‘‘చాలా బాగా ఆడారు. మీ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. అయితే, ఇంకాస్త ముందుగానే గెలవాల్సిన మ్యాచ్‌ను చివరి వరకూ తీసుకెళ్తారని కొందరు అనుకుంటున్నారు. అయితే, నేడు విజయం సాధించడంపై అభినందనలు’’ అని హర్షా భోగ్లే అన్నారు. 

కెప్టెన్ గిల్ మాట్లాడుతూ.. ‘‘మేం బరిలో ఉన్నప్పుడు ఎంతటి లక్ష్యమైనా సురక్షితం కాదని గుర్తుంచుకోవాలి. చివరి మూడు ఓవర్లలో 45 పరుగులు చేయాల్సిన తరుణమది. పెద్ద కష్టమేం కాదు. అలాంటి మైండ్‌సెట్‌తో ఆడాం. గణాంకాల ప్రకారం క్రీజ్‌లోని ఇద్దరు బ్యాటర్లు ఒక్కొక్కరు 9 బంతుల్లో 22 పరుగులు చేస్తే సరిపోతుంది. అందులో ఒకరు ఇంకాస్త దూకుడుగా ఆడితే మరింత సులువుతుంది. ఓవర్‌లో రెండు లేదా మూడు బంతులను ఎటాక్‌ చేస్తే చాలు. రషీద్ ఖాన్, రాహుల్ తెవాతియా అదే చేశారు. చివరి బంతికి రషీద్ ఖాన్ ఫోర్ కొట్టడం అద్భుతం. గత మ్యాచ్‌లోనూ 50 శాతం వరకు మేం ఆధిపత్యం ప్రదర్శించాం. చివర్లో ఇబ్బంది పడి దానిని కోల్పోయాం. ఈసారి మాత్రం రషీద్ ఖాన్ మ్యాచ్‌ను గెలిపించాడు. అతడు అద్భుతమైన ప్లేయర్. ఇలాంటి క్రికెటర్ ఉండాలని ప్రతి జట్టూ కోరుకుంటుంది‘’ అని గిల్ వ్యాఖ్యానించాడు. 

విజయమే మరింత సంతోషాన్నిచ్చింది: రషీద్ ఖాన్

‘‘వ్యక్తిగత ప్రదర్శనతో జట్టు విజయం సాధిస్తే ఆ అనుభూతి చాలా బాగుంటుంది. ఎలా ఆడాలని భావించానో అదేవిధంగా బ్యాటింగ్ చేశా. గత మూడు- నాలుగు నెలల ముందు వరకు నేను పెద్దగా బౌలింగ్‌ చేయలేదు. బంతిపై కాస్త గ్రిప్‌ను కూడా కోల్పోయినట్లు భావించా. అయితే, గుజరాత్‌ ట్రైనింగ్‌ సెషన్స్‌లో పాల్గొనడంతో మళ్లీ లయను అందుకోగలిగా. బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌ను ఆస్వాదించా’’ అని రషీద్ ఖాన్‌ తెలిపాడు. అతడు బౌలింగ్‌లో 4 ఓవర్లలో 18 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. బ్యాటింగ్‌లోనూ జట్టును గెలిపించడంతో అతడికే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది.

కొన్ని పరుగులు అదనంగా ఇచ్చాం: సాయి సుదర్శన్

‘‘మేం బౌలింగ్‌లో కొన్ని పరుగులను అదనంగా ఇచ్చాం. కానీ, బ్యాటింగ్‌లో మాత్రం మా వాళ్లు అద్భతంగా రాణించారు. చివరికి విజయం సాధించగలిగాం. పవర్‌ ప్లేలో ఎక్కువ పరుగులు చేయాలని ముందే అనుకున్నాం. ఆ తర్వాత స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోవడంతో ఆందోళనకు గురయ్యాం. బ్యాటింగ్‌ చేయడం ఇక్కడ అంత సులువేం కాదు. చివర్లో మా హిట్టర్లు దూకుడుగా ఆడి పరుగులు రాబట్టారు. ఇలాంటి సమయంలో మాకు ఈ విజయం అత్యంత కీలకం. మున్ముందూ ఇదే ఊపును కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం’’ అని సాయి సుదర్శన్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని