క్వార్టర్స్‌లో తుర్కియే

తొలి నిమిషంలో గోల్‌.. ఆఖరి సెకన్లలో అద్భుత సేవ్‌తో తుర్కియే యూరో  కప్‌ ఫుట్‌బాల్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. నాకౌట్‌ మ్యాచ్‌ (రౌండ్‌ ఆఫ్‌ 16)లో ఆ జట్టు 2-1తో ఆస్ట్రియాపై విజయం సాధించింది.

Published : 04 Jul 2024 03:21 IST

రసవత్తర పోరులో ఆస్ట్రియాపై విజయం 
లీప్‌జిగ్‌ (జర్మనీ)

తొలి నిమిషంలో గోల్‌.. ఆఖరి సెకన్లలో అద్భుత సేవ్‌తో తుర్కియే యూరో  కప్‌ ఫుట్‌బాల్‌లో క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించింది. నాకౌట్‌ మ్యాచ్‌ (రౌండ్‌ ఆఫ్‌ 16)లో ఆ జట్టు 2-1తో ఆస్ట్రియాపై విజయం సాధించింది. అద్భుత సేవ్‌తో గోల్‌కీపర్‌ గునాక్, రెండు గోల్స్‌తో మెరిహ్‌ డెమిరల్‌ తుర్కియే విజయంలో కీలక పాత్ర పోషించారు. మ్యాచ్‌ ఆరంభమే రసవత్తరం. తొలి 30 సెకన్లలోనే రెండు జట్లకు అవకాశాలు లభించాయి. కార్నర్‌ను అడ్డుకోవడంలో ఆస్ట్రియా డిఫెన్స్‌ గందరగోళానికి గురికావడంతో డెమిరల్‌ సమీపం నుంచి గోల్‌కొట్టి తుర్కియేను ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. యూరోలో ఇది రెండో అత్యంత వేగవంతమైన గోల్‌. వెంటనే ఆస్ట్రియా కూడా ఎటాకింగ్‌కు దిగింది. రెండు నిమిషాల్లోనే స్కోరు సమం చేసినంత పని చేసింది. కానీ కొద్దిలో గోల్‌ తప్పింది. దూకుడు కొనసాగించిన ఆస్ట్రియా ఆ తర్వాత మరికొన్ని ప్రయత్నాలు చేసినా తుర్కియే గోల్‌కీపర్‌ మెర్ట్‌ గునాక్‌కు బోల్తా కొట్టించలేకపోయింది. ఆ జట్టు విరామం తర్వాత మరింత దూకుడు ప్రదర్శించింది. కానీ ఓ కార్నర్‌తో తుర్కియే ఊపిరిపీల్చుకుంది. 59వ నిమిషంలో అర్దా గులెర్‌ క్రాస్‌ను డెమిరల్‌ తలతో నెట్లోకి కొట్టడంతో తుర్కియే 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాసేపటికే గ్రెగోరిటిష్‌ (66వ) గోల్‌తో ఆస్ట్రియా 1-2తో నిలిచింది. స్కోరు సమం చేయడానికి ఆ తర్వాత ఆస్ట్రియా ఎంతో ప్రయత్నం చేసింది. కానీ తుర్కియే రక్షణ శ్రేణి ఆ ప్రయత్నాలను అడ్డుకుంది. ఆఖర్లో రెండు జట్లూ అవకాశాలు సృష్టించుకున్నా స్కోర్‌ చేయలేకపోయాయి. కానీ ఆఖరి సెకన్లలో ఆస్ట్రియా దాదాపు గోల్‌ కొట్టినంత పని చేసింది. బౌమ్‌గార్ట్‌నర్‌ సమీపం నుంచి కొట్టిన హెడర్‌ను తుర్కియే గోల్‌కీపర్‌ గునాక్‌ గాల్లో కుడివైపుకు డైవ్‌ చేస్తూ కళ్లు చెదిరే రీతిలో అడ్డుకోవడంతో ఆ జట్టు సంబరాల్లో మునిగిపోయింది. ఈ  మ్యాచ్‌లో బంతి ఎక్కువగా ఆస్ట్రియా నియంత్రణలోనే ఉంది .తుర్కియే క్వార్టర్‌ఫైనల్లో నెదర్లాండ్స్‌ను ఢీకొంటుంది.


బ్రెజిల్‌ ముందంజ

సాంతా క్లారా (అమెరికా): బ్రెజిల్‌ జట్టు కోపా అమెరికా క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. కొలంబియాతో మ్యాచ్‌ను 1-1తో డ్రాగా ముగించిన ఆ జట్టు గ్రూప్‌-డి నుంచి రెండో స్థానం (5 పాయింట్లు)తో ముందంజ వేసింది. బ్రెజిల్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే నెగ్గి.. రెండింటిని డ్రాగా ముగించింది. ఏడు పాయింట్లతో ఈ గ్రూప్‌లో కొలంబియా  (7 పాయింట్లు) అగ్రస్థానం సాధించింది. పరాగ్వేను 2-1తో ఓడించినప్పటికీ కోస్టారికా (4) గ్రూపులో మూడో స్థానంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్స్‌లో పనామాతో కొలంబియా, ఉరుగ్వేతో బ్రెజిల్‌ తలపడతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని