కొత్త సవాల్‌ను అధిగమించాం

ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఎదురవుతున్న కొత్త సవాల్‌ను అధిగమించినట్లు సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి ద్వయం తెలిపింది.

Published : 04 Jul 2024 03:19 IST

దిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్‌లో ఎదురవుతున్న కొత్త సవాల్‌ను అధిగమించినట్లు సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి ద్వయం తెలిపింది. ఇటీవల తరచుగా కొరియా, ఇండోనేసియా ప్రత్యర్థులు షటిల్‌ను స్పిన్‌ చేస్తూ, దూరంగా సంధిస్తూ సర్వ్‌ చేస్తూ భారత నం.1 జోడీని ఇబ్బందిపెడుతున్నారు. పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు ఈ సవాల్‌కు పరిష్కారం కనుగొన్నట్లు సాత్విక్‌- చిరాగ్‌ జంట పేర్కొంది. ‘‘సర్వ్‌ వైవిధ్యాలు కొత్త సవాళ్లే. కానీ దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకూడదు. అలాంటి సర్వ్‌లను స్వీకరించడానికి కొంత ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఆ సవాల్‌ను ఛేదించాం. ఏం చేయాలో మాకు తెలుసు. అందుకు అనుగుణంగా సాధన చేస్తున్నాం. ఒలింపిక్స్‌లో అలాంటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటాం’’ అని చెప్పింది. పారిస్‌ ఒలింపిక్స్‌ సన్నద్ధతపై మాట్లాడుతూ.. ‘‘టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న అనుభవం పారిస్‌కు ఎంతగానో పనికొస్తుంది. అత్యున్నత స్థాయిలో ఆడటం వల్ల ఒత్తిడిని తట్టుకోవడం, ఏకాగ్రతను కాపాడుకోవడం, పరిస్థితులకు తగ్గట్లు ఆటతీరును మార్చుకోవడం నేర్చుకున్నాం. ఒలింపిక్స్‌లో తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అత్యున్నత వేదికలో ఆడిన అనుభవం ఇప్పటికే సాధించాం. ఒలింపిక్స్‌లో తొలిసారి ఆడుతున్నప్పుడు చేసే పొరపాట్లు ఇప్పుడు ఉండవు. ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలవడం కూడా మా ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఒలింపిక్స్‌ సమీపిస్తున్నకొద్దీ మా సన్నాహం మరింత జోరందుకుంది. ప్రతి విభాగాన్ని సానబెడుతున్నాం. పారిస్‌ కోర్టులో అడుగుపెట్టినప్పుడు అత్యుత్తమంగా ఆడాలని భావిస్తున్నాం. ప్రత్యర్థుల బలాలు, బలహీనతలకు తగ్గట్లుగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ప్రస్తుతం మేం మంచి లయతో ఉన్నాం. శారీరక, మానసిక ఫిట్‌నెస్‌ కూడా ప్రధానం. ఒలింపిక్స్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అని సాత్విక్, చిరాగ్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని