బాయ్‌కాట్‌కు మళ్లీ క్యాన్సర్‌

ఇంగ్లాండ్‌ క్రికెట్‌ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్‌ రెండోసారి గొంతు క్యాన్సర్‌ బారినపడ్డాడు. రెండు వారాల్లో అతడికి శస్త్రచికిత్స జరగనుంది.

Published : 04 Jul 2024 03:17 IST

లండన్‌: ఇంగ్లాండ్‌ క్రికెట్‌ దిగ్గజం జెఫ్రీ బాయ్‌కాట్‌ రెండోసారి గొంతు క్యాన్సర్‌ బారినపడ్డాడు. రెండు వారాల్లో అతడికి శస్త్రచికిత్స జరగనుంది. ‘‘రెండోసారి క్యాన్సర్‌ను జయించాలంటే మంచి వైద్యంతోపాటు కాస్త అదృష్టం ఉండాలని గత అనుభవంతో నాకు అర్థమైంది. శస్త్రచికిత్స విజయవంతమైనా.. క్యాన్సర్‌ మళ్లీ వచ్చే అవకాశముంటుందని ప్రతి క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తుడికీ తెలుసు’’ అని బాయ్‌కాట్‌ అన్నాడు. 83 ఏళ్ల బాయ్‌కాట్‌ తొలిసారి 2002లో క్యాన్సర్‌ బారిన పడ్డాడు. చాలా రోజులు పోరాడి కోలుకున్నాడు.


ఆడ్వాణీ శుభారంభం 

రియాద్‌: ఆసియా బిలియర్డ్స్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ ఆటగాడు పంకజ్‌ ఆడ్వాణీ శుభారంభం చేశాడు. బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఆడ్వాణీ 4-2తో ఆంగ్‌ ఫ్యో (మయన్మార్‌)పై విజయం సాధించాడు. రెండో పోరులో 4-3తో యుటపప్‌ పక్‌పోజ్‌ (థాయ్‌లాండ్‌)పై గెలుపొందాడు. ఈ టోర్నీలో వరుసగా రెండు సార్లు విజేతగా నిలిచిన 38 ఏళ్ల ఆడ్వాణీ హ్యాట్రిక్‌ సాధించాలని భావిస్తున్నాడు.


ప్రజ్ఞానంద, గుకేశ్‌లకు డ్రా 

బుకారెస్ట్‌: గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా జరుగుతున్న సూపర్‌బెట్‌ క్లాసిక్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానందకు మరో డ్రా ఎదురైంది. ఏడో రౌండ్లో తనకంటే తక్కువ ర్యాంకులో ఉన్న డియాచ్‌ బోగ్దాన్‌ (రొమేనియా)తో అతను పాయింట్లు పంచుకున్నాడు. ఈ గేమ్‌ 38 ఎత్తుల్లో ముగిసింది. నవంబరులో ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ఆడబోతున్న దొమ్మరాజు గుకేశ్‌.. మ్యాగ్జిమ్‌ వాచియెర్‌ (ఫ్రాన్స్‌)తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. మరో మూడు రౌండ్లు మిగిలివున్న ఈ టోర్నీలో కరువానా (అమెరికా) 4 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. గుకేశ్‌ (3.5), అలీ రెజా (3.5) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.


జింబాబ్వేలో భారత జట్టు 

హరారె: కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్, కోచ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో భారత యువ జట్టు జింజాబ్వే చేరుకుంది. అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఈనెల 6న ప్రారంభంకానుంది. గిల్‌ అమెరికా నుంచి రాగా.. మిగతా జట్టంతా ముంబయి నుంచి బయల్దేరి హరారెలో అడుగుపెట్టింది. ‘‘టీ20 ప్రపంచ ఛాంపియన్‌ భారత్‌ను స్వాగతిస్తున్నాం’’ అని ‘ఎక్స్‌’లో జింబాబ్వే క్రికెట్‌ బోర్డు పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని