వింబుల్డన్‌ ఛాంపియన్‌కు చెక్‌

వింబుల్డన్‌ ఆరంభంలోనే షాక్‌! మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వొండ్రుసోవా (రష్యా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. స్పెయిన్‌ అన్‌సీడెడ్‌ జెస్సికా బౌజాస్‌ 6-4, 6-2తో వరుస సెట్లలో ఆరోసీడ్‌ వొండ్రుసోవా ఆట కట్టించింది.

Published : 03 Jul 2024 02:33 IST

తొలి రౌండ్లోనే వొండ్రుసోవా ఔట్‌
జకోవిచ్, రిబకినా ముందంజ
లండన్‌

వింబుల్డన్‌ ఆరంభంలోనే షాక్‌! మహిళల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వొండ్రుసోవా (రష్యా) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. స్పెయిన్‌ అన్‌సీడెడ్‌ జెస్సికా బౌజాస్‌ 6-4, 6-2తో వరుస సెట్లలో ఆరోసీడ్‌ వొండ్రుసోవా ఆట కట్టించింది. కెరీర్‌లో మూడోసారి మాత్రమే గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ మెయిన్‌డ్రాలో ఆడుతున్న ప్రపంచ 83వ ర్యాంకర్‌ జెస్సికా.. 67 నిమిషాల్లోనే ఛాంపియన్‌కు చెక్‌ పెట్టింది. ఈ క్రమంలో అయిదు బ్రేక్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. ఏడు అనవసర తప్పిదాలు చేసిన వొండ్రుసోవా ఓటమి కొనితెచ్చుకుంది. వొండ్రుసోవా ఓపెన్‌ శకంలో వింబుల్డన్‌ తొలి రౌండ్లోనే ఓడిన రెండో డిఫెండింగ్‌ ఛాంపియన్‌. 1994లో జర్మనీ తార స్టెఫీగ్రాఫ్‌ ఇలాగే ఓడిపోయింది. మరోవైపు నాలుగోసీడ్‌ రిబకినా (కజకిస్థాన్‌) ముందంజ వేసింది. తొలి రౌండ్లో ఆమె 6-3, 6-1తో రూస్‌ (రొమేనియా)ను ఓడించింది. ఈ క్రమంలో మూడు ఏస్‌లు కొట్టడంతో పాటు అయిదుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేసింది. అయిదోసీడ్‌ జెస్సికా పెగులా (అమెరికా) కూడా రెండో రౌండ్‌ చేరింది. ఆమె 6-2, 6-0తో మరో అమెరికా అమ్మాయి క్రూగర్‌ను చిత్తు చేసింది. బుర్సా (స్పెయిన్‌), సిగ్మండ్‌ (జర్మనీ), వాంగ్‌ (చైనా) కూడా తొలి రౌండ్‌ను అధిగమించారు.టైటిల్‌పై గురిపెట్టిన ఇగా స్వైటెక్‌ (పోలెండ్‌) శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఈ టాప్‌సీడ్‌ 6-3, 6-4తో కెనిన్‌ (అమెరికా)ను ఓడించింది. ఇంకో మ్యాచ్‌లో బౌల్టర్‌ (బ్రిటన్‌) 7-6 (8-6), 7-5తో మారియా (జర్మనీ)పై నెగ్గింది.

జకో శుభారంభం: గాయం తర్వాత పునరాగమనం చేసిన మాజీ నంబర్‌వన్‌ నొవాక్‌ జకోవిచ్‌ వింబుల్డన్‌లో శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో ఈ ఏడుసార్లు ఛాంపియన్‌ 6-1, 6-2, 6-2తో కొప్రికా (చెక్‌)ను తేలిగ్గా ఓడించాడు. దాదాపు రెండు గంటల్లో ముగిసిన ఈ పోరులో జకో ఎక్కడా ఇబ్బందిపడలేదు.  దూకుడుగా ఆడిన అతడు ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌ బ్రేక్‌ చేశాడు. ఈ క్రమంలో 10 ఏస్‌లు కూడా కొట్టాడు. నాలుగోసీడ్‌ జ్వెరెవ్‌ (జర్మనీ), ఏడోసీడ్‌ హర్కాజ్‌ (పోలెండ్‌) కూడా రెండో రౌండ్‌ చేరారు. జ్వెరెవ్‌ 6-2, 6-4, 6-2తో కార్‌బాలెస్‌ (స్పెయిన్‌)పై.. హర్కాజ్‌ 5-7, 6-4, 6-3, 6-4తో అల్బోట్‌ (మాల్దోవా)పై నెగ్గారు. మరోవైపు ఆరోసీడ్‌ రుబ్లెవ్‌ (రష్యా)కు షాక్‌ తగిలింది. అతడు 4-6, 7-5, 2-6, 6-7 (5-7)తో కొమ్‌సనా (అర్జెంటీనా) చేతిలో కంగుతిన్నాడు. తొమ్మిదోసీడ్‌ డిమినర్‌ (ఆస్ట్రేలియా), నిషిక (జపాన్‌), పాప్‌యిరిన్‌ (ఆస్ట్రేలియా) కూడా ముందంజ వేశారు. 

నగాల్‌ ఔట్‌: భారత స్టార్‌ సుమిత్‌ నగాల్‌ పోరాటం తొలి రౌండ్లోనే ముగిసింది. అతడు 2-6, 6-3, 3-6, 4-6తో కెక్‌మనోవిచ్‌ (సెర్బియా)పై పోరాడి ఓడాడు. తొలి సెట్‌ చేజార్చుకున్నా.. పట్టుదలగా ఆడిన నగాల్‌ రెండో సెట్‌ గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. కానీ తర్వాతి రెండు సెట్లలోనూ సత్తా చాటినా కీలక సమయాల్లో తడబడి ఓటమివైపు నిలిచాడు. 4 డబుల్‌ ఫాల్ట్స్‌ చేయడం.. ఏడుసార్లు సర్వీస్‌ కోల్పోవడం నగాల్‌ను ముంచింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని