క్వార్టర్స్‌లో ఫ్రాన్స్‌

ఫ్రాన్స్, పోర్చుగల్‌ జట్లు యూరో 2024 క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాయి. మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ నాకౌట్‌ మ్యాచ్‌ (రౌండ్‌ ఆఫ్‌ 16)లో ఫ్రాన్స్‌ 1-0తో బెల్జియంపై విజయం సాధించింది.

Published : 03 Jul 2024 02:32 IST

డసెల్‌డార్ఫ్‌ (జర్మనీ): ఫ్రాన్స్, పోర్చుగల్‌ జట్లు యూరో 2024 క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాయి. మరోసారి స్థాయికి తగ్గ ప్రదర్శన చేయకపోయినప్పటికీ నాకౌట్‌ మ్యాచ్‌ (రౌండ్‌ ఆఫ్‌ 16)లో ఫ్రాన్స్‌ 1-0తో బెల్జియంపై విజయం సాధించింది. బెల్జియం సెల్ఫ్‌ గోల్‌తో ఫ్రాన్స్‌ గట్టెక్కింది. ప్రపంచ నంబర్‌ 2 (ఫ్రాన్స్‌), నంబర్‌ 3 (బెల్జియం) మధ్య పోరు ఆ స్థాయి తీవ్రతతో జరగలేదు. 85వ నిమిషంలో బెల్జియం డిఫెండర్‌ జాన్‌ వెర్టాంగెన్‌ సెల్ఫ్‌ గోల్‌తో ఫ్రాన్స్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు రాండల్‌ కోలో మౌని షాట్‌.. బెల్జియం డిఫెండర్‌ వెర్టాంగెన్‌ను తాకి నెట్లోకి వెళ్లింది. ఈ టోర్నీలో ఫ్రాన్స్‌కు లభించిన రెండో సెల్ఫ్‌ గోల్‌ ఇది. మరో గోల్‌ను ఎంబాపె పెనాల్టీ ద్వారా సాధించాడు. అంటే యూరో 2024లో ఫ్రాన్స్‌ ఇప్పటివరకు ఓపెన్‌ ప్లే ద్వారా ఒక్క గోల్‌ కూడా సాధించలేదన్నమాట. ఫ్రాన్స్‌ శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో పోర్చుగల్‌తో తలపడుతుంది.

షూటౌట్లో గట్టెక్కిన పోర్చుగల్‌: నాటకీయంగా సాగిన పోరులో పోర్చుగల్‌ షూటౌట్లో 3-0తో స్లొవేనియాపై విజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 57వ స్థానంలో ఉన్న స్లొవేనియా.. ఆరో స్థానంలో ఉన్న పోర్చుగల్‌కు గట్టి పోటీనే ఇచ్చింది. నిర్ణీత సమయం, అదనపు సమయంలోనూ రెండు జట్లు 0-0తో సమంగా నిలిచాయి. అదనపు సమయంలో పోర్చుగల్‌కు లభించిన పెనాల్టీని రొనాల్డో వృథా చేశాడు. అతడి కిక్‌ను స్లొవేనియా గోల్‌కీపర్‌ జాన్‌ ఒబ్లాక్‌ అడ్డుకున్నాడు. దీంతో రొనాల్డో కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే షూటౌట్లో మొదట స్కోర్‌ చేసి పోర్చుగల్‌ను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది అతడే. తర్వాతి రెండు ప్రయత్నాల్లోనూ ఆ జట్టు విజయవంతం కాగా.. స్లొవేనియా వరుసగా మూడు ప్రయత్నాల్లోనూ విఫలమై పరాజయంపాలైంది. పోర్చుగల్‌ గోల్‌కీపర్‌ డీగో కోస్టా.. స్లొవేనియా మూడు కిక్‌లనూ అడ్డుకున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని