భారత జట్టులో సాయి, జితేష్‌

యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, జితేష్‌ శర్మ, హర్షిత్‌ రాణాలకు సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన సంజు శాంసన్, శివమ్‌ దూబె, యశస్వి జైస్వాల్‌ స్థానంలో తొలి రెండు మ్యాచ్‌లకు ఈ ముగ్గురికి భారత జట్టులో చోటు కల్పించారు.

Published : 03 Jul 2024 02:32 IST

హర్షిత్‌ రాణా కూడా

దిల్లీ: యువ ఆటగాళ్లు సాయి సుదర్శన్, జితేష్‌ శర్మ, హర్షిత్‌ రాణాలకు సెలెక్టర్ల నుంచి పిలుపొచ్చింది. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన సంజు శాంసన్, శివమ్‌ దూబె, యశస్వి జైస్వాల్‌ స్థానంలో తొలి రెండు మ్యాచ్‌లకు ఈ ముగ్గురికి భారత జట్టులో చోటు కల్పించారు. టీ20 ప్రపంచకప్‌ బృందంలో సభ్యులుగా ఉన్న సంజు, దూబె, జైశ్వాల్‌.. బార్బడోస్‌లో తుపాను కారణంగా జట్టుతో పాటే అక్కడే ఉన్నారు. ఈ ముగ్గురు సహా భారత జట్టు మంగళవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో భారత్‌కు పయనమవుతుంది. బుధవారం రాత్రి 7.45 గంటలకు జట్టు భారత్‌కు చేరుకుంటుంది. అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆటగాళ్లను సత్కరిస్తారు. అనివార్య కారణాలతో బీసీసీఐ ముగ్గురు ఆటగాళ్ల స్థానాలను భర్తీ చేసింది. అయితే ప్రపంచకప్‌కు రిజర్వ్‌గా వెళ్లిన పేసర్‌ ఖలీల్‌ అహ్మద్, బ్యాటర్‌ రింకూ సింగ్‌ బార్బడోస్‌లోనే ఉన్నారు. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన ఈ ఇద్దరి స్థానాలకు బీసీసీఐ ప్రత్యమ్నాయాలను ప్రకటించలేదు. ప్రస్తుతం లండన్‌లో సర్రే తరఫున కౌంటీ క్రికెట్‌ ఆడుతున్న సాయి.. వెంటనే జింబాబ్వేకు బయల్దేరనున్నాడు. జులై 6న ప్రారంభమయ్యే సిరీస్‌లో భారత్, జింబాబ్వే అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడతాయి.

తొలి రెండు టీ20లకు భారత జట్టు: శుబ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, అభిషేక్‌ శర్మ, రింకూ సింగ్, ధ్రువ్‌ జురెల్‌ (వికెట్‌ కీపర్‌), రియాన్‌ పరాగ్, వాషింగ్టన్‌ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్‌ ఖాన్, ఖలీల్‌ అహ్మద్, ముకేశ్‌ కుమార్, తుషార్‌ దేశ్‌పాండే, సాయి సుదర్శన్, జితేష్‌ శర్మ (వికెట్‌ కీపర్‌), హర్షిత్‌ రాణా


జింబాబ్వేకు టీమ్‌ఇండియా 

ముంబయి: అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం టీమ్‌ఇండియా.. జింబాబ్వేకు బయల్దేరింది. జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో భారత జట్టు మంగళవారం పయనమైనట్లు బీసీసీఐ పేర్కొంది. లక్ష్మణ్‌తో పాటు అభిషేక్‌ శర్మ, రియాన్‌ పరాగ్, రుతురాజ్‌ గైక్వాడ్, అవేష్‌ ఖాన్, రవి బిష్ణోయ్, వాషింగ్టన్‌ సుందర్, తుషార్‌ దేశ్‌పాండే విమానంలో కూర్చున్న ఫొటోల్ని ‘ఎక్స్‌’లో బీసీసీఐ పంచుకుంది. టీ20 ప్రపంచకప్‌కు రిజర్వ్‌ ఓపెనర్‌గా ఎంపికైన కెప్టెన్‌ శుభ్మ్‌న్‌ గిల్‌ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అతను అక్కడ్నుంచే జింబాబ్వే చేరుకుంటాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని