పారిస్‌ ఒలింపిక్స్‌లో జ్యోతి!

తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి ఒలింపిక్స్‌ 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీ పడనున్న తొలి భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కనుంది! ర్యాంకింగ్‌ కోటాలో జ్యోతి పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది.

Updated : 03 Jul 2024 09:43 IST

దిల్లీ: తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి ఒలింపిక్స్‌ 100 మీటర్ల హర్డిల్స్‌లో పోటీ పడనున్న తొలి భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కనుంది! ర్యాంకింగ్‌ కోటాలో జ్యోతి పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ర్యాంకింగ్‌ ఆధారంగా అర్హత సాధించిన అథ్లెట్ల జాబితాను ప్రపంచ అథ్లెటిక్‌ సమాఖ్య ప్రకటించగా.. అందులో జ్యోతి పేరుంది. ఒలింపిక్స్‌ అర్హత ప్రమాణం 12.77 సెకన్లు కాగా.. మేలో ఫిన్‌లాండ్‌ వేదికగా జరిగిన పోటీల్లో జ్యోతి 12.78 టైమింగ్‌ నమోదు చేసింది. అయితే ప్రపంచ టాప్‌-40 అథ్లెట్లకు ఒలింపిక్స్‌లో అవకాశం దక్కుతుంది. జ్యోతి ప్రస్తుత ర్యాంకు 34. జ్యోతిని పారిస్‌కు పంపడంపై భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య తుది నిర్ణయం తీసుకోనుంది.


టీమ్‌ఇండియా రాక నేడు 

బ్రిడ్జ్‌టౌన్‌ (బార్బడోస్‌): టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన టీమ్‌ఇండియా బుధవారం భారత్‌ చేరుకోనుంది. తీవ్ర తుఫాను కారణంగా ప్రతికూల పరిస్థితులు నెలకొనడంతో రోహిత్‌శర్మ సేన, సహాయక సిబ్బంది, బీసీసీఐ అధికారులు, ఆటగాళ్ల కుటుంబ సభ్యులు రెండ్రోజులుగా బార్బడోస్‌లోనే ఉన్నారు. వాతావరణం మెరుగవడంతో అక్కడున్న వాళ్లంతా ప్రత్యేక విమానంలో బార్బడోస్‌ నుంచి బయల్దేరనున్నారు. బుధవారం రాత్రి 7.45 గంటలకు విమానం దిల్లీ చేరుకుంటుంది.


ఇంగ్లాండ్‌ అండర్‌-19 జట్టులో వాన్, ఫ్లింటాఫ్‌ కొడుకులు 

లండన్‌: ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాళ్లు మైకెల్‌ వాన్, ఆండ్రూ ఫ్లింటాఫ్‌ల వారసులు ఆ దేశ అండర్‌-19 టెస్టు జట్టుకు ఎంపికయ్యారు. వాన్‌ కొడుకు ఆర్చీ వాన్, ఫ్లింటాఫ్‌ కొడుకు రాకీ ఫ్లింటాఫ్‌లకు శ్రీలంక అండర్‌-19తో రెండు మ్యాచ్‌ల సిరీస్‌కు ఎంపిక చేసిన 14 మంది సభ్యుల ఇంగ్లాండ్‌ జట్టులో చోటు దక్కింది. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్, ఆఫ్‌స్పిన్నరైన 18 ఏళ్ల ఆర్చీ ఈ సీజన్‌లో సోమర్‌సెట్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 16 ఏళ్ల రాకీ ఇప్పటికే ఇంగ్లాండ్‌ తరఫున యూత్‌ వన్డేల్లో అరంగేట్రం చేశాడు.


కోపా నుంచి అమెరికా ఔట్‌ 

కన్సాస్‌ సిటీ: కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీ నుంచి అమెరికా నిష్క్రమించింది. గ్రూప్‌-సిలో తన ఆఖరి మ్యాచ్‌లో ఆ జట్టు 0-1తో ఉరుగ్వే చేతిలో పరాజయంపాలైంది. ఉరుగ్వే తరఫున 66వ నిమిషంలో ఒలివెరా గోల్‌ కొట్టాడు. క్వార్టర్స్‌ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో అమెరికా విఫలమైంది. మరో మ్యాచ్‌లో 3-1తో బొలివియాను ఓడించిన పనామా.. గ్రూప్‌-సి నుంచి ఉరుగ్వే తర్వాత రెండో స్థానంతో క్వార్టర్స్‌లో ప్రవేశించింది. పనామా కన్నా మెరుగైన విజయం సాధిస్తేనే అమెరికా క్వార్టర్స్‌ చేరేది. 


అన్షుమన్‌ను ఆదుకోండి! 

దిల్లీ: బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న భారత మాజీ క్రికెటర్, కోచ్‌ అన్షుమన్‌ గైక్వాడ్‌ను బీసీసీఐ ఆదుకోవాలని మాజీ ఆటగాడు సందీప్‌ పాటిల్‌ కోరాడు. ‘‘బ్లడ్‌ క్యాన్సర్‌కు చికిత్స చేయించుకోవడానికి డబ్బులు అవసరమని గైక్వాడ్‌ చెప్పాడు. దీంతో దిలీప్‌ వెంగ్‌సర్కార్, నేనూ బీసీసీఐ కోశాధికారి ఆశిష్‌ షెలార్‌తో మాట్లాడాం. అతడు సానుకూలంగానే స్పందించాడు. ఆర్థిక సహాయం కోసం మిగిలిన క్రికెటర్ల అభ్యర్థనలతో పాటు దీన్ని కూడా పరిశీలిస్తామని చెప్పాడు. కానీ గైక్వాడ్‌ చికిత్సకు వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేయాలి. ఏ దేశ క్రికెట్‌ బోర్డు అయిన తమ ఆటగాళ్లను కాపాడుకోవాలి’’ అని పాటిల్‌ అన్నాడు. 1975-87 మధ్య భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన అన్షుమన్‌ 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. రెండు పర్యాయాలు (1997, 2000) టీమ్‌ఇండియా కోచ్‌గా కూడా పని చేశాడు. 


శరణార్థి జట్టును ఏర్పాటు చేయండి: అఫ్గాన్‌ మహిళా క్రికెటర్లు 

సిడ్నీ: ఆస్ట్రేలియాలో శరణార్థి జట్టు ఏర్పాటుకు మద్దతివ్వాలంటూ అఫ్గానిస్థాన్‌ మహిళా క్రికెటర్లు ఐసీసీని మరోసారి కోరారు. టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ పురుషుల జట్టు సెమీఫైనల్‌ చేరి చరిత్ర సృష్టించిన నేపథ్యంలో మహిళా క్రికెటర్లు ఐసీసీకి లేఖ రాశారు. అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడం.. క్రీడల్లో పాల్గొనకుండా మహిళలపై నిషేధం విధించడంతో 2021లో 24 మందికి పైగా క్రికెటర్లు ఆసీస్‌లో ఆశ్రయం పొందారు. ఈ క్రికెటర్లు 2023లో మొదటి సారిగా ఐసీసీని సంప్రదించినా ఫలితం లేకపోయింది. చాలామంది అమ్మాయిలు ఆసీస్‌లో దేశవాళీ క్రికెట్లో కొనసాగుతున్నా.. అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం లేకుండా పోయింది. ‘‘మా దేశ పురుష క్రికెటర్ల మాదిరిగా దేశానికి ప్రాతినిధ్యం వహించలేకపోతుండటం విచారంగా ఉంది. ఆసీస్‌లో శరణార్థి జట్టును ఏర్పాటు చేసేందుకు ఐసీసీ సహాయం కోరుతున్నాం. క్రికెట్‌ ఆడాలని కలలు కంటున్న ఎంతోమంది అఫ్గాన్‌ మహిళలందరికీ ప్రాతినిధ్యం వహించాలన్నదే మా లక్ష్యం’’ అని ఐసీసీ ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్‌క్లేకు రాసిన లేఖలో అఫ్గాన్‌ మహిళా క్రికెటర్లు పేర్కొన్నారు.


ఓటమిని జీర్ణించుకోవడం కష్టం: మిల్లర్‌ 

జొహానెస్‌బర్గ్‌: టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో ఓటమిని జీర్ణించుకోవడం కష్టమని దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డేవిడ్‌ మిల్లర్‌ అన్నాడు. అయితే బాధను తట్టుకుని నిలబడే శక్తి కలిగిన సఫారీ జట్టు భవిష్యత్తులోనూ సత్తాచాటుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తంజేశాడు. ‘‘ఫైనల్లో ఎదురైన ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. నా పరిస్థితిని మాటల్లో చెప్పలేను. అయితే ఈ జట్టులో సభ్యుడినైందుకు ఎంతో గర్వపడుతున్నా. ప్రపంచకప్‌లో మాది అద్భుత ప్రయాణం. నెల రోజుల్లో ఎత్తుపల్లాలతో సాగింది. తీవ్రమైన బాధను భరించాం. మళ్లీ సత్తాచాటే సామర్థ్యం ఈ జట్టుకు ఉంది’’ అని మిల్లర్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని