క్వార్టర్స్‌లో ఇంగ్లాండ్, స్పెయిన్‌

యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఇంగ్లాండ్, స్పెయిన్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. ఆఖరి నిమిషాల్లో గోల్స్‌తో ఇంగ్లాండ్‌ త్రుటిలో పరాజయం తప్పించుకుంది.

Published : 02 Jul 2024 03:38 IST

యూరో కప్‌

గెల్సెన్‌కిర్చన్‌ (జర్మనీ): యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలో ఇంగ్లాండ్, స్పెయిన్‌ క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. ఆఖరి నిమిషాల్లో గోల్స్‌తో ఇంగ్లాండ్‌ త్రుటిలో పరాజయం తప్పించుకుంది. సోమవారం రౌండ్‌-16 మ్యాచ్‌లో ఆ జట్టు 2-1 తేడాతో స్లొవేకియాపై గెలిచింది. బెల్లింగ్‌హమ్‌ (90+5వ నిమిషంలో), హ్యారీ కేన్‌ (91వ) ఇంగ్లాండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. స్లొవేకియా తరపున నమోదైన గోల్‌ను షురాంజ్‌ (25వ) చేశాడు. నిర్ణీత సమయంలో ఇంగ్లాండ్‌ 0-1తో వెనుకబడింది. కానీ స్టాపేజ్‌ సమయంలో బెల్లింగ్‌హమ్‌ తలతో చేసిన గోల్‌తో ఇంగ్లాండ్‌ ఆశలు నిలిచాయి. గోల్స్‌ సమం కావడంతో పోరు అదనపు సమయానికి వెళ్లింది. ఇందులో స్టార్‌ ఆటగాడు హ్యారీ కేన్‌ గోల్‌ చేసి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. మరో ప్రిక్వార్టర్స్‌ మ్యాచ్‌లో స్పెయిన్‌ 4-1తో జార్జియాను చిత్తుచేసింది. రోడ్రి (39వ), ఫాబియన్‌ (51వ), విలియమ్స్‌ (75వ), ఒల్మో (83వ) స్పెయిన్‌ తరపున తలో గోల్‌ చేశారు. 

ఈక్వెడార్‌ ముందంజ: కోపా అమెరికా టోర్నీలో ఈక్వెడార్‌ క్వార్టర్స్‌ చేరుకుంది. సోమవారం మెక్సికోతో మ్యాచ్‌ను ఆ జట్టు 0-0తో డ్రా చేసుకుంది. గ్రూప్‌- బిలో ఈక్వెడార్, మెక్సికో తలో 3 మ్యాచ్‌లాడి.. ఒక్కో గెలుపు, ఓటమి, డ్రా నమోదు చేశాయి. రెండు జట్లూ నాలుగు పాయింట్లతో నిలిచాయి. కానీ మెరుగైన గోల్స్‌ అంతరంలో మెక్సికో (0)ను ఈక్వెడార్‌ (1) వెనక్కినెట్టింది. గ్రూప్‌ నుంచి ఇప్పటికే క్వార్టర్స్‌కు అర్హత సాధించిన వెనెజులా 3-0తో జమైకాను చిత్తుచేసింది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని