‘లక్ష్య’ అథ్లెట్లకు గోపీచంద్‌ అభినందనలు

జాతీయ అంతర్‌ రాష్ట్ర సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించిన ‘ఈనాడు’ సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్లను బ్యాడ్మింటన్‌ జాతీయ ప్రధాన కోచ్‌ గోపీచంద్‌ అభినందించారు.

Updated : 02 Jul 2024 04:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ అంతర్‌ రాష్ట్ర సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో పతకాలు సాధించిన ‘ఈనాడు’ సీఎస్‌ఆర్‌ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్లను బ్యాడ్మింటన్‌ జాతీయ ప్రధాన కోచ్‌ గోపీచంద్‌ అభినందించారు. సోమవారం గోపీచంద్‌ అకాడమీలో ఈ అథ్లెట్లకు ‘లక్ష్య’ మెంటార్‌గా వ్యవహరిస్తున్న గోపీచంద్‌ అభినందనలు తెలిపారు. హరియాణాలో జరిగిన ఈ పోటీల్లో ‘లక్ష్య’ అథ్లెట్లు స్వాతి, శ్రీనివాస్, నందిని, శిరీష, రజిత, అనూష పతకాలు గెలిచారు. 


భారత్‌తో టీ20లకు జింబాబ్వే సారథి రజా

హరారె: భారత్‌తో టీ20 సిరీస్‌లో తలపడే జింబాబ్వే జట్టుకు సీనియర్‌ బ్యాటర్‌ సికందర్‌ రజా సారథ్యం వహించనున్నాడు. జింబాబ్వే ఆతిథ్యమిస్తున్న అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఈ నెల 6న ప్రారంభమవుతుంది. బెల్జియంలో జన్మించిన ఆంటుమ్‌ నఖ్వికి జట్టులో చోటు లభించింది. అయితే పౌరసత్వ స్థితి ధ్రువీకరణకు అనుగుణంగా అతనిపై తుది నిర్ణయం తీసుకుంటామని జింబాబ్వే క్రికెట్‌ సోమవారం ప్రకటించింది. బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో పాకిస్థానీ దంపతులకు నఖ్వి జన్మించాడు. అనంతరం ఆస్ట్రేలియాకు తరలివెళ్లాడు. జింబాబ్వే తరఫున అంతర్జాతీయ క్రికెట్‌ ఆడాలనుకుంటున్నట్లు ఆసక్తి చూపడంతో నఖ్విని సెలెక్షన్స్‌కు పరిగణలోకి తీసుకున్నారు.

జింబాబ్వే జట్టు: రజా (కెప్టెన్‌), అక్రమ్‌ ఫరాజ్, బెనెట్, క్యాంప్‌బెల్, చటారా, జాంగ్వీ, కైయా, మడాండీ, మద్వీర, మరుమని, మసకద్జా, మవుత బ్రాండన్, ముజరబాని, మైయర్స్, ఆంటుమ్‌ నఖ్వి, ఎంగరవ, షుంబా


మలేసియా చేతిలో భారత్‌ ఓటమి

దిల్లీ: ఆసియా జూనియర్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు చుక్కెదురైంది. సోమవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో భారత్‌ 2-3తో మలేసియా చేతిలో పరాజయం చవిచూసింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శంకర్‌ సారస్వత్‌- శ్రావణి వలేకర్‌ జోడీ 21-16, 13-21, 21-17తో కాంగ్‌ షింగ్‌- నరోకిలా మైసారా జంటపై నెగ్గింది. బాలికల సింగిల్స్‌లో తన్వి శర్మ 21-15, 15-21, 22-20తో సితి జులైఖాపై గెలిచి భారత్‌ ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. బాలుర సింగిల్స్‌లో ప్రణయ్‌ షెట్టిగార్‌ 21-15, 18-21, 19-21తో మహ్మద్‌ ఫైక్‌ చేతిలో ఓడాడు. బాలికల డబుల్స్‌లో శ్రావణి- నవ్య కందేరి జోడీ 16-21, 15-21తో ఆంగ్‌ షిన్‌- కార్మెన్‌ టింగ్‌ చేతిలో ఓడటంతో 2-2తో స్కోరు సమమైంది. నిర్ణయాత్మక బాలుర డబుల్స్‌లో భార్గవ రామ్‌ అరిగెల- అర్ష్‌ మహ్మద్‌ జంట 18-21, 10-21తో కాంగ్‌- ఆరోన్‌ జోడీ చేతిలో పరాజయం చవిచూడటంతో భారత్‌ ఆశలు ఆవిరయ్యాయి. బుధవారం వ్యక్తిగత ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.


కెనడా టైటిల్‌పై లక్ష్యసేన్‌ గురి 

కాల్గరీ (కెనడా): పారిస్‌ ఒలింపిక్స్‌కు ముందు భారత స్టార్‌ ఆటగాడు లక్ష్యసేన్‌.. కెనడా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టైటిల్‌పై గురిపెట్టాడు. మంగళవారం ప్రారంభంకానున్న టోర్నీలో లక్ష్యసేన్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలో దిగుతున్నాడు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌తో లక్ష్యసేన్‌ తలపడనున్నాడు. మిగతా మ్యాచ్‌ల్లో రస్‌ముస్‌ గెమ్కీ (డెన్మార్క్‌)తో ప్రియాన్షు రజావత్, యుషి తనక (జపాన్‌)తో కిరణ్‌ జార్జ్, కొకి వతనబె (జపాన్‌)తో ఆయుష్‌ శెట్టి పోటీపడనున్నారు. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో జూలీ జాకబ్సెన్‌ (డెన్మార్క్‌)తో మాళవిక బాన్సోద్, రాచెల్‌ డారా (ఐర్లాండ్‌)తో అనుపమ ఉపాధ్యాయా, క్వాలిఫయర్‌తో తాన్యా హేమంత్‌ అమీతుమీ తేల్చుకోనున్నారు. మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జోడీకి బై లభించింది. పురుషుల డబుల్స్‌లో కెర్న్‌ పాంగ్‌ (కెనడా)- లారీ పాంగ్‌ (ఇంగ్లాడ్‌)తో కృష్ణ ప్రసాద్‌- సాయి ప్రతీక్‌; మిక్స్‌డ్‌ డబుల్స్‌లో తరుణ్‌- శ్రీకృష్ణ ప్రియతో రోహన్‌ కపూర్‌- రుత్విక శివాని తమ పోరాటాన్ని ప్రారంభిస్తారు.


ప్రజ్ఞానంద గేమ్‌ డ్రా

బుకారెస్ట్‌: సూపర్‌బెట్‌ క్లాసిక్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద మరో డ్రా చేసుకున్నాడు. సోమవారం అయిదో రౌండ్లో వెస్లీ సో (అమెరికా)తో ప్రజ్ఞానంద పాయింట్‌ పంచుకున్నాడు. మరో భారత కుర్రాడు దొమ్మరాజు గుకేశ్‌ ఆడిన గేమ్‌లో కూడా ఫలితం తేలలేదు. అతడు నొదిర్‌బెక్‌ (ఉజ్బెకిస్థాన్‌)తో డ్రాకు అంగీకరించాడు. దీంతో 3 పాయింట్లతో గుకేశ్, ప్రజ్ఞానంద రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఫాబియానో కరువానా (3.5, అమెరికా) అగ్రస్థానంలో ఉన్నాడు. నాలుగో రౌండ్లో మాక్సిమ్‌ లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌)తో కరువానా డ్రా చేసుకున్నాడు.


ఆనంద్‌కు లియోన్‌ చెస్‌ టైటిల్‌

లియోన్‌ (స్పెయిన్‌): భారత దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్‌ ఆనంద్‌ లేటు వయసులోనూ టైటిళ్ల వేట సాగిస్తున్నాడు. తాజాగా అతడు లియోన్‌ మాస్టర్స్‌ చెస్‌ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఫైనల్లో విషీ 3-1తో జేమీ సాంటోస్‌ (స్పెయిన్‌)ను ఓడించాడు. అతడు 37 ఎత్తుల్లోనే ప్రత్యర్థి ఆట కట్టించాడు. 54 ఏళ్ల ఆనంద్‌కు ఇది పదో లియోన్‌ టైటిల్‌. 1996లో అతడు తొలిసారి ఇక్కడ ట్రోఫీ గెలిచాడు. నలుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్యే జరిగిన ఈ టోర్నీలో తెలంగాణ కుర్రాడు అర్జున్‌ ఇరిగేశి కూడా పోటీపడ్డాడు. సెమీస్‌లో 1.5-2.5తో శాంటోస్‌ చేతిలో అతడు ఓడాడు. అంతకుముందు తొలి సెమీస్‌లో ఆనంద్‌ 2.5-1.5తో వెస్లిన్‌ తొపలోవ్‌ (బల్గేరియా)పై నెగ్గాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని