జడేజా కూడా టాటా

భారత టీ20 జట్టు కొత్త రూపు సంతరించుకోబోతోంది. కోహ్లి, రోహిత్‌ బాటలో మరో సీనియర్‌ ఆటగాడు పొట్టి ఫార్మాట్‌కు టాటా చెప్పాడు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ఆదివారం ప్రకటించాడు.

Published : 01 Jul 2024 04:10 IST

బ్రిడ్జ్‌టౌన్‌: భారత టీ20 జట్టు కొత్త రూపు సంతరించుకోబోతోంది. కోహ్లి, రోహిత్‌ బాటలో మరో సీనియర్‌ ఆటగాడు పొట్టి ఫార్మాట్‌కు టాటా చెప్పాడు. స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ఆదివారం ప్రకటించాడు. వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతానని చెప్పాడు. ‘‘అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నా. దేశం కోసం అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి నిరంతరం ప్రయత్నించా. ఇతర ఫార్మాట్లలో ఇకముందూ దాన్ని కొనసాగిస్తా’’ అని 35 ఏళ్ల జడేజా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్‌ గెలవడంతో కల నిజమైంది. నా టీ20 కెరీర్‌కు ఇది అత్యుత్తమ దశ. ఎన్నో జ్ఞపకాలను, ఎంతో మద్దతును ఇచ్చినందుకు కృతజ్ఞతలు’’ అని జడేజా చెప్పాడు. అతడు 2009లో శ్రీలంకతో మ్యాచ్‌తో టీ20 క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ ఫార్మాట్లో భారత్‌ తరఫున 74 మ్యాచ్‌లు ఆడిన జడేజా.. 515 పరుగులు చేసి, 54 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ ప్రపంచకప్‌లో అతడు పెద్దగా రాణించలేకపోయాడు. బార్బడోస్‌లో శనివారం భారత్‌ ఉత్కంఠభరిత ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్‌ను చేజిక్కించుకోగా.. కాసేపటికే విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ ఈ ఫార్మాట్‌ రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని