సంక్షిప్తవార్తలు(6)

తన గురించి ఒక్క శాతం కూడా తెలియని వాళ్లు ఎంతో మాట్లాడారని భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. జీవితాన్ని సద్భావనతో సాగిస్తానని తెలిపాడు.

Published : 01 Jul 2024 04:10 IST

ఒక్క శాతం తెలియనోళ్లు కూడా..

బ్రిడ్జ్‌టౌన్‌: తన గురించి ఒక్క శాతం కూడా తెలియని వాళ్లు ఎంతో మాట్లాడారని భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. జీవితాన్ని సద్భావనతో సాగిస్తానని తెలిపాడు. ఐపీఎల్‌లో రోహిత్‌శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్‌ పగ్గాలు చేపట్టిన హార్దిక్‌.. జట్టు వైఫల్యం నేపథ్యంలో అభిమానుల నుంచే తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండ్‌ ఆటతో అదరగొట్టిన పాండ్య.. తన ప్రదర్శనతో విమర్శకుల నోళ్లు మూయించాడు. ‘‘సద్భావనను నమ్ముతా. వ్యక్తిగా నా గురించి ఒక్క శాతం కూడా తెలియని వాళ్లు చాలా మాట్లాడారు. ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. అయినా నాకెలాంటి ఇబ్బంది లేదు. జీవితంలో మాటలకు పరిస్థితులే సమాధానం చెబుతాయని ఎప్పుడూ నమ్ముతా. గెలిచినా.. ఓడినా సద్భావనతో ఉండటం ముఖ్యం. అభిమానులతో సహా ప్రతి ఒక్కరు దీన్ని నేర్చుకోవాలి. ప్రవర్తన మంచి మార్గంలో ఉండాలి. వాళ్లే సంతోషంగా ఉంటారు. చివరి ఓవర్‌ను చాలా ఆస్వాదించాం. జీవితాన్ని మార్చే ఇలాంటి అవకాశాలు కొందరికే లభిస్తాయి. ఫలితం మరోలా కూడా వచ్చి ఉండొచ్చు. నేను సానుకూల ధోరణిలో ఆలోచిస్తా’’ అని హార్దిక్‌ వివరించాడు.


రిటైర్‌ అవుతా అనుకోలేదు కానీ..

బ్రిడ్జ్‌టౌన్‌: టీ20ల నుంచి ఇప్పుడే రిటైర్‌ అవుతానని అనుకోలేదని.. కానీ అలాంటి సమయం వచ్చిందని భారత క్రికెట్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ అన్నాడు. ‘‘ఇప్పుడే టీ20కు వీడ్కోలు చెబుతానని భావించలేదు. కానీ పరిస్థితి అలా వచ్చింది. ఈ ఫార్మాట్‌ వదిలేయడానికి సరైన సమయమిదని అనిపించింది. కప్‌ గెలిచి రిటైర్‌ కావడాన్ని మించింది ఏముంటుంది? సుదీర్ఘ కాలంగా నేను చేసిన పరుగులు, సాధించిన రికార్డులు ఎన్ని ఉన్నా.. వాటన్నిటికంటే ఇలాంటి విజయం సంతోషాన్ని ఇస్తుంది. ఇదో గొప్ప ఘనత’’ అని రోహిత్‌ పేర్కొన్నాడు. వన్డే ప్రపంచకప్, ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీలు చేజారడంపై స్పందిస్తూ.. ‘‘మనకు ఏం రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని నమ్ముతా. ఈసారి టీ20 కప్‌ భారత్‌ గెలవాలని రాసుందని అనుకుంటా. ఫైనల్‌కు ముందు మనకేం తెలియదు. అలా జరిగిందంతే. కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఈ టోర్నీ గెలిచేందుకు పూర్తిగా అర్హుడు. గత 25 ఏళ్లుగా అతడు భారత క్రికెట్‌కు అమూల్యమైన సేవలు అందించాడు. ప్రపంచకప్‌ మాత్రమే రాహుల్‌ ఖాతాలో లేదు. కోచ్‌గా ఆ కలను నెరవేర్చుకున్నాడు.’’ అని రోహిత్‌ తెలిపాడు. కోహ్లి ఛాంపియన్‌ ప్లేయర్‌ అని.. తనకు ఇదే చివరి టోర్నీ అని కప్‌ ఆరంభానికి ముందే అతడు చెప్పాడని రోహిత్‌ పేర్కొన్నాడు. 


ఆ క్యాచ్‌కు పతకం 

బ్రిడ్జ్‌టౌన్‌: బౌండరీ గీత దగ్గర సంచలన క్యాచ్‌తో భారత్‌ టీ20 ప్రపంచకప్‌ దక్కించుకోవడంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్‌ ఉత్తమ ఫీల్డింగ్‌కు గాను పతకం అందుకున్నాడు. ఆటగాళ్లలో స్ఫూర్తి నింపడానికి ఉత్తమ ఫీల్డర్లకు పతకాన్ని అందించే సంప్రదాయాన్ని టీమ్‌ఇండియా ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో మొదలైన ఈ ఉత్తమ ఫీల్డర్‌ అవార్డును ఈ పొట్టి కప్‌లోనూ కొనసాగించారు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో చివరి ఓవర్‌ తొలి బంతికి మిల్లర్‌ క్యాచ్‌ను సూర్య అద్భుతంగా అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో మ్యాచ్‌ ముగిశాక డ్రెస్సింగ్‌ గదిలో బీసీసీఐ కార్యదర్శి చేతుల మీదుగా ఉత్తమ ఫీల్డర్‌ పతకాన్ని సూర్య అందుకున్నాడు. ఈ సందర్భంగా దిలీప్‌ మాట్లాడుతూ.. ‘‘పెద్ద మ్యాచ్‌ల్లో మనం మెరుగవుతూనే ఉన్నాం. కానీ ఈ సారి ఆధిపత్యం ప్రదర్శించాం. టోర్నీ సాంతం మనం చూపించిన తీవ్రత, స్నేహం, నిలకడ అద్భుతం. తోడేళ్ల గుంపులాగా ఫీల్డింగ్‌ చేశాం’’ అని పేర్కొన్నాడు. 


దేశం గర్వపడేలా..

తిరుమల, న్యూస్‌టుడే: దేశం గర్వించేలా భారత క్రికెట్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌ను గెలిచిందని భారత మాజీ క్రికెటర్, మాజీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడాడు. కెప్టెన్‌ రోహిత్‌శర్మ, కోహ్లీ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు అభినందనలు తెలిపాడు. రోహిత్‌శర్మ, కోహ్లి.. టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించినా.. మిగతా రెండు ఫార్మాట్లలో ఆడతారని గంభీర్‌ చెప్పాడు. గంభీర్‌ త్వరలోనే టీమ్‌ఇండియా కోచ్‌ కానున్నట్లు వార్తలొస్తున్న సంగతి తెలిసిందే.


ప్రజ్ఞానంద విజయం 

బుకారెస్ట్‌: సూపర్‌బెట్‌ క్లాసిక్‌ చెస్‌ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద బోణీ కొట్టాడు. ఆదివారం నాలుగో రౌండ్లో అనీష్‌ గిరి (నెదర్లాండ్స్‌)పై అతడు విజయం సాధించాడు. సుదీర్ఘంగా సాగిన ఈ గేమ్‌ డ్రాగా సాగుతున్నట్లు కనిపించినా.. కీలక సమయంలో పైచేయి సాధించిన భారత స్టార్‌.. 80 ఎత్తుల్లో విజయాన్ని అందుకున్నాడు. మరో గేమ్‌లో అలీరెజా (ఫ్రాన్స్‌)తో దొమ్మరాజు గుకేశ్‌ డ్రా చేసుకున్నాడు. దీంతో గుకేశ్‌ (2 పాయింట్లు).. ఫాబియానో కరువానా (అమెరికా)తో ఉమ్మడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మాక్సిమ్‌ లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌), అనీష్, నిపోమ్నిషి (రష్యా), వెస్లీసో (అమెరికా)తో కలిసి ప్రజ్ఞానంద 1.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.


ప్రపంచకప్‌ ఫైనల్‌కు భారీ వీక్షణలు 

దిల్లీ: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను పెద్ద సంఖ్యలో అభిమానులు వీక్షించారు. ఓటీటీ వేదికపై 5.3 కోట్ల వీక్షణలు నమోదయ్యాయి. అయితే నిరుడు నవంబరులో భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే ప్రపంచకప్‌ రికార్డును దాటలేకపోయింది. అప్పుడు 5.9 కోట్ల మంది వీక్షకుల సంఖ్య నమోదైంది. క్రికెట్లో ఏ మ్యాచ్‌కైనా ఇదే అత్యధిక వీక్షణల రికార్డు. పొట్టి కప్పులో భారత్, ఆసీస్‌ మధ్య సెమీస్‌ పోరును 3.9 కోట్ల మంది వీక్షించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని