భారత్‌ 603/6 డిక్లేర్డ్‌

మహిళల టెస్టు క్రికెట్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్‌ ప్రపంచ రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు రెండో రోజు 603/6 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

Updated : 30 Jun 2024 06:18 IST

మహిళ టెస్టు క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు
దక్షిణాఫ్రికా 236/4

చెన్నై: మహిళల టెస్టు క్రికెట్లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా భారత్‌ ప్రపంచ రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాతో ఏకైక టెస్టు రెండో రోజు 603/6 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 525/4తో శనివారం ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌.. మరో 78 పరుగులు జోడించింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ (ఓవర్‌నైట్‌ 42)తో కలిసి ఇన్నింగ్స్‌ నడిపించిన రిచా ఘోష్‌ (ఓవర్‌నైట్‌ 43) ధాటిగా బ్యాటింగ్‌ చేసింది. జట్టు స్కోరు 593 వద్ద హర్మన్‌ప్రీత్‌ (69) ఔట్‌ కాగా కాసేపటికే రిచా (86) నిష్క్రమించింది. ఆ వెంటనే ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశారు. ఆస్ట్రేలియా పేరిట ఉన్న అత్యధిక స్కోరు రికార్డు (575)ను భారత్‌ బద్దలు కొట్టింది. ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. కాప్‌ (69 బ్యాటింగ్‌), లజ్‌ (65) రాణించారు. కాప్‌తో పాటు డిక్లెర్క్‌ (27) క్రీజులో ఉంది.


సెమీస్‌లో మాల్విక 

ఫోర్ట్‌వర్త్‌: యుఎస్‌ ఓపెన్‌ సూపర్‌-300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్లో భారత అమ్మాయి మాల్విక బన్సోద్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో ఆమె 10-21, 21-15, 21-10తో ప్రపంచ 49వ ర్యాంకర్‌ క్రిస్టీ గిల్మోర్‌ (స్కాట్లాండ్‌)కు షాకిచ్చింది. సెమీస్‌లో నత్సుకి నిడైరా (జపాన్‌)తో మాల్విక తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో ప్రియాన్షు రజవత్‌ పోరాటం ముగిసింది. క్వార్టర్స్‌లో అతడు 21-15, 11-21, 18-21తో లీలాన్‌ (చైనా) చేతిలో ఓడాడు. మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి-ట్రీసా జంట కూడా ఓడిపోయింది. క్వార్టర్స్‌లో గాయత్రి ద్వయం 17-21, 21-17, 19-21తో రుయ్‌ హిరోకమి-యునా కటో (జపాన్‌) జంటకు తలొంచింది. 


ఫైనల్లో ‘లక్ష్య’ శ్రీనివాస్‌

పంచకుల: జాతీయ అంతర్‌ రాష్ట్ర సీనియర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ‘ఈనాడు’ సీఎస్‌ఆర్‌ ‘లక్ష్య’ అథ్లెట్‌ నల్లబోతు శ్రీనివాస్‌ సత్తాచాటాడు. పురుషుల 200మీ. పరుగులో అతను ఫైనల్‌ చేరాడు. శనివారం సెమీస్‌లో 20.93 సెకన్ల టైమింగ్‌తో రేసు పూర్తి చేసిన ఈ ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ అగ్రస్థానంలో నిలిచాడు. 


ఫిలిప్ఫీన్స్‌పై భారత్‌ గెలుపు 

యోగ్యకర్త: ఆసియా జూనియర్‌ మిక్స్‌డ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌ క్వార్టర్‌ఫైనల్‌ బెర్తును ఖరారు చేసుకుంది. గ్రూప్‌-సి ఆఖరి మ్యాచ్‌లో 3-2తో ఫిలిప్ఫీన్స్‌ను ఓడించింది. తన్విశర్మ సింగిల్స్‌లో నెగ్గగా.. డబుల్స్‌లో వెన్నెల-శ్రావణి, అర్ష్‌-శంకర్‌ జోడీలు గెలిచాయి. ఆదివారం క్వార్టర్స్‌లో ఇండోనేషియాతో భారత్‌ తలపడనుంది. పురుషుల టీమ్‌ విభాగంలో భారత్‌ శుభారంభం చేసింది. తొలి రౌండ్లో 5-0తో వియత్నాంను ఓడించింది. 


గుకేశ్‌తో ప్రజ్ఞానంద డ్రా 

బుకారెస్ట్‌: సూపర్‌బెట్‌ క్లాసిక్‌ చెస్‌ టోర్నమెంట్లో మూడో రౌండ్లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు. శనివారం సహచర గ్రాండ్‌మాస్టర్‌ దొమ్మరాజు గుకేశ్‌తో ప్రజ్ఞానంద పాయింట్‌ పంచుకున్నాడు. దీంతో గుకేశ్‌ (2 పాయింట్లు).. ఫాబియానో కరువాన (అమెరికా)తో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. లాగ్రెవ్‌ (ఫ్రాన్స్‌), అలీరెజా (ఫ్రాన్స్‌), వెస్లీ సో (అమెరికా), నిపోమ్నియాషి (రష్యా)తో ప్రజ్ఞానంద (1.5) ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని