పోర్చుగల్‌కు షాక్‌.. నాకౌట్‌కు జార్జియా

యూరో కప్‌లో సంచలనం. గురువారం గ్రూప్‌- ఎఫ్‌ మ్యాచ్‌లో అగ్రశ్రేణి జట్టు పోర్చుగల్‌కు షాకిచ్చిన జార్జియా నాకౌట్‌కు అర్హత సాధించింది. 2-0 తేడాతో రొనాల్డో జట్టుపై జార్జియా నెగ్గింది. ఇప్పటికే పోర్చుగల్‌ రౌండ్‌ 16కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే.

Published : 28 Jun 2024 03:39 IST

యూరో కప్‌

గెల్సెంకిర్చన్‌ (జర్మనీ): యూరో కప్‌లో సంచలనం. గురువారం గ్రూప్‌- ఎఫ్‌ మ్యాచ్‌లో అగ్రశ్రేణి జట్టు పోర్చుగల్‌కు షాకిచ్చిన జార్జియా నాకౌట్‌కు అర్హత సాధించింది. 2-0 తేడాతో రొనాల్డో జట్టుపై జార్జియా నెగ్గింది. ఇప్పటికే పోర్చుగల్‌ రౌండ్‌ 16కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే నాకౌట్‌కు వెళ్లే అవకాశాలు ఉండటంతో ఈ టోర్నీలో తొలిసారి ఆడుతున్న జార్జియా అత్యుత్తమ ప్రదర్శనతో సత్తాచాటింది. విచా కవారత్‌హెలియా (2వ నిమిషంలో), మికాతాడ్జె (57వ) చెరో గోల్‌ కొట్టారు. రొనాల్డో అభిమాని అయిన కవారత్‌హెలియాకు మ్యాచ్‌కు ముందు అతనితో మాట్లాడే అవకాశం దక్కింది. అలాగే రొనాల్డో జెర్సీ కూడా సొంతం చేసుకున్నాడు. మ్యాచ్‌లో గోల్‌తోనూ అతను అదరగొట్టాడు. పెనాల్టీ ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ నీళ్ల సీసాను తన్నడంతో రొనాల్డోకు రిఫరీ పసుపు కార్డు చూపించాడు. మరో మ్యాచ్‌లో తుర్కియే 2-1తో చెక్‌ రిపబ్లిక్‌పై గెలిచి ఈ గ్రూప్‌ నుంచి ముందంజ వేసింది. గ్రూప్‌-ఈలో 1-1తో డ్రా చేసుకున్న రొమేనియా, స్లోవేకియా కూడా నాకౌట్‌ చేరాయి. ఉక్రెయిన్‌తో మ్యాచ్‌ను 0-0తో డ్రాగా ముగించిన బెల్జియం కూడా గ్రూప్‌ దశ దాటింది. 

క్వార్టర్స్‌లో వెనిజువెలా: కోపా అమెరికా ఫుట్‌బాల్‌ టోర్నీలో వెనిజువెలా క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. గ్రూప్‌- బి మ్యాచ్‌లో ఆ జట్టు 1-0 తేడాతో మెక్సికోపై నెగ్గింది. పెనాల్టీని గోల్‌గా మలిచిన రాండాన్‌ (57వ) జట్టును గెలిపించాడు. ఇదే గ్రూప్‌లో మరో మ్యాచ్‌లో ఈక్వెడార్‌ 3-1తో జమైకాపై నెగ్గి రేసులో నిలిచింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని