జాతీయ అథ్లెటిక్స్‌ నేటి నుంచే

జాతీయ అంతర్‌ రాష్ట్ర అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. గురువారం ఆరంభమయ్యే ఈ పోటీల్లో భారత అగ్రశ్రేణి అథ్లెట్లు బరిలో దిగుతున్నారు.

Published : 27 Jun 2024 01:51 IST

పంచకుల (హరియాణా): జాతీయ అంతర్‌ రాష్ట్ర అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌కు రంగం సిద్ధమైంది. గురువారం ఆరంభమయ్యే ఈ పోటీల్లో భారత అగ్రశ్రేణి అథ్లెట్లు బరిలో దిగుతున్నారు. ఒలింపిక్స్‌ జావెలిన్‌ త్రో ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా గైర్హాజరీలో జరుగుతున్న పోటీల్లో పారిస్‌ బెర్తుల కోసం అగ్రశ్రేణి క్రీడాకారులు పోటీపడనున్నారు. జ్యోతి యర్రాజి (మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌), అన్ను రాణి (మహిళల జావెలిన్‌ త్రో), డి.పి.మను (పురుషుల జావెలిన్‌ త్రో), తజిందర్‌ సింగ్‌ తూర్‌ (పురుషుల షాట్‌పుట్‌), జెస్విన్‌ ఆల్డ్రిన్‌ (పురుషుల లాంగ్‌జంప్‌) ఒలింపిక్స్‌ బెర్తులపై గురిపెట్టారు. 


మాజీ క్రికెటర్‌ విజయ్‌ నాయుడు మృతి

ఇందౌర్‌: భారత తొలి టెస్టు కెప్టెన్‌ సీకే నాయుడు మనవడు విజయ్‌ నాయుడు (79) బుధవారం మరణించారు. దీర్ఘకాలంగా అనారోగ్యం బాధపడుతున్న ఆయన తుది శ్వాస విడిచినట్లు మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘం (ఎంపీసీఏ) వెల్లడించింది. 1968-69 నుంచి 1970-71 వరకు వరుసగా మూడు సీజన్ల పాటు రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌కు విజయ్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఆయన 47 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు, 3 లిస్ట్‌- ఎ మ్యాచ్‌లు ఆడారు. ఆయన ఎంపీసీఏకు ఉపాధ్యక్షుడిగా, క్రికెట్‌ అభివృద్ధి కమిటీకి ఛైర్మన్‌గా పనిచేశారు. 


పారిస్‌లో ఇండియా హౌస్‌ 

ముంబయి: ఒలింపిక్స్‌లో మొట్టమొదటి సారి భారత్‌ పాల్గొని వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఇండియా హౌస్‌’ అందుబాటులోకి రానుంది. పారిస్‌ ఒలింపిక్స్‌ నేపథ్యంలో మొదటి ‘ఇండియా హౌస్‌’ను పారిస్‌లోని పార్క్‌ ది లా విలెట్టెలో ఏర్పాటు చేస్తున్నారు. ఒలింపిక్స్‌కు వెళ్లే భారత్‌ అథ్లెట్ల బృందానికి ఇది మరో సొంతిల్లులా ఉండటంతో పాటు మన దేశ ఘన క్రీడా వారసత్వాన్ని చాటనుంది. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ)తో కలిసి రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఈ ఇండియా హౌస్‌కు రూపం పోసింది. ఇది భారత భూత, వర్తమాన, భవిష్యత్‌ సంబంధిత విషయాలను.. సాంకేతికత, డిజిటలైజేషన్‌ అంశాలను చాటుతుంది. ఒలింపిక్‌ ఉద్యమం, క్రీడా దేశంగా భారత్‌ ఎదుగుదల తదితర విషయాలను ప్రపంచానికి తెలియజేస్తుంది. క్రీడా దిగ్గజాలతో మాట్లాడేందుకు వేదికగానూ నిలుస్తుంది. ‘‘40 ఏళ్లలో తొలిసారిగా గతేడాది భారత్‌లో అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) సదస్సు జరిగింది. మన ఒలింపిక్‌ ప్రయాణంలో అదో కీలక మైలురాయి. ఇప్పుడు ఇండియా హౌస్‌ మరో అడుగు. మన అథ్లెట్లను గౌరవించుకోవడానికి, మన విజయాలకు సంబరాలు చేసుకోవడానికి, మన కథలను పంచుకోవడానికి ఇదో వేదిక’’ అని ఐఓసీ సభ్యురాలు నీతా అంబాని పేర్కొంది. 


ఒక్క ఓవర్లో 43 పరుగులు

బ్రైటన్‌ (ఇంగ్లాండ్‌): ఇంగ్లాండ్‌ పేసర్‌  ఓలీ రాబిన్సన్‌ బౌలింగ్‌లో చెత్త రికార్డు నమోదు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో ఒక ఓవర్లో రెండో అత్యధిక పరుగులిచ్చిన బౌలర్‌గా నిలిచాడు. బుధవారం లీసెస్టర్‌షైర్‌తో కౌంటీ ఛాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లో ససెక్స్‌ తరఫున రాబిన్సన్‌ ఒక ఓవర్లో ఏకంగా 43 పరుగులు సమర్పించుకున్నాడు. ఈ ఓవర్లో రాబిన్సన్‌ 3 నోబాల్స్‌ కూడా వేయడంతో భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. లీసెస్టర్‌షైర్‌ బ్యాటర్‌ లూయిస్‌ కింబర్‌ ఊచకోత కోశాడు. 56 బంతుల్లో 72 పరుగులతో ఆడుతున్న కింబర్‌ ఈ ఓవర్లోనే సెంచరీ (115 నాటౌట్‌; 65 బంతుల్లో) చేరుకున్నాడు. 1989-90లో వెల్లింగ్టన్, కాంటర్‌బరీ జట్ల మధ్య షెల్లీ ట్రోఫీ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ వెర్ట్‌ వాన్స్‌ 77 పరుగులివ్వడం ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌ చరిత్రలో అత్యంత ఖరీదైన ఓవర్‌గా ఉంది. ఈ ఓవర్లో 17 నోబాల్స్‌ వేసిన వాన్స్‌.. కివీస్‌ తరఫున 4 టెస్టులు, 8 వన్డేలు ఆడాడు.


ఒలింపిక్స్‌కు అయిదుగురు షాట్‌గన్‌ షూటర్లు 

దిల్లీ: పారిస్‌ ఒలింపిక్స్‌లో పాల్గొనే అయిదుగురు షాట్‌గన్‌ షూటర్లను ఎన్‌ఆర్‌ఏఐ బుధవారం ప్రకటించింది. సీనియర్‌ ట్రాప్‌ షూటర్‌ పృథ్వీరాజ్‌ తొండమాన్‌ జట్టులో చోటు సంపాదించాడు. మహిళల ట్రాప్‌ విభాగంలో రాజేశ్వరి కుమారి బరిలో దిగనుంది. స్కీట్‌లో అనంత్‌ జీత్‌ సింగ్‌ నరుక పాల్గొంటాడు. మహిళల స్కీట్‌లో రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్‌ తమ అదృష్టం పరీక్షించుకోనున్నారు. మహేశ్వరి, అనంత్‌జీత్‌లు స్కీట్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగంలోనూ బరిలో దిగనున్నారు. ఒలింపిక్‌ కోటా ద్వారా షాట్‌గన్‌లో అయిదు బెర్తులు భారత్‌కు లభించాయి. ఈ అయిదుగురు షూటర్లకు ఇవే తొలి ఒలింపిక్స్‌.


రెండో స్థానానికి సూర్య

దుబాయ్‌: టీ20 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ నంబర్‌వన్‌ స్థానాన్ని కోల్పోయాడు. బుధవారం ఐసీసీ ప్రకటించిన జాబితాలో సూర్య రెండో ర్యాంకు సాధించాడు. ఆస్ట్రేలియా ఓపెనర్‌ ట్రావిస్‌ హెడ్‌ నాలుగు స్థానాలు మెరుగై నంబర్‌వన్‌ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. యశస్వి జైశ్వాల్‌ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్‌ 8, కుల్దీప్‌ యాదవ్‌ 11వ ర్యాంకులు సాధించారు. ఆల్‌రౌండర్లలో నాలుగు స్థానాలు మెరుగైన హార్దిక్‌ పాండ్య మూడో ర్యాంకు సొంతం చేసుకున్నాడు.


ఆసియా క్రీడల్లో యోగాను చేర్చాలి: ఉష 

దిల్లీ: ఆసియా క్రీడల్లో యోగాను చేర్చాలంటూ భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పి.టి.ఉష పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆసియా ఒలింపిక్‌ కౌన్సిల్‌ (ఓసీఏ) అధ్యక్షుడు రాజా రణ్‌ధీర్‌ సింగ్‌కు బుధవారం ఆమె లేఖ రాసింది. ‘‘ప్రపంచమంతా జూన్‌ 21న పదో అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. చాలా దేశాల్లో ప్రజలు యోగాను ఆదరించారు. ప్రయోజనాలు పొందారు. యోగా ఆధ్యాత్మిక నిలయం, విశ్వ గురువైన భారత్‌.. ఆసియా క్రీడలతో పాటు ఒలింపిక్స్‌లో ఈ ఆటను చేర్చేందుకు ప్రచారం చేస్తుందని నమ్ముతున్నా’’ అని లేఖలో ఉష పేర్కొంది. 


ఇంగ్లాండ్‌ 0.. స్లొవేనియా 0 

కొలోన్‌ (జర్మనీ): యూరో 2024 గ్రూప్‌-సిలో స్లొవేనియాతో మ్యాచ్‌ను ఇంగ్లాండ్‌ 0-0తో డ్రాగా ముగించింది. స్లొవేనియా కన్నా ఎంతో బలమైన తమ జట్టు మ్యాచ్‌లో పేలవంగా ఆడడంపై ఇంగ్లాండ్‌ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మ్యాచ్‌ ముగియగానే మైదానంలోకి బీర్‌ కప్పులు విసిరేశారు. అయితే మ్యాచ్‌ను డ్రాగా ముగించినా గ్రూప్‌లో ఇంగ్లాండ్‌ అగ్రస్థానం సాధించింది. ఆ జట్టు మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటి మాత్రమే (సెర్బియా)పై గెలిచింది. మొత్తంగా రెండు గోల్సే కొట్టింది. ఇక ఆడిన మూడు మ్యాచ్‌లనూ డ్రాగా ముగించిన స్లొవేనియా.. టోర్నీలో మూడో స్థానంలో నిలిచిన అత్యుత్తమ జట్లలో ఒకటిగా నాకౌట్స్‌కు అర్హత సాధించింది. ఇంగ్లాండ్, డెన్మార్క్‌లు గ్రూప్‌-సిలో తొలి రెండు స్థానాలతో ముందంజ వేశాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని