T20 World Cup: రేపు సెమీఫైనల్స్‌

టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 అంకం ముగిసింది. ఎక్కువ విరామం లేకుండానే సెమీఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. గురువారం ఒక్క రోజులోనే రెండు సెమీస్‌ మ్యాచ్‌లు పూర్తి కానున్నాయి.

Updated : 26 Jun 2024 06:02 IST

టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 అంకం ముగిసింది. ఎక్కువ విరామం లేకుండానే సెమీఫైనల్స్‌కు రంగం సిద్ధమైంది. గురువారం ఒక్క రోజులోనే రెండు సెమీస్‌ మ్యాచ్‌లు పూర్తి కానున్నాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు మొదలయ్యే రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను భారత్‌ ఢీకొనబోతుండగా,    ఉదయం 6 గంటల నుంచి తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌ ఢీకొనబోతున్నాయి. సంచలన ప్రదర్శనతో సెమీస్‌ చేరిన అఫ్గాన్‌.. ఈసారి స్థాయికి తగ్గ ఆటతీరుతో ముందంజ వేసిన సఫారీ జట్టును ఎలా ఎదుర్కొంటుంది, ఈ మ్యాచ్‌లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తికరం. బలాబలాల్లో దక్షిణాఫ్రికాదే పైచేయి అయినా.. ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్గాన్‌ను ఎంతమాత్రం తక్కువ అంచనా వేయలేం. ఈ పోరు హోరాహోరీగానే సాగుతుందని అంచనా. రెండు జట్లలో ఏది గెలిచినా తొలిసారి ఫైనల్‌ చేరుతుంది.

9

టీ20ల్లో రషీద్‌ ఖాన్‌ నాలుగు వికెట్లు పడగొట్టిన సందర్భాలు. ఈ ఫార్మాట్లో అత్యధిక సార్లు నాలుగు వికెట్ల ఘనత సాధించిన బౌలర్‌ అతడే.

442

ఈ టీ20 ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ బ్యాటర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్‌ల భాగస్వామ్యం. ఒక టీ20 ప్రపంచకప్‌లో ఓ జోడీ భాగస్వామ్యంలో సాధించిన అత్యధిక పరుగులివే.


డక్‌వర్త్‌ కన్నుమూత 

దిల్లీ: ఇంగ్లాండ్‌ గణాంక నిపుణుడు, డక్‌వర్త్‌- లూయిస్‌ స్టెర్న్‌ (డీఎల్‌ఎస్‌) పద్ధతి ఆవిష్కర్తల్లో ఒకరైన ఫ్రాంక్‌ డక్‌వర్త్‌ (84) కన్నుమూశారు. ఈనెల 21న డక్‌వర్త్‌ మరణించారు. వర్ష ప్రభావిత మ్యాచ్‌లలో ఫలితాలు నిర్ణయించడానికి డక్‌వర్త్, టోనీ లూయిస్‌ కలిసి డీఎల్‌ఎస్‌ పద్ధతిని రూపొందించారు. 1997లో తొలిసారిగా ఈ పద్ధతిని ఉపయోగించారు. అనంతరం లక్ష్యాల్ని నిర్దేశించడానికి 2001లో ఈ పద్ధతిని ఐసీసీ ప్రామాణికంగా తీసుకుంది. ఆస్ట్రేలియా గణాంక నిపుణుడు స్టీవెన్‌ స్టెర్న్‌ కొన్ని సవరణలు చేసిన అనంతరం ఈ పద్ధతికి డీఎల్‌ఎస్‌గా నామకరణం చేశారు.


శ్రీజ @ 24

దిల్లీ: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ ర్యాంకింగ్స్‌లో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ కెరీర్‌ ఉత్తమ స్థానం సాధించింది. సోమవారం ప్రకటించిన జాబితాలో మహిళల సింగిల్స్‌లో శ్రీజ 24వ ర్యాంకు సొంతం చేసుకుంది. ఆదివారం లాగోస్‌లో ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ కంటెండర్‌ టోర్నీలో సింగిల్స్‌లో విజేతగా నిలిచిన శ్రీజ ర్యాంకింగ్‌లో 19 స్థానాలు మెరుగుపరుచుకుంది. మనిక బాత్రా 29వ ర్యాంకులో నిలిచింది. లాగోస్‌లో సింగిల్స్‌తో పాటు డబుల్స్‌ గెలుచుకున్న శ్రీజ.. ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.


జులై 19న భారత్, పాక్‌ పోరు 

దిల్లీ: మహిళల టీ20 ఆసియా కప్‌ ఆరంభ పోరులో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ భారత్, పాకిస్థాన్‌ అమీతుమీ తేల్చుకోనున్నాయి. జులై 19న శ్రీలంకలోని దంబుల్లాలో ఈ మ్యాచ్‌ జరుగుతుంది. జలై 28 వరకు జరిగే ఈ టోర్నీలో 8 జట్లు బరిలో దిగనున్నాయి. గ్రూపు-ఎలో భారత్, పాక్, యూఏఈ, నేపాల్‌.. గ్రూపు-బిలో శ్రీలంక, బంగ్లాదేశ్, థాయ్‌లాండ్, మలేసియా ఉన్నాయి. ప్రతి గ్రూపు నుంచి రెండేసి జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. పాక్‌తో మ్యాచ్‌ తర్వాత జులై 21న యూఏఈ, 23న నేపాల్‌తో భారత్‌ తలపడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని