Tilak Varma: మెరిసిన తిలక్‌వర్మ

తిలక్‌వర్మ (58 నాటౌట్‌; 43 బంతుల్లో 3×4, 3×6) సత్తా చాటడంతో సయ్యద్‌ ముస్తాక్‌అలీ ట్రోఫీలో హైదరాబాద్‌ వరుసగా రెండో విజయం సాధించింది.

Updated : 18 Oct 2023 09:28 IST

హైదరాబాద్‌కు రెండో విజయం

జైపుర్‌: తిలక్‌వర్మ (58 నాటౌట్‌; 43 బంతుల్లో 3×4, 3×6) సత్తా చాటడంతో సయ్యద్‌ ముస్తాక్‌అలీ ట్రోఫీలో హైదరాబాద్‌ వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం గ్రూప్‌-ఏ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 8 వికెట్ల తేడాతో జమ్ముకశ్మీర్‌ను చిత్తు చేసింది. మొదట జమ్ముకశ్మీర్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులు చేసింది. శుభమ్‌ (58) టాప్‌ స్కోరర్‌. రవితేజ, మిలింద్‌, రక్షణ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు. తిలక్‌వర్మ రాణించడంతో లక్ష్యాన్ని హైదరాబాద్‌ 18.3 ఓవర్లలో 2 వికెట్లే కోల్పోయి అందుకుంది. రోహిత్‌ రాయుడు (38), రాహుల్‌ సింగ్‌ (35 నాటౌట్‌), తన్మయ్‌ (20) కూడా సత్తా చాటారు. మరోవైపు గ్రూప్‌-సిలో ఆంధ్ర ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. రాంచిలో పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆంధ్ర 105 పరుగుల తేడాతో చిత్తయింది. అభిషేక్‌శర్మ (112; 51 బంతుల్లో 9×4, 9×6) మెరుపు సెంచరీకి అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (87; 26 బంతుల్లో 6×4, 9×6) విధ్వంసక ఇన్నింగ్స్‌ తోడవడంతో మొదట పంజాబ్‌ 275 (6 వికెట్లకు) భారీ స్కోరు చేసింది. ఈ టోర్నీ చరిత్రలో ఒక జట్టు చేసిన అత్యధిక స్కోరు ఇదే. ఛేదనలో రికీభుయ్‌ (104 నాటౌట్‌; 52 బంతుల్లో 6×4, 9×6) శతకంతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయాడు. ఆంధ్ర 170/7కే పరిమితమైంది. రాంచిలోనే జరిగిన మరో గ్రూప్‌-సి మ్యాచ్‌లో రైల్వేస్‌ 127 పరుగుల తేడాతో అరుణాచల్‌ప్రదేశ్‌ను ఓడించింది. మొదట రైల్వేస్‌ 5 వికెట్లకు 246 పరుగులు చేసింది. ఉపేంద్ర యాదవ్‌ (103 నాటౌట్‌; 51 బంతుల్లో 6×4, 9×6) మెరుపు సెంచరీ బాదేశాడు. అశుతోష్‌ శర్మ (53; 12 బంతుల్లో 1×4, 8×6) కూడా మెరిశాడు. ఈ క్రమంలో 11 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయి చేరిన అశుతోష్‌.. యువరాజ్‌సింగ్‌ను దాటి భారత్‌ తరఫున ఈ ఫార్మాట్లో వేగవంతమైన అర్ధశతకాన్ని సాధించాడు. ఛేదనలో అరుణాచల్‌ప్రదేశ్‌ 18.1 ఓవర్లలో 119కే కుప్పకూలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని