Cricket in Olympic Games: కొత్త శిఖరాలకు క్రికెట్‌

ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన  క్రీడల్లో ఫుట్‌బాల్‌ తర్వాత రెండో స్థానం క్రికెట్‌ది. ప్రధానంగా పది జట్లు. నాలుగేళ్లకోసారి వన్డే ప్రపంచకప్‌. రెండేళ్లకోసారి టీ20 ప్రపంచకప్‌.

Updated : 17 Oct 2023 09:29 IST

ఒలింపిక్స్‌లో చోటు

ముంబయి: ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన  క్రీడల్లో ఫుట్‌బాల్‌ తర్వాత రెండో స్థానం క్రికెట్‌ది. ప్రధానంగా పది జట్లు. నాలుగేళ్లకోసారి వన్డే ప్రపంచకప్‌. రెండేళ్లకోసారి టీ20 ప్రపంచకప్‌. మధ్యలో ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌. ఆసియా, ఆస్ట్రేలియా, యూకే, కరీబియన్‌ దీవుల్లో ఈ ఆటకు తిరుగులేదు. ఇప్పుడు ఆఫ్రికా, అమెరికా, ఐరోపాల్లోనూ విస్తరిస్తోంది. అయినా ఏదో వెలితి. ప్రపంచ ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో క్రికెట్‌ లేదనే లోటు. అప్పుడెప్పుడో 1900 ఒలింపిక్స్‌లో ఏదో నామమాత్రంగా ఓ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. అప్పటి నుంచి మళ్లీ ఈ క్రీడల్లో క్రికెట్‌ ఊసే లేదు. మధ్యలో ఎన్నో చర్చలు. మరెన్నో ప్రతిపాదనలు. ఏదీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడా నిరీక్షణ ముగిసింది. 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను అధికారికంగా చేర్చారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న క్రికెట్‌.. ఒలింపిక్స్‌ పునఃప్రవేశంతో కొత్త శిఖరాలకు చేరడం ఖాయం. అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా క్రికెట్‌కే కాదు ఒలింపిక్స్‌కే కొత్త కళ వస్తుందనడంలో సందేహం లేదు. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ (టీ20)తో పాటు స్క్వాష్‌, బేస్‌బాల్‌- సాఫ్ట్‌బాల్‌, లక్రాస్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌ను చేరుస్తున్నట్లు ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాక్‌ ప్రకటించాడు. స్థానిక జియో ప్రపంచ కన్వెన్షన్‌ కేంద్రంలో జరుగుతున్న ఐఓసీ సదస్సు సందర్భంగా కొత్త క్రీడలు చేర్చడంపై ఓటింగ్‌ నిర్వహించగా 99 ఓట్లలో కేవలం రెండు మాత్రమే వ్యతిరేకంగా వచ్చాయి. ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం కోసం రెండేళ్లుగా ఐసీసీ శ్రమించింది. ఇందులో బీసీసీఐ కూడా ప్రధాన పాత్ర పోషించింది. విశ్వజనీనత, ఆదరణ, వారసత్వం అనే మూడు అంశాలను ప్రధానంగా తీసుకుని ఐఓసీ, లాస్‌ ఏంజెలెస్‌ నిర్వాహకులకు ఐసీసీ వివరించింది. మరోవైపు ఈ ఏడాది అమెరికాలో మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ ఆరంభ సీజన్‌ విజయవంతం కావడం, వచ్చే ఏడాది వెస్టిండీస్‌తో కలిసి టీ20 ప్రపంచకప్‌కు అమెరికా ఆతిథ్యం ఇవ్వడం వంటి అంశాలూ కలిసొచ్చాయి. కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లోనూ టీ20 ఫార్మాట్లో క్రికెట్‌ నిర్వహణ మంచి ఫలితాలు ఇవ్వడమూ మేలు చేసింది.


‘‘బేస్‌బాల్‌-సాఫ్ట్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, స్క్వాష్‌, లక్రాస్‌లతో పాటుగా క్రికెట్‌ లాస్‌ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో భాగం కావడం అమితానందాన్నిస్తోంది. క్రీడాకారులందరికీ ఇది గొప్ప వార్త. క్రికెట్‌ను ప్రేమించే దేశంగా ఈ ఆటను ఒలింపిక్స్‌లో చేర్చడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రపంచ స్థాయిలో క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణకు ఇది సంకేతం’’

నరేంద్ర మోదీ, భారత ప్రధాని


‘‘2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చాలని ఐఓసీ సభ్యులు ఓటు వేయడం ఓ క్రికెట్‌ అభిమానిగా, భారతీయురాలిగా, ఐఓసీ సభ్యురాలిగా నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఇది చారిత్రక రోజు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రేమించే క్రీడల్లో క్రికెట్‌ ఒకటి. అత్యధిక మంది వీక్షించే క్రీడల్లో క్రికెట్‌ రెండోది. 140 కోట్ల భారతీయులకు ఇది కేవలం ఓ క్రీడ కాదు మతం’’

ఐఓసీ సభ్యురాలు నీతా అంబాని


ఒలింపిక్స్‌ ఆతిథ్యం దక్కాలంటే?

2036 ఒలింపిక్స్‌ నిర్వహణ కోసం భారత్‌ పట్టుదలతో ఉంది. అయితే భారత్‌కు ఒలింపిక్స్‌ ఆతిథ్యం దక్కాలంటే చేయాల్సింది ఎంతో ఉంది. 2025 తర్వాతే 2036 ఒలింపిక్స్‌ ఆతిథ్య దేశంపై ఐఓసీ నిర్ణయం తీసుకోనుంది. దాదాపు 10 దేశాలు ఈ క్రీడల ఆతిథ్యంపై ఆసక్తితో ఉన్నాయి. ఒలింపిక్స్‌ నిర్వహించాలనుకుంటున్నట్లు భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధికారిక ప్రతిపాదనను ముందుగా ఐఓసీకి సమర్పించాలి. గతంలో లాగా దేశాల మధ్య బిడ్డింగ్‌ ప్రక్రియను నిలిపేసిన ఐఓసీ.. ఆసక్తి చూపించిన దేశాలతో నేరుగా మాట్లాడుతుంది. ఒలింపిక్స్‌ నిర్వహణకు ఆయా దేశాల్లో గల స్టేడియాలు, వసతి తదితర సదుపాయాలను, సాధ్యాసాధ్యాలను ఐఓసీ పరిశీలిస్తుంది. అనంతరం ఐఓసీలోని భవిష్యత్‌ ఆతిథ్య కమిషన్‌ అన్ని దేశాల బిడ్డింగ్‌లను పరిశీలించి ఒలింపిక్స్‌ నిర్వహణకు ఏది ఉత్తమమనే విషయాన్ని ఐఓసీ ఎగ్జిక్యూటివ్‌ బోర్డుకు ప్రతిపాదిస్తుంది. దీనిపై ఐఓసీ తుది నిర్ణయం తీసుకుంటుంది.


లాభాలెన్నో..

లింపిక్స్‌లో క్రికెట్‌ తిరిగి రావడంతో ఇటు ఆటకు, అటు మెగా టోర్నీకి అన్ని రకాలుగా ప్రయోజనం చేకూరనుంది. క్రికెట్‌కు అత్యుత్తమ వేదికగా, ప్రపంచకప్‌ కంటే మిన్నగా ఒలింపిక్స్‌ నిలవబోతుందనే చెప్పొచ్చు. ఒలింపిక్స్‌ పోడియంపై నిలబడి పతకాన్ని మెడలో ధరించడం ఏ అథ్లెట్‌కైనా జీవితకాల అనుభవం. ఒలింపిక్స్‌తో ప్రపంచ క్రీడగా మరింతగా ఎదిగేందుకు క్రికెట్‌కు ఆస్కారం దొరుకుతుంది. ఫిఫా ర్యాంకింగ్స్‌లో 207 పురుషుల, 186 మహిళల ఫుట్‌బాల్‌ దేశాలున్నాయి. అదే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 87 పురుష, 66 మహిళల జట్లున్నాయి. ఫుట్‌బాల్‌కు 350 కోట్ల మంది అభిమానులున్నారు. మరోవైపు క్రికెట్‌ చేరికతో ఒలింపిక్స్‌కు ఆదరణ, వాణిజ్య పరంగానూ గణనీయమైన వృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా భారత్‌ నుంచి ఐఓసీకి దక్కే ఆదాయం పెరగనుంది. భారత్‌లో 2024 పారిస్‌ ఒలింపిక్స్‌ ప్రసారాల నుంచి ఐఓసీ సుమారు రూ.157 కోట్లు ఆర్జించనుందని సమాచారం. కానీ అదే 2028 ఒలింపిక్స్‌కు వచ్చే సరికి ఆ మెత్తం ఏకంగా దాదాపు రూ.1519 కోట్లుగా ఉండబోతుందని అంచనా. ఇప్పుడు 2028 ఒలింపిక్స్‌కే క్రికెట్‌ను పరిమితం చేస్తూ ఐఓసీ నిర్ణయం తీసుకుంది. కానీ ఆస్ట్రేలియా కూడా సంప్రదాయ క్రికెట్‌ దేశం కాబట్టి 2032 బ్రిస్బేన్‌ ఒలింపిక్స్‌లోనూ క్రికెట్‌ను చూసే ఆస్కారముంది. అనంతరం 2036 ఆతిథ్య హక్కులు భారత్‌కు దక్కితే అప్పుడూ క్రికెట్‌ ఎలాగో ఉంటుంది. ఇలా ఒలింపిక్‌ శాశ్వత క్రీడగా మారేలా క్రికెట్‌ సాగనుంది. ఒలింపిక్స్‌ ఆతిథ్య దేశం కోరికను బట్టి కొన్ని కొత్త క్రీడలకు ఐఓసీ పచ్చజెండా ఊపుతుంటుంది.


అదీ కోహ్లి స్థాయి

విరాట్‌ కోహ్లి.. పరిచయం అక్కర్లేని పేరు. ఈ టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులున్నారు. అద్భుతమైన నైపుణ్యాలతో క్రికెట్‌పై అతను వేసిన ముద్ర అలాంటిది. ఇప్పుడు 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే సమయంలోనూ కోహ్లి ప్రస్తావన వచ్చిందంటే అతని స్థాయి ఏమిటో, ప్రపంచ క్రికెట్‌పై అతని ప్రభావం ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘‘నా స్నేహితుడు విరాట్‌ కోహ్లీకి సామాజిక మాధ్యమాల్లో 34 కోట్ల మంది ఫాలోవర్లున్నారు.  దీంతో అత్యధిక మంది అనుసరించే మూడో ప్రపంచ అథ్లెట్‌గా నిలిచాడు. లెబ్రాన్‌ జేమ్స్‌ (ఎన్‌బీఏ స్టార్‌), టామ్‌ బ్రాడీ (అమెరికా ఫుట్‌బాల్‌ దిగ్గజం), టైగర్‌ వుడ్స్‌ (అమెరికా గోల్ఫ్‌ దిగ్గజం)లను అనుసరించేవారి సంఖ్యను ఒక్కచోట కలిపినా కోహ్లి కంటే తక్కువే. ఇది ఎల్‌ఏ28, ఐఓసీ, క్రికెట్‌ సమాజం గెలిచిన సందర్భం. ప్రపంచ వేదికపై క్రికెట్‌కు మరింత చోటు దక్కనుంది. సంప్రదాయ క్రికెట్‌ దేశాలను దాటి ఇది విస్తృతమవుతుంది. అలాగే అథ్లెట్లు, అభిమానులు దీన్ని ఆస్వాదిస్తారు’’ అని లాస్‌ ఏంజెలెస్‌ 2028 నిర్వాహక కమిటీ క్రీడా డైరెక్టర్‌ నికోలో కాంప్రియాని పేర్కొనడం విశేషం. క్రికెట్‌కే కోహ్లి ముఖచిత్రంగా మారాడని ఆర్సీబీ ట్వీట్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు