Cricket In Olympic Games: ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు

ఎన్నో క్రీడలు.. మరెన్నో దేశాలు.. ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లందరూ కలిసి పతకాల కోసం పోటీపడే వేదిక.. అదే ఒలింపిక్స్‌. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో చాలా క్రీడలే నిర్వహిస్తున్నా క్రికెట్‌ లేదనే ఓ లోటు మాత్రం ఉండేది.

Updated : 14 Oct 2023 09:27 IST

ఐఓసీ బోర్డు పచ్చజెండా

ముంబయి: ఎన్నో క్రీడలు.. మరెన్నో దేశాలు.. ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లందరూ కలిసి పతకాల కోసం పోటీపడే వేదిక.. అదే ఒలింపిక్స్‌. ఇప్పటికే ఈ మెగా టోర్నీలో చాలా క్రీడలే నిర్వహిస్తున్నా క్రికెట్‌ లేదనే ఓ లోటు మాత్రం ఉండేది. కానీ తిరిగి ఒలింపిక్స్‌లోకి క్రికెట్‌ వచ్చేసినట్లే! 2028 లాస్‌ ఏంజిలెస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను ప్రవేశపెట్టాలనే నిర్వాహకుల ప్రతిపాదనను అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ఎగ్జిక్యూటివ్‌ బోర్డు శుక్రవారం ఆమోదించింది. క్రికెట్‌ (టీ20)తో పాటు బేస్‌బాల్‌- సాఫ్ట్‌బాల్‌, ఫ్లాగ్‌ ఫుట్‌బాల్‌, లక్రాస్‌ (సిక్సస్‌), స్క్వాష్‌ను కూడా ఒలింపిక్స్‌లో ఆడించాలనే ప్రతిపాదనలకు ఎగ్జిక్యూటివ్‌ బోర్డు పచ్చజెండా ఊపింది. ఇక ఆదివారం ఆరంభమయ్యే ఐఓసీ సదస్సులో ఈ ప్రతిపాదనపై ఓటింగ్‌ నిర్వహిస్తారు. ఈ ఓటింగ్‌తో అధికారికంగా ఒలింపిక్స్‌లో క్రికెట్‌ పునఃప్రవేశం లాంఛనమే. టీ20 ఫార్మాట్లో ఆరు జట్ల పోరుగా మహిళలు, పురుషులకు వేర్వేరుగా క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించే అవకాశముంది. కొత్తగా ప్రవేశపెట్టిన అయిదు క్రీడలను కేవలం లాస్‌ ఏంజిలెస్‌ ఒలింపిక్స్‌లోనే ఆడిస్తామని ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాక్‌ చెప్పడం గమనార్హం. మరోవైపు అంతర్జాతీయ బాక్సింగ్‌ సంఘం గుర్తింపును ఐఓసీ ఉపసంహరించుకున్న నేపథ్యంలో 2028 ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌ నిర్వహించడంపై సందేహం నెలకొంది. బాక్సింగ్‌పై నిర్ణయాన్ని ఐఓసీ నిలుపుదల చేసింది. కాంపౌండ్‌ ఆర్చరీకి మాత్రం ఈ బోర్డు నుంచి ఆమోదం లభించలేదు. 2028 ఒలింపిక్స్‌లో కాంపౌండ్‌ ఆర్చరీని ప్రవేశపెట్టాలని నిరుడు ఐఓసీకి ప్రపంచ ఆర్చరీ ప్రతిపాదన పెట్టినా ఫలితం లేకపోయింది. దిగ్గజ ఆర్చర్‌ జ్యోతి సురేఖ కాంపౌండ్‌ ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆసియా క్రీడల్లో భారత్‌కు అయిదు స్వర్ణాలు సహా 7 పతకాలు కాంపౌండ్‌ ఆర్చరీలో వచ్చాయి.

1900లో ఏం జరిగింది? 

1900 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ నిర్వహించారు. అదే తొలిసారి, చివరిసారి కూడా. అప్పుడు డెవాన్‌ అండ్‌ సోమర్‌సెట్‌ వండరర్స్‌ క్లబ్‌ (బ్రిటన్‌), ఫ్రెంచ్‌ అథ్లెటిక్‌ క్లబ్‌ యూనియన్‌ (ఫ్రాన్స్‌) మధ్య రెండు రోజుల మ్యాచ్‌ జరిగింది. అయితే ఈ మ్యాచ్‌లో ఒక్క జాతీయ ఆటగాడూ లేడు. ఈ మ్యాచ్‌లో జట్టుకు 12 మంది చొప్పున ఆటగాళ్లు ఆడటంతో దీనికి ఫస్ట్‌క్లాస్‌ హోదా కూడా దక్కలేదు. తొలి ఇన్నింగ్స్‌లో బ్రిటన్‌ 117 పరుగులు చేయగా.. ఫ్రాన్స్‌ 78 పరుగులకే ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌ను 145/5 వద్ద బ్రిటన్‌ డిక్లేర్‌ చేసింది. ఛేదనలో ఫ్రాన్స్‌ 26 పరుగులకే కుప్పకూలడంతో బ్రిటన్‌ 158 పరుగుల తేడాతో నెగ్గింది. అప్పుడు బ్రిటన్‌కు రజతం, ఫ్రాన్స్‌కు కాంస్యం అందించారు. ఆ తర్వాత వీటిని పసిడి, రజత పతకాలుగా మార్చారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని