Gautam Gambhir: ఇక గంభీర్‌ ఇన్నింగ్స్‌

అంచనాలు నిజమయ్యాయి. భారత క్రికెట్‌ కోచింగ్‌లో గంభీర్‌ శకం మొదలవబోతోంది. ఊహించినట్లే బీసీసీఐ అతణ్ని ద్రవిడ్‌ స్థానంలో టీమ్‌ఇండియా కోచ్‌గా నియమించింది. శ్రీలంక పర్యటనతో కోచ్‌గా గంభీర్‌ ఇన్నింగ్స్‌ మొదలవుతుంది.

Updated : 10 Jul 2024 06:51 IST

ద్రవిడ్‌ స్థానంలో టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా నియామకం 

అంచనాలు నిజమయ్యాయి. భారత క్రికెట్‌ కోచింగ్‌లో గంభీర్‌ శకం మొదలవబోతోంది. ఊహించినట్లే బీసీసీఐ అతణ్ని ద్రవిడ్‌ స్థానంలో టీమ్‌ఇండియా కోచ్‌గా నియమించింది. శ్రీలంక పర్యటనతో కోచ్‌గా గంభీర్‌ ఇన్నింగ్స్‌ మొదలవుతుంది.

దిల్లీ: మాజీ ఓపెనర్‌ గంభీర్‌ కొత్త అవతారం ఎత్తనున్నాడు. అందరూ అనుకున్నట్లే అతడు భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమితుడయ్యాడు. ద్రవిడ్‌ స్థానంలో అతణ్ని ఎంపిక చేసినట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. భారత్‌ 2011 వన్డే ప్రపంచకప్‌ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన 42 ఏళ్ల గంభీర్‌.. ముందు నుంచి కూడా కోచ్‌ రేసులో ముందున్నాడు. దాదాపుగా అతడికి పోటీ లేదనే చెప్పాలి. శ్రీలంక పర్యటనతో కోచ్‌గా గంభీర్‌ హయాం ఆరంభమవుతుంది. జులై 27న మొదలయ్యే పర్యటనలో టీమ్‌ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతుంది. ‘‘జట్టుకు గొప్పగా మార్గనిర్దేశం చేసినందుకు ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌కు బోర్డు తరఫున కృతజ్ఞతలు. కొత్త కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ఆధ్వర్యంలో టీమ్‌ఇండియా ప్రయాణం సాగుతుంది’’ అని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ ఓ ప్రకటనలో తెలిపాడు. జతిన్‌ పరాంజపె, సులక్షణ నాయక్, అశోక్‌ మల్హోత్రాలతో కూడిన క్రికెట్‌ సలహా సంఘం ఏకగ్రీవంగా గంభీర్‌ పేరును సూచించినట్లు చెప్పాడు. ‘‘ప్రధాన కోచ్‌గా గంభీర్‌ నియామకంతో భారత క్రికెట్లో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అతడు అనుభవజ్ఞుడు, అంకితభావం ఉన్న వ్యక్తి. అతడి నాయకత్వంలో భారత జట్టు తన పురోగతిని కొనసాగిస్తుందని, దేశం గర్వపడేలా చేస్తుందని నమ్మకంతో ఉన్నాం’’ అని బిన్నీ వివరించాడు. గంభీర్‌ టీమ్‌ఇండియా తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ గెలిచిన జట్లలో అతను సభ్యుడు. ఆ రెండు టోర్నీల ఫైనల్స్‌లో గంభీరే టాప్‌స్కోరర్‌. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 2012, 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిళ్లను అందించాడు. 2024లో ఐపీఎల్‌ టైటిల్‌ నెగ్గిన కోల్‌కతాకు మెంటర్‌గా గంభీర్‌ తన కోచింగ్‌ సమర్థతనూ నిరూపించుకున్నాడు. గంభీర్‌ ప్రధాన కోచ్‌గా ద్రవిడ్‌ (ఏడాదికి రూ.12 కోట్లు) కన్నా ఎక్కువ జీతమే పొందనున్నట్లు సమాచారం.


‘‘భారత్‌ నా గుర్తింపు. దేశానికి సేవ చేయడం ఓ గొప్ప గౌరవం. ఈసారి పాత్ర భిన్నమైంది. కానీ నా లక్ష్యం మాత్రం ఎప్పటిలాగే ప్రతి భారతీయుడూ గర్వపడేలా చేయడం. టీమ్‌ఇండియా 140 కోట్ల మంది భారతీయుల కలల భారాన్ని మోస్తోంది. ఆ కలలను నిజం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తా. భారత జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలను స్వీకరించాలనే ఉత్సాహంతో ఉన్నా. ఆటగాడిగా భారత జట్టు జెర్సీని ధరించినందుకు గర్వపడ్డా. కొత్త పాత్రలోనూ అలాగే ఉంటా. బీసీసీఐ, ఎన్‌సీఏ అధిపతి వీవీఎస్‌ లక్ష్మణ్, సహాయ సిబ్బంది, ముఖ్యంగా ఆటగాళ్లతో కలిసి పని చేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’

గంభీర్‌


గంభీర్‌ జట్టులో నాయర్‌! 

దిల్లీ: టీమ్‌ఇండియా చీఫ్‌ కోచ్‌గా నియమితుడైన గౌతమ్‌ గంభీర్‌ సహాయ సిబ్బందిపై తనదైన ముద్ర ఉండాలని భావిస్తున్నాడు. అసిస్టెంట్‌ కోచ్‌గా ముంబయి మాజీ ఆటగాడు అభిషేక్‌ నాయర్‌ను ఎంపిక చేయాలని గంభీర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు నాయర్‌ సహాయ కోచ్‌గా పనిచేస్తున్నాడు. టీమ్‌ఇండియా బాధ్యతలపై గంభీర్, నాయర్‌ ఒక అంచనాకు వచ్చినట్లు సమాచారం. నాయర్‌ను గంభీర్‌ తన బృందంలోకి తీసుకోవడం లాంఛనమేనని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని