Gautam Gambhir: అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్‌ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్

పదకొండేళ్లప్పుడు భారత్‌ ఓడిపోవడం చూసిన ఓ కుర్రాడు.. రెండు ప్రపంచ కప్‌లు నెగ్గడంలో కీలక పాత్ర పోషించడం విశేషం. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరంటే.. మాజీ క్రికెట్ గౌతమ్‌ గంభీర్‌.

Updated : 03 Jul 2024 10:32 IST

ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్‌-1992లో (ODI World Cup) భారత్ లీగ్‌ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టింది. గ్రూప్‌ దశలో ఆసీస్‌తో మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో టీమ్‌ఇండియా ఓడిపోయింది. ఆ మ్యాచ్‌ జరిగిన రాత్రి తనకు నిద్ర పట్టలేదని.. భారత్‌ కోసం ప్రపంచకప్‌ నెగ్గాలని ప్రతిజ్ఞ చేసినట్లు మాజీ క్రికెటర్ గౌతమ్‌ గంభీర్‌ గుర్తు చేసుకున్నాడు. అప్పుడు తన వయసు కేవలం 11 ఏళ్లు మాత్రమేనని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. టీమ్‌ ఇండియాకు ప్రధాన కోచ్‌గా గంభీర్ (Gautam Gambhir) దాదాపు ఖాయమైనట్లేనని వార్తలు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. 

‘‘ఒక మ్యాచ్‌ చూసిన తర్వాత.. భారత్‌కు వరల్డ్‌ కప్‌ అందించాలనే బలమైన ఆకాంక్ష కలిగింది. బ్రిస్బేన్‌ వేదికగా 1992 వరల్డ్‌ కప్‌లో (ODI World Cup) ఆసీస్‌తో భారత్ మ్యాచ్‌ ఆడింది. చివరివరకూ పోరాడినప్పటికీ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. ఆ రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉండిపోయా. అంతకుముందు కానీ.. ఆ తర్వాత కానీ ఎప్పుడూ అలా బాధపడిన సందర్భాలు లేవు. ఆరోజు మాత్రం ఎందుకు అలా ఏడ్చానో తెలియదు. నాకు అప్పుడు 11 ఏళ్లు మాత్రమే. నేను భారత్‌ కోసం వరల్డ్‌ కప్‌ నెగ్గుతానని అనుకున్నా. నా కల 2011లో నెరవేరింది. 32 ఏళ్ల కిందట (1992) జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో వెంకటపతిరాజు రనౌట్‌ అయ్యాడు. ఆ మ్యాచ్ మన సమయం ప్రకారం వేకువజామునే జరిగింది. నేను పొద్దున్నే ఐదు గంటలకు నిద్ర లేచి చూశా’’ అని గంభీర్‌ తెలిపాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 237/9 స్కోరు చేసింది. వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని డక్‌వర్త్‌లూయిస్ పద్ధతి ప్రకారం టార్గెట్‌ను 47 ఓవర్లకు 235 పరుగులుగా నిర్దేశించారు. భారత్‌ సరిగ్గా 234 పరుగులు చేసి ఓడింది.

గంభీర్‌ అనుకున్నట్లుగానే రెండు ప్రపంచకప్‌లను భారత్‌ (Team India) నెగ్గడంలో కీలక పాత్ర పోషించాడు. 2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇక 2011 వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్‌లో శ్రీలంకపై 97 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ధోనీ (MS Dhoni) నాయకత్వంలో టీమ్‌ఇండియా రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను సగర్వంగా అందుకొన్న సంగతి తెలిసిందే. తాజాగా రోహిత్ శర్మ సారథ్యంలో పొట్టికప్‌ను (T20 World Cup 2024) భారత్‌ సొంతం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు