Anand Mahindra - Team India: ‘ఇకపై ఇది అభిమానుల కౌగిలి’.. ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ వైరల్‌

ముంబయిలో జరిగిన భారత క్రికెట్‌ జట్టు ర్యాలీ గురించి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా చేసిన పోస్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Published : 05 Jul 2024 14:26 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) తనను ఆకర్షించిన విషయాలను తరచుగా సోషల్ మీడియాలో నెటిజన్లతో పంచుకుంటుంటారు. వాటికి విభిన్నమైన కామెంట్లు పెడుతుంటారు. ఆయన తాజాగా భారత క్రికెట్‌ జట్టు, అభిమానులను ఉద్దేశిస్తూ ‘అభిమానుల కౌగిలి’ అంటూ ఓ పోస్ట్ చేశారు. 

టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup) గెలుచుకున్న అనంతరం స్వదేశానికి చేరుకున్న భారత జట్టు (Team India)కు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. ముంబయి (Mumbai) మెరైన్‌డ్రైవ్‌లో ఓపెన్‌ బస్సులో భారత జట్టు విజయయాత్ర నిర్వహించారు. వేలాది మంది క్రికెట్‌ అభిమానులు, ప్రజలు వెంటరాగా విజయోత్సవ ర్యాలీ సందడిగా సాగింది. ఈ యాత్ర సాగిన రోడ్డు జన సంద్రాన్ని తలపించింది.

ఈ దృశ్యాలను మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘‘ముంబయిలోని ఈ ప్రాంతాన్ని ఇప్పటివరకు క్వీన్‌ నెక్లెస్‌ రోడ్‌గా పిలిచేవారు. ఇకపై ఇది ‘ముంబయి అభిమానుల కౌగిలి’గా మారిపోయింది’’ అని రాసుకొచ్చారు. మహీంద్రా పోస్టుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ పోస్ట్‌కు భారత స్టార్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) స్పందిస్తూ ‘ఏం చెప్పారు సర్‌..సూపర్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. 

ప్రపంచకప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి విజేతగా నిలిచిన భారత జట్టు.. బార్బడోస్‌లో తుపాను కారణంగా అయిదు రోజులు అక్కడే నిలిచిపోయింది. బుధవారం ప్రత్యేక విమానంలో బయల్దేరి స్వదేశానికి వచ్చింది. గురువారం ఉదయం 6 గంటలకు దిల్లీలోని రాజీవ్‌ గాంధీ విమానాశ్రయానికి చేరుకున్న జట్టు.. బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్ని, కార్యదర్శి జై షాతో కలసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలిసింది. షెడ్యూల్‌ ప్రకారం సాయంత్రం 5 గంటలకు విజయోత్సవ ర్యాలీ ఆరంభం కావాల్సి ఉండగా.. రా.7.30కు షురూ అయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని