Anshuman Gaekwad: ఆస్పత్రిలో భారత మాజీ హెడ్‌ కోచ్‌.. ఆర్థిక సాయం కోసం ఎదురుచూపు

టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad) (71) ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు.

Published : 02 Jul 2024 18:34 IST

ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా మాజీ క్రికెటర్‌, హెడ్ కోచ్‌ అన్షుమాన్ గైక్వాడ్ (Anshuman Gaekwad) (71) లండన్‌లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్‌లో బ్లడ్ క్యాన్సర్‌కు చికిత్స తీసుకుంటున్నాడు. ఇతని చికిత్స కోసం ఆర్థికసాయం చేయాలని భారత మాజీ చీఫ్‌ సెలెక్టర్ సందీప్ పాటిల్ బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. 

‘‘బీసీసీఐ నుంచి తనకు ఆర్థిక సహాయం అందిందని, అయితే చికిత్స కోసం మరింత డబ్బు అవసరముందని గైక్వాడ్ నాతో చెప్పాడు. ఈ విషయాన్ని మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్, నేను బీసీసీఐ ట్రెజరర్ (కోశాధికారి) ఆశిష్ షెలార్‌తో మాట్లాడాము. అగైక్వాడ్‌ను ఆసుపత్రిలో చూసిన తర్వాత మేం ఆశిష్ షెలార్‌కు ఫోన్‌ చేశాం. మేం చేసిన అభ్యర్థనతోపాటు ఇతర మాజీ క్రికెటర్లు నిధుల కోసం చేసిన రిక్వెస్ట్‌లను పరిశీలిస్తానని ఆశిష్ షెలార్ తక్షణమే చెప్పాడు. అతను బోర్డు నుంచి ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుని అన్షు ప్రాణాలను కాపాడతాడని భావిస్తున్నా. ఏ దేశానికి చెందిన క్రికెటర్లకైనా ఆయా దేశాల బోర్డులు సహాయం అందించాలి. అన్షుమాన్‌ విషయాన్ని బీసీసీఐ మరింత ప్రాధాన్య అంశంగా చూడాలి ’’ అని సందీప్ పాటిల్ ఓ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు.  

ఇటీవల టీ20 ప్రపంచ కప్‌ గెలిచిన భారత జట్టుకు రూ.125 కోట్ల భారీ నజరానాను ప్రకటించిన బీసీసీఐ.. అన్షుమాన్‌ గైక్వాడ్‌ చికిత్సకు అవసరమైన ఆర్థికసాయం చేయాలని భారత క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. అన్షుమాన్‌ గైక్వాడ్‌ 1974- 87 మధ్య భారత జట్టు తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడాడు. అనంతరం టీమ్‌ఇండియాకు రెండుసార్లు ప్రధాన కోచ్‌గా పనిచేశాడు. 1997-99 మధ్య కాలంలో ఒకసారి కోచ్‌గా వ్యవహరించాడు. తర్వాత ఇతని కోచ్‌గా ఉన్న సమయంలోనే 2000 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. గైక్వాడ్ ప్రధాన కోచ్‌గా ఉన్న సమయంలో సచిన్ టెందూల్కర్ అత్యుత్తమ ఫామ్‌ని కనబర్చాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని