T20 World Cup: ఎన్నాళ్లో వేచిన విజయం

ఓ అద్భుత ప్రస్థానానికి అనుకోని ముగింపు. పాపం.. అఫ్గానిస్థాన్‌! సంచలన ప్రదర్శనతో, పోరాటపటిమతో అంచనాలను అమాంతం పెంచేసి క్రికెట్‌ ప్రపంచం దృష్టినంతా తనవైపే తిప్పేసుకున్న ఈ జట్టు.. సెమీఫైనల్లో చతికిల పడింది.

Updated : 28 Jun 2024 08:02 IST

ఎట్టకేలకు ప్రపంచకప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికా
సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్‌ ఓటమి

ఓ అద్భుత ప్రస్థానానికి అనుకోని ముగింపు. పాపం.. అఫ్గానిస్థాన్‌! సంచలన ప్రదర్శనతో, పోరాటపటిమతో అంచనాలను అమాంతం పెంచేసి క్రికెట్‌ ప్రపంచం దృష్టినంతా తనవైపే తిప్పేసుకున్న ఈ జట్టు.. సెమీఫైనల్లో చతికిల పడింది. దక్షిణాఫ్రికాపై కేవలం 56 పరుగులకే కుప్పకూలిన అఫ్గాన్‌.. టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. దశాబ్దాల బలహీనతను జయిస్తూ దక్షిణాఫ్రికా.. ప్రపంచకప్పుల్లో తొలిసారి సెమీఫైనల్‌ దాటింది. ఏ ఫార్మాట్లోనైనా ఆ జట్టుకిదే తొలి ప్రపంచకప్‌ ఫైనల్‌.

తరౌబా

నాకౌట్‌ మ్యాచ్‌ల్లో ఒత్తిడికి గురై.. తడబడే అలవాటును పోగొట్టుకుంటూ దక్షిణాఫ్రికా జట్టు టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. టోర్నీలో అజేయ రికార్డును కొనసాగించిన ఆ జట్టు గురువారం అత్యంత ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో 9 వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. మొదట అఫ్గానిస్థాన్‌ 11.5 ఓవర్లలో 56 పరుగులకే కుప్పకూలింది. ఓ టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో ఇదే అత్యల్ప స్కోరు. యాన్సెన్‌ (3/16), షంసి (3/6), రబాడ (2/14), నోకియా (2/7) అఫ్గాన్‌ పతనాన్ని శాసించారు. అజ్మతుల్లా (10) ఒక్కడే రెండంకెల స్కోరు సాధించాడు. లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 8.5 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది. హెండ్రిక్స్‌ (29 నాటౌట్‌; 25 బంతుల్లో 3×4, 1×6), మార్‌క్రమ్‌ (23 నాటౌట్‌; 21 బంతుల్లో 4×4) బ్యాట్‌ ఝళిపించారు. యాన్సెన్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. 

అఫ్గాన్‌ విలవిల: టోర్నీ ఆరంభం నుంచి స్ఫూర్తిదాయక ప్రదర్శనతో అందరి మన్ననలను పొందిన అఫ్గానిస్థాన్, అసలు సమరంలో తేలిపోయింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆ జట్టు.. దక్షిణాఫ్రికా పేసర్ల ధాటికి విలవిల్లాడింది. బ్యాటింగ్‌కు అత్యంత క్లిష్టమైన పిచ్‌పై యాన్సెన్, రబాడ ధాటికి 5 ఓవర్లలో 23 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకున్న ఆఫ్గాన్‌ మళ్లీ కోలుకోలేకపోయింది. ఆ జట్టు నుంచి కనీస ప్రతిఘటన లేదు. ఒక్క బ్యాటర్‌ కూడా నిలవలేకపోయాడు. ఇద్దరు బ్యాటర్లు మాత్రమే పది కన్నా ఎక్కువ బంతులు ఆడగలిగారు అంటేనే అఫ్గాన్‌ ఎంత కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు. తొలి ఓవర్లోనే యాన్సెన్‌ ఆఫ్‌స్టంప్‌ ఆవల బంతిని వెంటాడి ఓపెనర్‌ గుర్బాజ్‌ (0) స్లిప్‌లో దొరికిపోయాడు. ఫామ్‌లో ఉన్న అతడు ఖాతా అయినా తెరవకుండానే నిష్క్రమించడంతో అఫ్గాన్‌ లైనప్‌ ఆందోళనకు గురైనట్లు కనిపించింది. యాన్సనే తన తర్వాతి ఓవర్లో నైబ్‌ (9)ను ఔట్‌ చేశాడు. ఆ తర్వాత ఇబ్రహీం జద్రాన్‌ (2), నబి (0)లను ఒకే ఓవర్లో ఔట్‌ చేయడం ద్వారా అఫ్గాన్‌కు రబాడ షాకిచ్చాడు. ఖరోట్‌ను  (8)ను యాన్సెన్‌ వెనక్కి పంపడంతో అఫ్గాన్‌ పీకల్లోతు కష్టాల్లోకి కూరుకుపోయింది. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా చేతులెత్తేయడంతో అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌ చాలా త్వరగా ముగిసింది. షంసి, నోకియా విజృంభించడంతో వచ్చిన బ్యాటర్‌ వచ్చినట్లే పెవిలియన్‌ బాట పట్టాడు. ఛేదనలో రెండో ఓవర్లోనే డికాక్‌ (5) వికెట్‌ను కోల్పోయినా.. దక్షిణాఫ్రికా అలవోకగా పని పూర్తి చేసింది. హెండ్రిక్స్, మార్‌క్రమ్‌ అభేద్యమైన రెండో వికెట్‌కు 55 పరుగులు జోడించారు.

అఫ్గానిస్థాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) హెండ్రిక్స్‌ (బి) యాన్సెన్‌ 0; ఇబ్రహీం జద్రాన్‌ (బి) రబాడ 2; నైబ్‌ (బి) యాన్సెన్‌ 9; అజ్మతుల్లా (సి) స్టబ్స్‌ (బి) నోకియా 10; నబి (బి) రబాడ 0; ఖరోట్‌ (సి) డికాక్‌ (బి) యాన్సెన్‌ 2; కరీమ్‌ జనత్‌ ఎల్బీ (బి) షంసి 8; రషీద్‌ ఖాన్‌ (బి) నోకియా 8; నూర్‌ అహ్మద్‌ ఎల్బీ (బి) షంసి 0; నవీనుల్‌ హక్‌ ఎల్బీ (బి) షంసి 2; ఫారూఖీ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (11.5 ఓవర్లలో ఆలౌట్‌) 56; వికెట్ల పతనం: 1-4, 2-16, 3-20, 4-20, 5-23, 6-28, 7-50, 8-50, 9-50; బౌలింగ్‌: యాన్సెన్‌ 3-0-16-3; కేశవ్‌ మహరాజ్‌ 1-0-6-0; రబాడ 3-1-14-2; నోకియా 3-0-7-2; షంసి 1.5-0-6-3

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (బి) ఫారూఖీ 5; హెండ్రిక్స్‌ నాటౌట్‌ 29; మార్‌క్రమ్‌ నాటౌట్‌ 23; ఎక్స్‌ట్రాలు 3 మొత్తం: (8.5 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 60; వికెట్ల పతనం: 1-5; బౌలింగ్‌: నవీనుల్‌ హక్‌ 3-0-15-0; ఫారూఖీ 2-0-11-1; రషీద్‌ ఖాన్‌ 1-0-8-0; అజ్మతుల్లా 1.5-0-18-0; నైబ్‌ 1-0-8-0

1

టీ20 లేదా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ చేరడం దక్షిణాఫ్రికాకు ఇదే తొలిసారి

2

ఓ పూర్తయిన టీ20 ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాలది అత్యధిక స్కోరు కావడం ఇది రెండోసారి మాత్రమే. సెమీస్‌లో అఫ్గానిస్థాన్‌ చేసిన 56 పరుగుల స్కోరులో 13 ఎక్స్‌ట్రాలు ఉన్నాయి. బ్యాటర్లలో అజ్మతుల్లా (10) ఒక్కడే రెండంకెల స్కోరు చేశాడు.

56

టీ20ల్లో అఫ్గానిస్థాన్‌కు ఇదే అత్యల్ప స్కోరు. టీ20 ప్రపంచకప్‌ నాకౌట్‌ మ్యాచ్‌లో ఓ జట్టు చేసిన అత్యల్ప స్కోరు కూడా ఇదే.


‘‘ఇలాంటి పిచ్‌పై ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ ఆడాలని ఎవరూ అనుకోరు. స్పిన్‌కు గానీ, పేస్‌కు గానీ సహకరించకుండా పిచ్‌ నిర్జీవంగా ఉండాలని నేను అనట్లేదు. బ్యాట్స్‌మెన్‌ ఫార్వర్డ్‌ వెళ్లాలంటే భయపడేలా ఉండకూడదు’’ - ట్రాట్, అఫ్గానిస్థాన్‌ కోచ్‌


చేదు గురుతులు చెరిపేసి.. 

ప్రపంచకప్పుల్లో దక్షిణాఫ్రికా ప్రదర్శన గుర్తు చేసుకోగానే ఆ జట్టు అభిమానులకు ఎన్నో చేదు అనుభవాలు కళ్ల ముందు మెదులుతాయి. ఎన్నో సందర్భాల్లో టైటిల్‌ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగినా.. నాకౌట్‌ దశల్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక లేదంటే దురదృష్టం వెంటాడో నిష్క్రమించేది. 1992 వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో వర్షం ఆ జట్టును కొట్టిన దెబ్బను అభిమానులు అంత సులువుగా మరిచిపోలేరు. అలాగే 1999 ప్రపంచకప్‌ సెమీస్‌లో డొనాల్డ్‌ రనౌట్‌ కూడా మరో చేదు జ్ఞాపకం. టీ20 ప్రపంచకప్‌ల్లోనూ ఇలాంటి చేదు అనుభవాలు చాలానే ఎదుర్కొంది దక్షిణాఫ్రికా. మొత్తంమీద వన్డే ప్రపంచకప్‌లో నాలుగుసార్లు, టీ20 ప్రపంచకప్‌లో రెండుసార్లు (2009, 2014) సెమీస్‌లో ఆ జట్టు ఇంటిముఖం పట్టింది. ఈసారి పొట్టి కప్పులో ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. కానీ కొన్ని మ్యాచ్‌ల్లో తడబడ్డప్పటికీ పుంజుకుని నిలకడగా విజయాలు సాధించింది. గ్రూప్‌ దశలో న్యూజిలాండ్‌కు, సూపర్‌-8లో ఆస్ట్రేలియాకు షాకిచ్చిన అఫ్గానిస్థాన్‌తో సఫారీలకు సెమీస్‌ మ్యాచ్‌ అనేసరికి ఏమైనా జరగొచ్చు, ఎలాంటి ఫలితమైనా రావచ్చు అనే అంచనాలు ఏర్పడ్డాయి. కానీ దక్షిణాఫ్రికా మాత్రం అఫ్గాన్‌ను పసికూనగా మార్చేసి చిత్తుగా ఓడించింది. మొత్తానికి చేదు జ్ఞాపకాలన్నీ చెరిపేస్తూ, ప్రపంచకప్‌లో సెమీస్‌ గడప దాటని ప్రతికూల రికార్డును బద్దలుకొడుతూ.. తొలిసారి ఫైనల్‌ చేరడం సఫారీ జట్టు అభిమానులకు అమితానందాన్నిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని