Hardik Pandya: హార్దిక్‌కు మహిళా అభిమాని బహిరంగ క్షమాపణ.. ఎందుకంటే?

టీ20 ప్రపంచ కప్‌ను సగర్వంగా ఎత్తుకొని వచ్చిన టీమ్‌ఇండియా ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. వాంఖడే వేదికగా జరిగిన సన్మానం కార్యక్రమంలో పెద్ద ఎత్తున అభిమానులు పాల్గొన్నారు.

Updated : 05 Jul 2024 13:46 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ముందు ఐపీఎల్‌ సమయంలో భారత క్రికెటర్ హార్దిక్‌ పాండ్యపై తీవ్రమైన నెగెటివ్‌ ట్రోలింగ్‌ వచ్చింది. ముంబయి కెప్టెన్సీ విషయంలో అతడిపై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు పొట్టి కప్‌ విజయంలో హార్దిక్‌ కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దీంతో అతడిని పొగడ్తలతో ముంచెత్తుతూ అభిమానులు జేజేలు కొడుతున్నారు. ముంబయి వేదికగా జరిగిన విజయోత్సవంలోనూ అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఫైనల్‌ ఓవర్‌లో 16 పరుగులను కాపాడి.. భారత్‌కు ఏడు రన్స్‌ తేడాతో కప్‌ను అందించడంతో హార్దిక్‌పై (Hardik Pandya) ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ సందర్భంగా పాండ్యను విపరీతంగా ట్రోల్ చేసిన ఓ మహిళా అభిమాని అతడికి బహిరంగంగా క్షమాపణలు చెప్పడం గమనార్హం.

‘‘అన్నింటికంటే ముందు నేను హార్దిక్‌ పాండ్యకు క్షమాపణలు చెబుతున్నా. ఇప్పటి వరకు చేసిన ట్రోలింగ్‌కు సారీ అడుగుతున్నా. మొదట్లో నేను ఎందుకు అతడిని ట్రోల్‌ చేశానో తెలియదు. మరోసారి సారీ చెబుతున్నా. టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో హార్దిక్‌ చివరి ఓవర్‌ చిరకాలం గుర్తుండిపోతుంది. మీ గురించి ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి’’ అని సదరు అభిమాని తెలిపారు. టీ20 ప్రపంచ కప్‌లో హార్దిక్ 144 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో 11 వికెట్లు తీశాడు. దాదాపు 17 ఏళ్ల తర్వాత టీమ్‌ఇండియా (Team India) రెండోసారి విజేతగా నిలవడంలో ముఖ్య భూమిక పోషించాడు. 

పాండ్యపై రోహిత్ ప్రశంసలు

జట్టులోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారని కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యాఖ్యానించాడు. వాంఖడే మైదానంలో సన్మాన కార్యక్రమం సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ.. ‘‘మన కోసం హార్దిక్‌ ఫైనల్‌ ఓవర్‌ వేశాడు. తీవ్ర ఒత్తిడి ఉండే అలాంటి సమయంలో ముందుకొచ్చాడు. ఎన్ని పరుగులను కట్టడి చేయాలనేది పక్కన పెడితే.. టీ20ల్లో అత్యంత క్లిష్టమైన ఓవర్ అదే. బ్యాటర్లదే హవా ఉండే పొట్టి ఫార్మాట్‌లో చివరి ఓవర్‌ను వేసిన హార్దిక్‌కు హ్యాట్సాఫ్‌’’ అని రోహిత్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని