Virat Kohli: జట్టు ఫామే కీలకం.. విరాట్‌ గురించి ఆందోళన అక్కర్లేదు: మంజ్రేకర్

రెండోసారి టీ20 ప్రపంచ కప్‌ను దక్కించుకొనే అద్భుతమైన అవకాశం టీమ్‌ఇండియాకు వచ్చింది. దక్షిణాఫ్రికాతో కీలక పోరు జరగనుంది.

Published : 29 Jun 2024 17:23 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌లో (T20 World Cup 2024) భారత టాప్‌ బ్యాటర్లలో విరాట్ కోహ్లీ ఒక్కడి నుంచే భారీ ఇన్నింగ్స్‌ బాకీ ఉంది. సెమీస్‌ వరకు జరిగిన మ్యాచుల్లో ఒక్కసారి మాత్రమే రెండంకెల స్కోరు నమోదు చేశాడు. అతడి ఫామ్‌ గురించి అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కనీసం ఫైనల్‌లోనైనా మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుంటాడని ఎదురు చూస్తున్నారు. అయితే, కోహ్లీ బ్యాటింగ్‌ గురించి ఆందోళన అక్కర్లేదని.. ఒక్కసారి కుదురుకుంటే అతడిని ఆపడం చాలా కష్టమని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. 

‘‘విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫామ్‌ కంటే జట్టు ఫామ్‌ అత్యంత ముఖ్యం. ఈ విషయంలో టీమ్‌ఇండియా చాలా మెరుగ్గా ఉంది. కోహ్లీ కూడా రాణిస్తాడనే నమ్మకం ఉంది. తప్పకుండా భారత్‌ ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుస్తుందని భావిస్తున్నా. ఇప్పుడు జట్టంతా కలిసి కట్టుగా ఆడుతోంది. ఒకరిపైనే ఆధారపడి లేదు. అది టీమ్‌ఇండియాకు సానుకూలాంశం. దక్షిణాఫ్రికా (IND vs SA) జట్టులో నోకియా, రబాడ, డికాక్‌ కీలక ప్లేయర్లు. ఆ జట్టు పేస్‌ను తట్టుకోగలిగితే గెలవడం పెద్ద కష్టమేం కాదు’’ అని మంజ్రేకర్ వెల్లడించాడు.

రోహిత్‌కు బదులు రషీద్.. క్రికెట్ ఆస్ట్రేలియా జట్టిదే..

సూపర్‌-8లోనే ఇంటిముఖం పట్టిన ఆస్ట్రేలియా (Australia) జట్టు అందుకు కారణమైన టీమ్‌ఇండియాపై మరో రూపంలో అక్కసు వెళ్లగక్కింది. గతేడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్‌పై ఆసీస్‌ గెలిచింది గుర్తుంది కదా.. ఇప్పుడు ఆ ఓటమికి రివెంజ్‌ తీర్చుకున్న రోహిత్‌ శర్మను కాదని.. మరొకరిని సారథిగా ఎంపిక చేసిన క్రికెట్ ఆస్ట్రేలియా తన టీ20 వరల్డ్‌ కప్‌ జట్టును ప్రకటించింది. అఫ్గాన్‌ సారథిగా ఉన్న రషీద్ ఖాన్‌ను ఈ టీమ్‌ కెప్టెన్సీ బాధ్యతలు ఇచ్చింది. సూపర్‌-8 గ్రూప్‌1 నుంచి టీమ్‌ఇండియాతోపాటు అఫ్గాన్‌ సెమీస్‌కు చేరిన సంగతి తెలిసిందే. భారత్‌ నుంచి రోహిత్‌తోపాటు హార్దిక్‌ పాండ్య, బుమ్రాకు జట్టులో చోటు కల్పించింది. 

టీమ్‌ ఇదే: రోహిత్ శర్మ, ట్రావిస్‌ హెడ్, నికోలస్ పూరన్, ఆరోన్ జోన్స్, మార్కస్ స్టాయినిస్, హార్దిక్ పాండ్య, రషీద్‌ ఖాన్ (కెప్టెన్), రిషద్ హుస్సేన్, ఆన్రిచ్ నోకియా, జస్‌ప్రీత్ బుమ్రా, ఫజల్‌హక్ ఫరూఖి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని