Suryakumar Yadav: సూర్య క్యాచ్‌ సరైందే.. ముందు మీ బుర్రను సరిచేసుకోండి: చోప్రా

దాదాపు 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్‌ను భారత్‌ రెండోసారి కైవసం చేసుకుంది. ఫైనల్‌లో చివరి ఓవర్‌లో అద్భుతమైన క్యాచ్‌తో సూర్య టీమ్‌ఇండియాకు కప్‌ను అందించాడు.

Updated : 03 Jul 2024 12:53 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ను (T20 World Cup 2024) భారత్‌ నెగ్గడంలో ఒక్క క్యాచ్‌ కీలకంగా మారింది. హార్దిక్ పాండ్య వేసిన చివరి ఓవర్‌ మొదటి బంతిని దక్షిణాఫ్రికా బ్యాటర్ డేవిడ్‌ మిల్లర్‌ భారీ షాట్‌కు యత్నించాడు. అంతా సిక్స్‌ అనుకున్న వేళ.. దూసుకొచ్చిన సూర్యకుమార్‌ అద్భుతమైన రీతిలో క్యాచ్‌ పట్టాడు. అయితే, టీమ్‌ఇండియా గెలవడం తట్టుకోలేని కొందరు మాత్రం సూర్య క్యాచ్‌పై విమర్శలు చేశారు. బౌండరీ రోప్‌ను పక్కకు జరిపారని.. మార్క్‌ కూడా స్పష్టంగా కనిపిస్తోందని కామెంట్లు వచ్చాయి. దీనిపై భారత మాజీ క్రికెటర్, విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా అసహనం వ్యక్తంచేశాడు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించాలని విమర్శకులకు కౌంటర్ ఇచ్చాడు. 

‘‘తెల్లగా ఉన్న లైన్‌ కనిపిస్తోంది. రోప్‌ను వెనక్కి జరిపారని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. అక్కడ ఎవరూ ఏమీ చేయలేదు. మీరు మీ బుర్రలతో ఆలోచించండి. నిబంధనలు ఏంటో తెలుసుకొని మాట్లాడండి. లైన్‌ను బౌండరీ మార్క్‌గా అనుకోవడం కరెక్టే. కానీ, లైన్‌ కంటే రోప్‌ కాస్త వెనక్కి ఉండటానికి కారణం ఉంది. గ్రౌండ్‌లో చాలా పిచ్‌లు ఉంటాయి. ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో పిచ్‌ను ఉపయోగిస్తూ ఉంటారు. అందుకోసం బౌండరీ లైన్‌ రోప్‌ను అడ్జస్ట్‌ చేస్తుంటారు. బార్బడోస్‌లో ఇదే తొలి మ్యాచ్‌ కాదు. ఫైనల్‌ (IND vs SA Final)) కోసం ఎంపిక చేసిన పిచ్‌ బట్టి బౌండరీ లైన్లను మార్చారు. లేకపోతే గ్రౌండ్ పరిమాణంలో తేడాలు వచ్చేస్తాయి. 

పొట్టి కప్‌ ఫైనల్‌లోనూ సూర్యకుమార్‌ యాదవ్ (Suryakumar Yadav) రోప్‌ లోపలే ఉన్నాడు. క్యాచ్‌ను అందుకొన్నాడు. బ్యాలెన్స్‌ కోల్పోతున్నట్లు అనిపించి దానిని లోపలికి విసిరాడు. మళ్లీ వచ్చి బంతిని పట్టేశాడు. ఇందులో ఎక్కడా పొరపాటు లేదు. అంతా క్లియర్‌గానే ఉంది. మైదానంలో చాలా కెమెరాలు ఉన్నాయి. అవి ప్రతీ యాంగిల్‌ను రీడ్‌ చేస్తాయి. ఎక్కడా కూడా సూర్య రోప్‌ను తాకినట్లు అనిపించలేదు. కొందరు చెబుతున్నట్లుగా క్యాచ్‌ విషయంలో అస్పష్టత లేదు’’ అని చోప్రా వెల్లడించాడు. అద్భుతమైన క్యాచ్ పట్టడంతో సూర్యకుమార్‌నే ‘బెస్ట్‌ ఫీల్డర్‌’ అవార్డు వరించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు