IND vs ENG: అప్పటిలా కాదు.. ఈసారి టీమ్‌ఇండియాదే విజయం: ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌

టీ20 ప్రపంచకప్‌ రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో భారత్‌ తలపడనుంది. అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉన్న టీమ్‌ఇండియానే ఫేవరేట్‌ అని పలువురు అంటున్నారు.

Published : 26 Jun 2024 16:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: టీ20 ప్రపంచకప్‌(T20 world cup) తుది అంకానికి చేరుకుంది. సెమీస్‌ పోరులో తలపడేందుకు నాలుగు జట్లు సిద్ధమయ్యాయి. గురువారం రెండో సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను టీమ్‌ఇండియా(IND vs ENG) ఢీకొననుంది. 2022లో ఇంగ్లిష్‌ టీమ్‌పై ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని.. ఐసీసీ ట్రోఫీల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాలని ప్రతీ భారతీయ అభిమాని కోరుకుంటున్నాడు. అందుకు తగ్గట్లే రోహిత్‌ సేన(Rohit Sharma) ఓటమే ఎరగకుండా.. ఈ టోర్నీలో సెమీస్‌ వరకు దూసుకొచ్చింది.

ఈ టోర్నీలో పటిష్ఠమైన స్థితిలో ఉన్న టీమ్‌ఇండియానే ఫేవరేట్‌గా కనిపిస్తోందని.. అయితే ఇంగ్లాండ్‌ను తక్కువగా అంచనా వేయకూడదని పలువురు అంటున్నారు. ఈనేపథ్యంలో ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ పాల్‌ కాలింగ్‌వుడ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో మాదిరిగా భారత్‌ ఈసారి ఓడిపోదని విశ్వాసం వ్యక్తంచేశాడు.

‘‘ఎంతో గొప్పగా ఉన్న ఇండియా టీమ్‌ ప్రత్యేకంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బుమ్రా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఫిట్‌నెస్‌, కచ్చితత్వం, పేస్‌, అత్యంత నైపుణ్యంతో బంతులు సంధిస్తున్నాడు. అతడి బంతులను ఎదుర్కొనేందుకు ఏ జట్టు వద్దా సమాధానాలు లేవు. పొట్టి ఫార్మాట్‌లో అతడు వేసే 24 బంతులు జట్టు విజయంలో కీలకమవుతాయి. కఠిన పరిస్థితులు ఉన్న అమెరికాలాంటి పిచ్‌లపై కూడా రోహిత్‌ సేన ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడింది. ఇక ఆ జట్టు సారథి రోహిత్‌.. ఆసీస్‌పై అద్భుతమైన ఇన్నింగ్స్‌తో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. నిజాయతీగా చెప్పాలంటే.. ఈసారి టీమ్‌ఇండియా ఓడిపోదనే నేను అనుకుంటున్నాను. ఆ జట్టును ఓడించాలంటే ఇంగ్లాండ్‌ అసాధారణ రీతిలో పోరాడాల్సి ఉంటుంది’’ అని విశ్లేషించాడు.

ఇంగ్లాండ్‌ నాకౌట్‌ దశలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, భయం లేకుండా ఆడుతుందని కాలింగ్‌వుడ్‌ పేర్కొన్నాడు. ‘సారథి బట్లర్‌ గొప్ప పామ్‌లో ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నాడు. జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణం కూడా ఎంతో సానుకూలంగా ఉంది. ఇరు జట్లు ఎంతో దూకుడుగా బరిలోకి దిగుతాయి. ఈనేపథ్యంలో పిచ్‌ కీలకమవుతుంది. ఇలాంటి ఫ్లాట్‌ పిచ్‌పై ఇంగ్లాండ్‌దే పైచేయి అయినప్పటికీ.. స్లో, టర్నింగ్‌ పిచ్‌ భారత్‌కు అనుకూలంగా ఉంటుంది’’ అని వివరించాడు.

2022 పొట్టి ప్రపంచకప్‌ సెమీస్‌లో టీమ్‌ఇండియా.. ఇంగ్లాండ్‌ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. 10 వికెట్ల తేడాతో ఇంగ్లిష్‌ సేన ఘన విజయం సాధించింది. ఆ ఓటమిని మరచిపోవడం అంత ఈజీ కాదు. ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు భారత్‌కి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు