Virat Kohli: విరాట్ విధ్వంసం మాకు తెలుసు.. మేం ప్రిపేర్డ్‌గానే ఉన్నాం: ఇంగ్లాండ్ కోచ్

కొన్ని మ్యాచుల్లో సరిగా ఆడనంత మాత్రాన విరాట్ కోహ్లీని తక్కువగా అంచనా వేయడం లేదని ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ మాథ్యూస్ మాట్ వ్యాఖ్యానించాడు.

Updated : 27 Jun 2024 17:46 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) రెండో సెమీస్‌కు సమయం ఆసన్నమైంది. భారత్‌తో తలపడేందుకు ఇంగ్లాండ్ సిద్ధమైంది. గయానా వేదికగా ఈ మ్యాచ్‌ జరగనుంది. ఇంగ్లిష్ జట్టును కలవరపెట్టే ఆటగాళ్లలో కెప్టెన్‌ రోహిత్ శర్మతోపాటు (Rohit Sharma) విరాట్ కోహ్లీ ఉన్నాడు. ప్రస్తుత పొట్టి కప్‌లో కోహ్లీ పెద్దగా ఫామ్‌లో లేడు. అయినా, తాము మాత్రం విరాట్‌పై ఓ కన్నేసి ఉంచుతామని ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ మాథ్యూస్ మాట్‌ వ్యాఖ్యానించాడు. అతడి విధ్వంసం గురించి తమకు తెలుసునని... అడ్డుకొనేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు వెల్లడించాడు. 

‘‘విరాట్ కోహ్లీ (Virat Kohli) చాన్నాళ్లుగా క్లాస్‌ క్రికెట్‌తో తన సత్తా ఏంటో నిరూపించుకొన్నాడు. అతడిని అడ్డుకోవడానికి అన్ని మార్గాల్లోనూ సిద్ధంగా ఉన్నాం. ఒక్కసారి కోహ్లీ కుదురుకున్నాడంటే అతడిని ఆపడం చాలా కష్టం. ఈ భారత స్టార్‌ దూకుడు ఎలా ఉంటుందో మాకు తెలుసు. కీలకమైన మ్యాచుల్లో విరాట్ మరింత నైపుణ్యం ప్రదర్శిస్తాడు. టీమ్ఇండియాకు అతడే కీలక ప్లేయర్‌ అనడంలో సందేహం లేదు. ఇప్పటి ఈ టోర్నీలో కోహ్లీ పెద్దగా రాణించలేదు. అలాగని అతడిని తక్కువగా అంచనా వేస్తే మేం భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. పెద్ద మ్యాచుల్లో తమ విలువేంటో స్టార్లు ఆటతీరుతో చెబుతారు’’ అని మాట్ వ్యాఖ్యానించాడు.

టాప్‌-2లోకి రావాలంటే.. 

ప్రస్తుతం అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రోహిత్ శర్మ (4,165) కొనసాగుతున్నాడు. అతడి తర్వాత పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్ (4,145) ఉన్నాడు. విరాట్ కోహ్లీ 4,103 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో కనీసం 43 పరుగులు చేస్తే కోహ్లీ రెండో స్థానంలోకి వస్తాడు. అప్పుడు టీ20ల్లో టాప్‌ స్కోరర్లు ఇద్దరూ భారత స్టార్లే అవుతారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని