Devdutt Padikkal: అనారోగ్యంతో 10కిలోల బరువు తగ్గా: దేవ్‌దత్‌ పడిక్కల్‌

తన కెరీర్‌లో ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను టీమ్‌ ఇండియా యువ ఆటగాడు దేవ్‌దత్‌ పడిక్కల్‌ వివరించాడు. తాజాగా టెస్ట్‌ జట్టు నుంచి పిలుపు వచ్చిన వేళ తొలిసారి స్పందించాడు.  

Updated : 13 Feb 2024 13:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అనారోగ్యంతో గత సీజన్‌లో తీవ్రంగా ఇబ్బంది పడినట్లు కర్ణాటక యువ ఆటగాడు దేవ్‌దత్‌ పడిక్కల్‌ (Devdutt Padikkal) పేర్కొన్నాడు. రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్‌తో జరగనున్న మూడో టెస్టు కోసం టీమ్‌ ఇండియా నుంచి పిలుపునందుకొన్న తర్వాత అతడు స్పందించాడు. టెస్టుల్లో ఆడటం తన కల అని పేర్కొన్నాడు. ఉదర సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతూనే 2022-23 సీజన్‌ ఆడినట్లు వెల్లడించాడు. ఆ సమయంలో తరచూ అనారోగ్యం పాలవ్వడంతో దాదాపు 10 కిలోల బరువు కోల్పోయినట్లు వెల్లడించాడు. 

‘‘టెస్టు జట్టులోకి పిలుపు రావడాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. దానిలో స్థానం దక్కించుకోవడం నా కల. కెరీర్‌లోనే చాలా కఠినమైన కాలం గడిచాక ఈ అవకాశం వచ్చింది. నా శ్రమ ఫలించినందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా అనారోగ్యం నుంచి కోలుకొని.. ఫిట్‌నెస్‌ సాధించడం నేను ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్‌. ఈ క్రమంలో ఏకంగా 10 కిలోల బరువు తగ్గాను. ఆ సమయంలో సరైన ఆహారం, కండరాలను బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెట్టా’’ అని పడిక్కల్‌ పేర్కొన్నాడు. 

సోమవారం కర్ణాటక-తమిళనాడు మధ్య జరిగిన రంజీ మ్యాచ్‌లో పడిక్కల్‌ రెండో ఇన్నింగ్స్‌లో పోరాడి మ్యాచ్‌ను డ్రా అయ్యేట్లు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 151 పరుగులు సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లో కీలకమైన 36 రన్స్‌ చేశాడు. గతంలో ఇండియా-ఎ జట్టుకు ప్రాతినిధ్యంవహించి అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌పై అర్ధశతకం సాధించాడు.  గతేడాది అంతర్జాతీయ జట్టులో టీ20 కెరీర్‌ను ప్రారంభించి రెండు మ్యాచ్‌లు ఆడాడు. వీటిల్లో కేవలం 38 పరుగులు మాత్రమే చేయడంతో జట్టులో స్థానం కోల్పోయాడు. 2022-23 సీజన్‌లో అనారోగ్యం కారణంగా ఐపీఎల్‌లో కూడా రాణించలేకపోయాడు.   

బాడీషేమింగ్‌ కామెంట్లు.. దీటుగా బదులిచ్చిన బుమ్రా సతీమణి

తాజాగా సీనియర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా ఇంగ్లాండ్‌తో మూడో టెస్టుకూ దూరమయ్యాడు. దీంతో సెలక్షన్‌ కమిటీ దేవ్‌దత్‌ పడిక్కల్‌ను అతడి స్థానంలో ఎంపిక చేసింది. ‘‘రాహుల్‌ మూడో టెస్టుకు దూరమయ్యాడు. అతడు 90 శాతం మ్యాచ్‌ ఫిట్‌నెస్‌తో ఉన్నాడు. బీసీసీఐ వైద్యుల బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు’’ అని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని