Hardik Pandya: ఇదెంతో ప్రత్యేకం.. గత ఆరు నెలలు ఎలా ఉన్నాయో తెలుసు: హార్దిక్

ఐపీఎల్‌ సందర్భంగా ఎదురైనా అవమానాలను తట్టుకొని.. వరల్డ్‌ కప్‌ జట్టులోకి వచ్చిన హార్దిక్‌ పాండ్య తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు.

Updated : 30 Jun 2024 11:49 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup 2024) ఫైనల్‌లో అత్యుత్తమ బౌలింగ్‌తో భారత విజయంలో హార్దిక్‌ పాండ్య కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్‌గా ఈ టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇక చివరి బంతిని వేసిన తర్వాత భావోద్వేగాలను నియంత్రిచుకోలేకపోయాడు. కన్నీటితో సహచరులను హత్తుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం కంట్రోల్‌ చేసుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కీలక సమయంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు క్లాసెన్, డేవిడ్‌ మిల్లర్‌ను ఔట్ చేసిన పాండ్య (Hardik Pandya) మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

‘‘ఆనందాన్ని ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు. మా కష్టానికి ఫలితం దక్కింది. దేశం మొత్తం కోరుకున్న గొప్ప విజయాన్ని సాధించాం. మరీ ముఖ్యంగా ఇది నాకెంతో స్పెషల్. గత ఆరు నెలలు ఎలా గడిచాయో తెలిసిందే. నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అనుకోని విషయాలు జరిగిపోయాయి. కష్టపడుతూ ఉంటే మరింత మెరుగవుతామని నాకు తెలుసు. అదే నేను చేశా. ఇలాంటి అవకాశాన్ని వదులుకోకూడదని నిర్ణయించుకున్నా. మా ప్రణాళికలను అమలు చేయడంలో సక్సెస్ అయ్యాం. ప్రత్యర్థిపై ఒత్తిడి తేవడంతో విజయం సొంతమైంది. 

నాకు వారెవరో ఒక్క శాతం కూడా తెలియని వ్యక్తులు కూడా చాలా విషయాలు చెప్పారు. వాటితో నాకేమీ సమస్య లేదు. నేనెంటో తెలియజెప్పడానికి మెరుగైన మార్గాలను కనిపెట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడీ ప్రదర్శనతో వారే సంతోషంగా ఉంటారనుకుంటా. జీవితాన్ని మార్చే అవకాశాలు చాలా తక్కువగా లభిస్తాయి. వాటిని అందిపుచ్చుకోవడం కీలకం. నేనెప్పుడూ ఒత్తిడిగా భావించను. నైపుణ్యాలపైనే దృష్టిపెట్టా. చివరి ఐదు ఓవర్లలో మేం పుంజుకున్న తీరు అద్భుతం. బుమ్రా (Bumrah) మ్యాచ్‌ ఛేంజర్. నేను కూడా వందశాతం నిబద్ధతతో ప్రతి బంతిని విసిరా’’ అని హార్దిక్‌ తెలిపాడు. 

మరికొన్ని మ్యాచ్‌ విశేషాలు..

  • పొట్టి కప్‌లో ప్లేయర్ ఆఫ్‌ ది టోర్నీ అవార్డును అందుకొన్న రెండో భారత క్రికెటర్‌గా బుమ్రా నిలిచాడు. గతంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) రెండుసార్లు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు.
  • టీ20 అత్యధిక ప్లేయర్‌ ఆఫ్ ది మ్యాచ్‌లను గెలిచిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇప్పటి వరకు అతడు 125 మ్యాచుల్లో 16 అందుకోగా.. సూర్య 68 మ్యాచుల్లో 15 దక్కించుకున్నాడు.
  • రెండేసి వరల్డ్‌ కప్‌లు గెలిచిన మూడో టీమ్‌ భారత్ (Team India). ధోనీ నాయకత్వంలో 2007లో విజేతగా నిలిచింది. టీమ్‌ఇండియా కాకుండా.. వెస్టిండీస్ (2012, 2016), ఇంగ్లాండ్ (2010, 2022) సాధించాయి.
  • ఒకే టీ20 ప్రపంచ కప్‌లో అత్యధిక విజయాలు సాధించిన రెండో టీమ్‌ భారత్. ఈసారి 8 మ్యాచుల్లో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా కూడా ఇదే ఎడిషన్‌లో ఎనిమిదింట్లో గెలిచింది. 
  • కెప్టెన్‌గా అత్యధిక టీ20ల్లో జట్టును గెలిపించిన క్రికెటర్ రోహిత్ శర్మ (Rohit Sharma). మొత్తం 50 మ్యాచులను నాయకుడిగా గెలిపించాడు. బాబర్‌ అజామ్‌ (49)ను అధిగమించాడు. 
  • టీ20 ప్రపంచకప్‌లో అత్యల్ప ఎకానమీ బౌలర్‌ జస్‌ప్రీత్ బుమ్రా (4.17). ఒకే ఎడిషన్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (17). ఓవరాల్‌గా ఫరూఖితో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. 
  • వరల్డ్‌ కప్ ఫైనల్స్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ గణాంకాలు నమోదు చేసిన నాలుగో బౌలర్‌ హార్దిక్‌ పాండ్య. ఈ మ్యాచ్‌లో 3/20 ప్రదర్శన చేశాడు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని