AUS vs IND: 33 ఏళ్ల తర్వాత 5 టెస్టుల సిరీస్‌.. రికార్డు స్థాయిలో అందుబాటులోకి టికెట్స్‌!

చివరిసారిగా 1991-92 సీజన్‌లో భారత్- ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరిగింది. ఆ తర్వాత నాలుగు లేదా మూడు టెస్టుల్లోనే తలపడుతూ వచ్చాయి. ఇప్పుడు మరోసారి 5 టెస్టుల్లో ఢీకొట్టుకోనున్నాయి.

Published : 05 Jul 2024 16:41 IST

(పాత చిత్రం)

ఇంటర్నెట్ డెస్క్: టెస్టు ఛాంపియన్‌ షిప్‌ 2023-25 (WTC) సీజన్‌లో భాగంగా ఆస్ట్రేలియా-భారత్ జట్లు ఐదు టెస్టుల సిరీస్‌ ఆడనున్నాయి. నవంబర్‌ నుంచి ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. దాదాపు 33 ఏళ్ల తర్వాత బోర్డర్-గావస్కర్‌ ట్రోఫీలో ఇరు జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ జరగనుండటం గమనార్హం. గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆసీస్‌ చేతిలోనే టీమ్ఇండియా ఓడింది. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకొనేందుకు భారత్ సిద్ధం కానుంది. ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దృష్టి ఇకపై టెస్టులపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. డబ్ల్యూటీసీ టైటిల్‌ను కూడా ఖాతాలో వేసుకోవాలనేది రోహిత్‌ ప్లాన్‌. అందుకు ఈ టెస్టు సిరీస్‌ కీలకంగా మారనుంది. 

భారత అభిమానుల కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (AUS vs IND) పెద్దఎత్తున ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య పోరు ఉత్కంఠగా ఉంటుందనే ఉద్దేశంతో భారత అభిమానుల కోసం ప్రత్యేకంగా ‘ఫ్యాన్‌ జోన్స్‌’ను కూడా ఏర్పాటు చేయనుంది. ఈసారి మైదానాల్లో ప్రత్యక్షంగా టీమ్‌ఇండియా అభిమానులు చూసేందుకు వీలుగా ఎక్కువగా టికెట్లను అందుబాటులో ఉంచింది. గత సీజన్‌తో పోలిస్తే అవి దాదాపు ఆరు రెట్లు వరకు అధికంగా ఉంటాయని క్రికెట్ ఆస్ట్రేలియా జనరల్ మేనేజర్‌ జోయల్ మోరిసన్ తెలిపారు. 

‘‘బోర్డర్-గావస్కర్ ట్రోఫీ సిరీస్‌ కోసం ఆస్ట్రేలియా వచ్చేందుకు భారత (Team India) అభిమానులు ఆసక్తి చూపిస్తారు. ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకున్నాం. వారిని సాదరంగా ఆహ్వానించి.. ఈ సిరీస్‌ జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాం. అందులో భాగంగా ఫ్యాన్‌ జోన్‌లను ఏర్పాటు చేస్తున్నాం. మ్యాచ్‌లను ఆస్వాదించడంతోపాటు సంబరాలు చేసుకునే వీలుగా ఈ వేదికలు ఉంటాయి’’ అని జోయల్ స్పష్టం చేశారు.

షెడ్యూల్ ఇలా.. 

  • తొలి టెస్టు: నవంబర్ 22-26 (పెర్త్‌)
  • రెండో టెస్టు: డిసెంబర్ 06-10 (అడిలైడ్)
  • మూడో టెస్టు: డిసెంబర్ 14-18 (బ్రిస్బేన్)
  • నాలుగో టెస్టు (బాక్సింగ్‌ డే టెస్టు): డిసెంబర్ 26-30 (మెల్‌బోర్న్‌)
  • ఐదో టెస్టు: జనవరి 03-07 (సిడ్నీ)
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు